ఆగని టీడీపీ నాయకుల దౌర్జన్యకాండ | Sakshi
Sakshi News home page

కొత్తచెరువులో తీవ్ర ఉద్రిక్తత 

Published Sun, Jul 14 2019 9:12 AM

TDP Leaders And Activists Attack YSRCP Activists - Sakshi

సాక్షి, బుక్కపట్నం: కొత్తచెరువులో టీడీపీ నాయకులు, కార్యకర్తల తీరుతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వివరాలిలా ఉన్నాయి..తొలి ఏకాదశిని పురస్కరించుకుని శనివారం స్థానిక నాగులకనుమ వద్ద ఎండ్లబండ్ల పోటీలు నిర్వహించారు. టీడీపీ జిల్లా నాయకుడు సాలక్కగారి శ్రీనివాసులు, అనుచరులు బండ్లకు టీడీపీ జెండాలు కట్టుకున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కూడా ఆపార్టీ జెండాలు కట్టుకుని పోటీలలో పాల్గొన్నారు. అక్కడే ఉన్న టీడీపీ నాయకుడు సాలక్కగారి శ్రీనివాసులు తన అనుచరులతో జెండా కట్టెలతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. దాడిలో వడ్డె సామాజిక వర్గానికి చెందిన శేఖర్, బాలాజీ, మౌళి, సరళ తదితరులు తీవ్రంగా గాయపడ్డారు.

వీరిలో ఇద్దరిని పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలియడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు టీడీపీ నేత శ్రీనివాసులు ఆయన అనుచరులను అరెస్టు చేయాలని కోరుతూ కొత్తచెరువు పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. దీంతోపాటు ప్రధాన కూడలి నెహ్రూ, వైఎస్సార్‌ సర్కిల్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న ధర్మవరం డీఎస్పీ వెంకటరమణ, సీఐలు వెంకటేష్‌నాయక్, అస్రార్‌బాషా, పలువురు ఎస్‌ఐలు కొత్తచెరువు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆత్మహత్యయత్నం.. 
నిందితులను అరెస్టు చేయకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త బాలాజీ పోలీస్‌స్టేషన్‌లోనే ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు, వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకున్నారు. కార్యక్రమంలో ఎల్లప్ప, వెంకట్రాముడు, వాల్మీకి శంకర్, బుల్లెట్‌ మధు, అరిగిల శివ,భాస్కర్, రాము తదితరులు పాల్గొన్నారు. 

నిందితులను అరెస్టు చేయండి 
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేసిన వారు ఎంతటి వారైనా  వెంటనే అరెస్టు చేయాలని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పోలీసులను ఫోన్‌లో ఆదేశించారు.  ప్రశాంత వాతావరణంలో ఎండ్లబండ్ల పోటీలు నిర్వహంచకుండా టీడీపీ నాయకులు అరాచకాలకు పాల్పడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభధ్రతల విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. 

దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం  
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మవరం డీఎస్పీ వెంకటరమణ చెప్పారు. ఎండ్లబండ్ల పోటీలలో మొదట టీడీపీ నాయకులు పార్టీ జెండాలతో వచ్చారని, ఆతర్వాతే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పార్టీ జెండాలతో వచ్చారన్నారు. వారిపై టీడీపీ నేత సాలక్కగారి శ్రీనివాసులు  ఆధ్వర్యంలో దాడి జరిగినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని, నిందితులపై కేసు నమోదు చేస్తామని డీఎస్పీ విలేకరులతో పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement