ప్రేముంచేశాడు..!

Husband And Friends Molestation on Wife in Odisha - Sakshi

ప్రేమించి, పెళ్లి చేసుకున్న భార్యపై సామూహిక లైంగికదాడికి ఉసిగొల్పిన భర్త

నవరంగపూర్‌ జిల్లాలో వెలుగుచూసిన ఘటన

బాధితురాలి ఫిర్యాదు మేరకు విషయం బట్టబయలు

కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు

ఒడిశా, జయపురం: ప్రేమించాడు.. అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి జీవితాంతం తోడుంటానని నమ్మించాడు.. పెళ్లి కూడా చేసుకున్నాడు.. అయితే పెళ్లయిన నెలకే ఆమెను వదిలించుకునేందుకు శతవిథాల ప్రయత్నించాడు. ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. ఆఖరికి తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక లైంగికదాడికి ఒడిగట్టాడు.నవరంగపూర్‌ జిల్లాలోని ఉమ్మర్‌కోట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చొడైగుడ గ్రామానికి చెందిన సజు హరిజన్‌ తన సొంత భార్యపై స్నేహితులతో కలిసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె చేతులు, కాళ్లు కట్టిపడేసి, ముఖంపై వస్త్రం కప్పి తన ముగ్గురు స్నేహితులతో ఆమెపై లైంగికదాడికి ఉసిగొల్పాడు. అనంతరం అతడు కూడా లైంగికదాడికి పాల్పడ్డాడు. అగ్నిసాక్షిగా కట్టుకున్న భర్తే ఈ ఉదంతానికి పాల్పడడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకిత్తిస్తోంది. ఇదే విషయంపై బాధితురాలు ఉమ్మరకోట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది. ఇదే విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని ఉమ్మరకోట్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. లైంగికదాడి జరిగినట్లు వైద్యులు నిర్దారించగా, అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు.

వివరాలిలా ఉన్నాయి..
చొడైగుడ గ్రామానికి చెందిన బాధిత మహిళ అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లిచేసుకుంది. వారిద్దరి ప్రేమను బాధిత మహిళ తల్లిదండ్రులు నిరాకరించడంతో అతడిపై ఉన్న ప్రేమతో తన తల్లిదండ్రులను ఎదిరించి మరీ, అతడిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇంటికి దూరమైంది. భర్తే సర్వశ్వమని నమ్మిన ఆమెకు అత్తవారింటిలో కూడా సముచిత గౌరవం దక్కలేదు. అటు కన్నవారు, ఇటు అత్తవారు ఎవ్వరూ ఆదరించకపోవడంతో రాయిఘర్‌ సమీపంలోని ఓ అద్దె ఇల్లు తీసుకుని, కాపురం పెట్టింది. ఆ తర్వాత నెల రోజుల పాటు వారు ఆనందంగా కలసిమెలసి ఉన్నారు. ఆ తర్వాత మెల్లమెల్లగా వారి మధ్య మనస్పర్దలు మొదలై అవి కాస్త పెరిగాయి. ఈ క్రమంలో ఆమెను ఇంటి నుంచి ఓ సారి ఏకంగా పంపించేశాడు కూడా. అప్పటిలో ఇదే విషయంపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిద్దరినీ స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు కౌన్సిలింగ్‌ నిర్వహించి, కలసిమెలసి ఉండాలని సూచించారు.

ఆ తర్వాత ఇద్దరూ ఒక్కటిగా ఉన్నా భర్త తరచూ పెట్టే హింసను తాళలేక ఆత్మహత్యకు ఆమె పాల్పడింది. అయినా అన్నీ ఓర్చుకుని అతడితోనే ఉంది. అయితే ఈ నెల 13వ తేదీ సాయంత్రం అలా బయట తిరిగొద్దాం రా చెప్పి ఆమెను సజు హరిజన్‌ తీసుకువెళ్లాడు. అలా వారు మొదట ఉమ్మర్‌కోట్‌ వెళ్లి, అక్కడి నుంచి యువీ(ఉమ్మర్‌కోట్‌ విలేజ్‌)–52లోని ఫాంహౌస్‌ వద్ద ఉన్న చెరువు దగ్గరకు వెళ్లారు. రాత్రి 9 గంటలైంది పదా పోదామంటే లేదు తన స్నేహితులు వస్తారని ఇక్కడే కాసేపు ఉండాలని పట్టుబట్టాడు. కొంత సమయం తర్వాత ఓ మోటారుబైక్‌పై ముగ్గురు యువకులు రాగా వారితో ఆమె భర్త ఏదో మాట్లాడి, ఆ తర్వాత భార్య దగ్గరకు వచ్చిన సజు, ఆ ముగ్గురు వ్యక్తుల సహాయంతో తన భార్య చేతులు, కాళ్లు కట్టేసి, ఆమెపై లైంగికదాడికి పాల్పడేందుకు సహకరించాడు. ఈ క్రమంలో ఎంత అరిచినా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ మరుసటి రోజు ఉదయం ఆమెకు మెలకువ రావడంతో అక్కడి నుంచి అతికష్టం మీద పారిపోయి బయటపడింది. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు చేరి, పోలీసులకు ఫిర్యాదులో వివరాలు వెల్లడించింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top