సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభం
అనంతపురం : అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండల పరిధిలోని నాగలాపురం గ్రామ పరిసరాల్లో 600 ఎకరాల్లో రూ.848 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన 50 మెగావాట్ల సోలార్ థర్మల్ పవర్‌ప్లాంట్ (కాన్సన్‌ట్రేటెడ్ సోలార్ పవర్-సీఎస్‌పీ) నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ప్లాంట్ ఏర్పాటు చేసిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ప్రతినిధులు బుధవారం మీడియాను ఆహ్వానించి ప్లాంట్ ఏర్పాటు, సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
ఈనెల 4 నుంచి రోజూ 17 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని, నెలాఖరుకు రోజుకు 50 మెగావాట్లు ఉత్పత్తి చేస్తామని చెప్పారు. పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. ఈ తరహా ఆధునిక సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ దక్షిణ భారతదేశంలోనే మొదటిదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ సోలార్ మిషన్(జేఎన్‌ఎన్‌ఎన్ ఎస్‌ఎం).. ఎన్‌టీపీసీ అనుబంధమైన విద్యుత్ వ్యాపార నిగమ్‌కు ఈ ప్లాంట్‌ను మంజూరు చేసిందని ఎంఈఐఎల్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఉమామహేశ్వర్‌రెడ్డి తెలిపారు.
అమెరికా, చైనా, ఇజ్రాయిల్, ఇటలీ, పోర్చుగల్ దేశాల నుంచి ఆధునిక యంత్ర పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం దిగుమతి చేసుకుని అనుకున్న సమయానికి ప్లాంటు నిర్మాణం చేశామని చెప్పారు. సంప్రదాయక ఫొటో వోల్టాయిక్ పద్ధతిలో కాకుండా, సౌరకాంతిని, వేడి నీటిని వికేంద్రీకరించడం ద్వారా ఆవిరి ఉత్పత్తి అవుతుందన్నారు. అనంతరం టర్బైన్ల ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. 600 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంటు ఏర్పాటుకు రూ.848 కోట్లు ఖర్చు చేశామన్నారు. 5400 సౌరఫలకాలు (పారాబోలిక్ ట్రఫ్) అమర్చామన్నారు.
ఇవి వాతావరణానికి అనుగుణంగా ఆటోమేటిక్‌గా తిరుగుతూ సౌరశక్తిని గ్రహిస్తాయని తెలిపారు. మేఘాలు ఆవరించినా, వర్షాకాలం, చలికాలంలో కొద్దిగా ఉత్పత్తి తగ్గినా వేసవిలో అనుకున్న దాని కన్నా ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. రోజుకు 30 వేల గృహాలకు సరిపడా 3 లక్షల యూనిట్లు ఏటా సరాసరి 111 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అందులో 10 శాతం ప్లాంట్ల నిర్వహణకు వాడుకుని తక్కిన విద్యుత్‌ను ఎన్‌టీపీసీ గ్రిడ్‌కు అందజేస్తామన్నారు. ఎన్‌టీపీసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ఒక్కో యూనిట్‌ను రూ.11.30 ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.