రూ. వంద కోట్లకు ముంచాడు | Sakshi
Sakshi News home page

రూ. వంద కోట్లకు ముంచాడు

Published Mon, Dec 3 2018 9:59 AM

Chitfund Company Owner Cheated Hyderabad People - Sakshi

రాంగోపాల్‌పేట్‌: బిడ్డ పెళ్లి కోసం పైసా పైనా కూడబెట్టిన వారు కొందరు, పిల్లల చదువుల కోసం దాచుకున్న వారు ఇంకొందరు, ఎక్కువ మొత్తంలో వడ్డీ వస్తుందనే ఆశతో మరికొందరు.. ఇలా చిట్టీలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల పేరుతో చెల్లించిన కోట్ల రూపాయలు దండుకుని ఉడాయించాడో వ్యక్తి. మూడు  రోజులుగా ఇంటికి తాళం వేసి బో ర్డు తిప్పేసి కనిపించకుండా పోవడంతో లబోదిబోమంటూ బాధితులు మహంకాళి పోలీసులను ఆశ్రయించారు.  ఈ సొమ్ము సుమారు వంద కోట్లపైగానే ఉంటుందని బాధితులు వాపోతున్నారు. పోలీసులు, మహంకాళి పోలీసులు తెలిపిన మేరకు.. సుభాష్‌రోడ్‌ ఓల్డ్‌బోయిగూడకు చెందిన శైలేష్‌ గుజ్జర్, భార్య నందినితో కలిసి 1998 సంవత్సరం లో అక్కడే శ్రీ రిషబ్‌ చిట్‌ఫండ్‌ ఇండియ ప్రైవే ట్‌ లిమిటెడ్‌ను స్థాపించాడు. చిట్టీలు, ఫిక్స్‌డ్‌ డిపాజి ట్లు తీసుకుని వారి నుంచి పెద్ద మొత్తంలో డ బ్బు వసూళ్లు చేశాడు. లక్ష రూపాయల నుంచి రూ. 50లక్షల చిట్టీలను నిర్వహించే వాడు. గత 20 ఏళ్లుగా  ప్రజల నుంచి ఎంతో నమ్మకం సంపాదించాడు. 

వడ్డీ ఆశచూపి...
చిట్టీలు పూర్తయిన తర్వాత వారికి డబ్బు చెల్లించకుండా రూ.2 వడ్డీకి తానే తీసుకుని వడ్డీ చెల్లించేవాడు. ఇలా లక్ష నుంచి కోటి రూపాయల వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లుగా తీసుకుంటూ వడ్డీ చెల్లించేవాడు. ఇలా సుమారు వెయ్యి మంది వరకు బాధితులు ఉన్నట్లు తెలిసింది. రిజిష్టర్‌ చిట్టీల నిర్వాహకులు కవాడిగూడలోని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌ వద్ద డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో  సంతకాలు పోర్జరీ చేసి ఆ డబ్బును కూడా సొంతానికి వాడుకున్నాడు. మూడు, నాలుగు సంవత్సరాల నుంచి చిట్టీ డబ్బులు చెల్లించడంతో శైలేష్‌ ఇబ్బందులు పడుతున్నాడు. అప్పటి నుంచి కూడా చాలా మందికి రేపు, మాపు అంటూ డబ్బు చెల్లించకుండా వాయిదాలు వేస్తూ వస్తున్నాడు.  మూడు రోజుల క్రితం ఇంటికి, దాని కిందనే ఉన్న కార్యాలయానికి తాళం వేసి ఉడాయించాడు. 

విలాసవంతమైన జీవితం....కోట్ల ఆస్తులు
శైలేష్‌ ఈ వ్యాపారంలో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలిసింది. విలాసవంతమైన జీవితం జీవిస్తూ చాలా చోట్ల స్థిర చరాస్తులు కొనుగోలు చేశారు. రూ.50లక్షల విలువ చేసే ఒక ఆడి కారుతో పాటు మరో 3 కార్లు ఉండేవి. అలాగే రాజ్‌భవన్‌ రోడ్డులో ఇతని స్నేహితుడితో కలిసి ఒక బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నడిపించాడు.  కొద్ది సంవత్సరాల క్రితం ఇదే భాగస్వామితో కలిసి గోవాలో రూ.20కోట్లు వెచ్చించి క్యాసినో కూడా నడిపించాడు. కొంత మంది సినిమా వాళ్లతో ఉండే స్నేహంతో సినిమా పరిశ్రమలో కూడా కొంత ఫైనాన్స్‌ చేసినట్లు తెలిసింది. తన కార్యాలయంలో 15 మంది సిబ్బంది పనిచేసేవారు. 

సొంత సామాజిక వర్గం వారే 500 మంది
శైలేష్‌ బహుసార్‌ క్షత్రియ సమాజ్‌ (మరాఠీ)కి చెందిన వ్యక్తి. చాలా కాలం చిట్టీల వ్యాపారం బాగా చేస్తుండటంతో ఇతని సామాజిక వర్గానికి చెందిన వారే సుమారు 500 మంది వరకు పెట్టుబడులు పెట్టారు. ఇటీవల బాధితులు నిర్వహించిన సమావేశంలో 300 మంది పాల్గొనగా మరో సగం మంది హాజరు కాలేదంటే ఇంకెంత మంది భాధితులు ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న బాధితులు ఒక గ్రూప్‌గా అయి అంచనా వేస్తే వీరు సుమారు రూ.70 కోట్ల వరకు మోసపోయినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా కొంతమంది శైలేష్‌ నుంచి తమకు రావాల్సిన బకాయిలు వసూళ్లు చేసినట్లు తెలిసింది. కళాసీగూడకు చెందిన వ్యక్తికి రూ.40 నుంచి 50లక్షలు రావాల్సి ఉండగా భువనగిరిలో ఉన్న శైలేష్‌కు చెందిన 1200 గజాల స్థలం తమ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు తెలిసింది.  శైలేష్‌కున్న ఆడికారు కొంత మంది లాక్కుని వెళ్లగా మరికొన్ని స్థలాలు కూడా తమ పేరు మీద రిజిష్ట్రర్‌ చేసుకున్నారని బాధితులు చెబుతున్నారు.  మహంకాళి పోలీసులు 11 మంది బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement