భర్తే కాలయముడై..

Husband Killed Wife With Child In West Godavari - Sakshi

భార్య, ఇద్దరు కుమార్తెలను మంగళవారం పోలవరం కాలులోకి తోసేసిన మృగాడు

మరదలితో వివాహేతర సంబంధం నేపథ్యం..

ఒక బాలికను కాపాడిన స్థానికులు

బుధవారం భార్య మృతదేహం లభ్యం

చిన్నారి కోసం ఈ రోజూ కొనసాగించినున్న గాలింపు

పరారీలో నిందితుడు

పశ్చిమ గోదావరి, పెదవేగి రూరల్‌: మరదలితో పెట్టుకున్న శారీరక సంబంధం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. భార్యను, అభం శుభం తెలియని చిన్నారులను పోలవరం కుడికాలువలో తోసేసిన ఘోర సంఘటన జిల్లాలోని పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  పెదవేగి మండలం న్యాయంపల్లికి చెందిన పరసా నాగరాజుకు కామవరపుకోటకు చెందిన దుర్గా భవానీతో ఐదేళ్ల కిందట వివాహమైంది. వీరికి  జ్యోత్స్న శ్రీనాగదుర్గ, షణ్ముఖి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహానికి ముందే నాగరాజుకు దుర్గాభవాని చెల్లెలికి శారీరక  సంబంధం ఉండేది. అయితే పెద్దలు దుర్గాభవానితో నాగరాజుకు వివాహం చేశారు. వీరి వైవాహిక జీవితం  బాగానే సాగుతుండేది.   ఈ మధ్య కాలంలో జరిగిన ఓ శుభకార్యంలో నాగరాజు అతని మరదలు కలిశారు. ఆమె ఫోన్‌ నంబర్‌ తీసుకున్న నాగరాజు తరచూ ఆమెతో ఫోన్‌లో పాత ముచ్చట్లు కొనసాగించేవాడు.

తన చెల్లెలితో భర్తకున్న శారీరక సంబంధం గురించి దుర్గాభవానికి తెలియటంతో నెల రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది. గొడవ కారణంగా పుట్టింటికి తీసుకువెళ్తానని చెప్పిన నాగరాజు పోలవరం కుడికాలువ గట్టు దగ్గరకు తీసుకువెళ్లి దుర్గాభవానీ, అభం, శుభం తెలియని కుమార్తెలు జ్యోత్స్న శ్రీనాగదుర్గ, షణ్ముఖిలను పోలవరం కాలువలోకి తోసేశాడు. అయితే జ్యోత్స్నను స్థానికులు కాపాడారు. కామవరపుకోటలోని అత్తవారింటికి వెళ్లి మీ కూతుర్ని, మనవల్ని కాలువలో తోసేశానని చెప్పి నాగరాజు అక్కడ నుంచి పారిపోయాడు. మండలంలోని వంగూరు లాకుల వద్ద దుర్గాభవాని(22) మృతదేహం బుధవారం ఫైర్‌ సిబ్బందికి లభ్యమైంది. ఈ గాలింపు చర్యల్లో ఏలూరు రూరల్‌ సీఐ కె.వెంకటే శ్వరరావు, అగ్నిమాపక దళ సిబ్బంది, రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఉన్నారు. అప్పటికే చీకటి పడడంతో గల్లంతైన షణ్ముఖి కోసం గురువారం గాలించనున్నారు. నాగరాజును పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టు ఎస్సై వి.కాంతిప్రియ చెప్పారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top