తూర్పున టీడీపీ బరితెగింపు! | Sakshi
Sakshi News home page

తూర్పున టీడీపీ బరితెగింపు!

Published Sat, Mar 2 2019 7:33 AM

TDP Leaders Target to YSRCP Voters - Sakshi

విశాఖపట్నం: విశాఖ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బరి తెగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో భయానక సంస్కృతికి బాటలు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రత్యర్థ పార్టీల కార్యకర్తలు, నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని నకిలీ ఓట్లు నమోదులో మాయాజాలం సృష్టిస్తున్న ఆ పార్టీ నాయకులు ప్రస్తుతం వాటిని సరిదిద్దేందుకు ప్రయత్నస్తున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై ప్రత్యక్ష బెదిరింపులకు దిగుతున్నారు. శుక్రవారం ఇలాంటి సంఘటన ఒకటి వెలుగు చూడటం నియోజకవర్గ వాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ బెదిరింపు సంఘటనకు సంబంధించిన ఆడియా రికార్డులు నగరంలో హల్‌ చల్‌ సృష్టిస్తున్నాయి.

ఎందుకు తలదూరస్తున్నావ్‌
ఇటీవల తూర్పు నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో నకిలీ ఓట్లు గుర్తించడంతో పాటు తొలగింపు ప్రక్రియ జరుగుతోంది. తొలగించిన అర్హత గలవారి ఓట్లును సైతం తిరిగి నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో వైఎస్సార్‌ సీపీ వార్డు స్థాయి శ్రేణులు చురుగ్గా పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ 8వ వార్డుకు చెందిన బూత్‌ కన్వీనర్‌ రాజు కొన్ని రోజులుగా అనధికారిక ఓట్లు గుర్తింపు, తొలగింపు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఆధ్వర్యంలో కొన్ని అనధికార ఓట్లు తొలగింపు జరిగింది. అయితే ఇది మింగుడు పడని టీడీపీ నాయకులు రాజుపై కత్తికట్టారు. రాజు తీరుపై ఆగ్రహించారు. టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి, 8వ వార్డు మాజీ కార్పొరేటర్‌ చోడే పట్టాభిరామ్‌ నేరుగా రాజుపై బెదిరింపులకు దిగారు.

అతనికి ఫోన్‌ చేసి ఓట్లు తొలగింపు అంటూ ఎందుకు తలదూరిస్తున్నావ్, నీకు అవసరమేంటీ, నీ పనేదో నువ్వు చూసుకోకుండా ఎక్‌ట్రాలు ఎందుకు చేస్తున్నావ్‌ అంటూ బెదిరించారు. ఓట్లు తీయించడాలు చేస్తే తరువాత వేరేగా సమాధానం చెప్పాల్సి ఉంటుందంటూ హెచ్చరికలు చేశారు. అంతేకాదు పట్టాభిరామ్‌ వ్యాఖ్యలను సమర్థిస్తూ 17వ వార్డు టీడీపీ అధ్యక్షుడు పోతన్న రెడ్డి కూడా రాజు భయాందోళనకు గురిచేసినట్లు ఆడియో రికార్డుల్లో వ్యక్తమైంది. అయితే టీడీపీ నాయకులు ఇలా ప్రతేక్ష్యంగా బెదిరింపులకు దిగడంతో రాజు దాటవేత సమాధానాలు చెప్పక తప్పలేదు. ఈ ఘటన ప్రస్తుతం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నాయకులు తీరుపై నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆడియో రికార్డులు తూర్పు నియోజకవర్గంతో పాటు నగరంలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. నియోజవర్గ వాసులు పలువరు స్పందిస్తూ ఇది టీడీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శమని పేర్కొంటున్నారు. ఎమ్మెల్యే వెలగపూడి అనుచరులు తూర్పు నియోజకవర్గాన్ని రౌడీ రాజ్యంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడుతున్నారు.

Advertisement
Advertisement