నాయకులొస్తున్నారు.. | Sakshi
Sakshi News home page

నాయకులొస్తున్నారు..

Published Thu, Mar 14 2019 4:03 PM

YS Jagan Election Campaign March 17 At Bhogapuram - Sakshi

ఎన్నికల కోలాహలం మొదలైంది. నోటిఫికేషన్‌ విడుదలకు ముందుగానే హడావుడి ప్రారంభమైంది. ఇప్పటికే ఎవరికివారే అభ్యర్థిత్వాలు ఖరారు చేయించుకుని ప్రచారానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా... అధినేతల ప్రచారానికి తేదీలు ఖరారు కావడంతో జిల్లాలో వాతావరణం వేడెక్కుతోంది. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 17న జిల్లాకు రానున్నట్టు అధికారిక సమాచారం. ఆయన భోగాపురంలోని బహిరంగ సభలో పాల్గొననున్నారు. అదేరోజు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం జిల్లాకు రానున్నట్టు పార్టీ సమాచారం.

సాక్షిప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్‌సీపీ అధినేత, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 16వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెడుతున్నారు. ఆ మరుసటి రోజే  విజయనగరం జిల్లాకు రానున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురంలో ఈ నెల 17వ తేదీ ఉదయం జగన్‌ ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రాం కమిటీ కన్వీనర్‌ తలశిల రఘురామ్‌ బుధవారం వెల్లడించారు.


మహోన్నత ఘట్టం అనంతరం...    

జనం కోసం వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో జన జాతరలా సాగింది. 2017 నవంబర్‌ 6వ తేదీన వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం ఇడుపుల పాయలో మొదలుపెట్టిన ప్రజా సంకల్పయాత్ర 2018 సెప్టెంబర్‌ 24న విజయనగరం జిల్లాలో ప్రవేశించి నవంబర్‌ 25న ముగిసింది.

36 రోజుల పాటు జగన్‌ పాదయాత్ర చేశారు. సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలో అక్టోబర్‌ 25న పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్‌ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న జగన్‌పై హత్యాయత్నం జరగడం జిల్లా ప్రజలను తీవ్రంగా కలచివేసింది. 17 రోజులకే జగన్‌ మళ్లీ జిల్లాలో జనం మధ్యకు వచ్చి చిరునవ్వుతో వారిని పలకరించడంతో మళ్లీ యాత్ర కొనసాగింది.


జగనన్న రాకకోసం...: 

రెండు నెలల పాటు పాదయాత్ర కోలాహలాన్ని చూసిన జిల్లా ప్రజలు మరోసారి జగన్‌మోహన్‌రెడ్డి రాకకోసం ఎదురుచూస్తున్నారు. అదే రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా జిల్లాకు వస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అధికారికంగా ఆయన పర్యటన ఖరారు కానప్పటికీ ఈ నెల 17న సాలూరులో ఎన్నికల ప్రచారసభలో చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉంది. ఒకేరోజు రెండు ప్రధాన పార్టీల అధినేతలు జిల్లాకు వస్తుండటంతో ఆయా పార్టీల నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.  

Advertisement
Advertisement