జీజీహెచ్ స్ట్రోక్ యూనిట్‌కు రూ.22లక్షలు | Sakshi
Sakshi News home page

జీజీహెచ్ స్ట్రోక్ యూనిట్‌కు రూ.22లక్షలు

Published Tue, Mar 24 2015 2:35 AM

Jijihec Rs 22 lakh per stroke

ఏఎంజీ ఇంటర్‌నేషనల్ సంస్థ వితరణ
 
గుంటూరు మెడికల్ : భారతదేశంలో పేదరోగులకు వివిధ రకాల వైద్యసేవలను అందించేందుకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న జర్మనీకి చెందిన డాక్టర్ కొర్నిలియా కెరాజ్, డాక్టర్ నికోలస్ కొనెస్కో జీజీహెచ్ న్యూరాలజీ వైద్యవిభాగం స్ట్రోక్ యూనిట్ ఏర్పాటుకు రూ.22,52,500 ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఆ నగదును సోమవారం చెక్కు రూపంలో న్యూరాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారికి పంపించారు. గత నెల 20న  ఆస్పత్రిలోని న్యూరాలజీ వైద్య విభాగాన్ని వారు  సందర్శించారు. కుష్టువ్యాధి, క్షయవ్యాధి, హెచ్‌ఐవీ బాధితులకు జిల్లాలోని చిలుకలూరిపేట ఏఎంజీ ఇండియా ఇంటర్‌నేషనల్ సంస్థ ద్వారా కొంత కాలంగా వారు ఆర్థిక సహాయాన్ని అందించి వైద్యసేవలను అందేలా చూస్తున్నారు.

సంస్థ డైరక్టర్ డాక్టర్ అరుణ్‌కుమార్ మొహంతిని ఇటీవల కాలంలో డాక్టర్  సుందరాచారి కలిసి  న్యూరాలజీ వైద్య విభాగంలో సుమారు రెండుకోట్ల రూపాయలతో పక్షవాతం రోగులకు స్ట్రోక్‌యూనిట్ ఏర్పాటుచేసేందుకు ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు.  పక్షవాతం రోగులకు  గ్రామీణ ప్రాంతాలకు తామే స్వయంగా వెళ్లి ఉచితంగా వైద్యసేవలను అందిస్తున్న విషయాన్ని  డాక్టర్ సుందరాచారి జర్మనీ వైద్యులకు వివరించారు. తమ విభాగంలో 10 మంది న్యూరాలజీ వైద్య నిపుణులు చిత్తశుద్ధితో రోగులకు వైద్యసేవలను అందిస్తున్నట్లు తెలిపారు.

పక్షవాతం వచ్చిన వెంటనే స్ట్రోక్‌యూనిట్‌లో ఉంచి వైద్యం చేయడం వల్ల ప్రాణాలు కాపాడే అవకాశం ఉందన్న విషయాన్ని వివరించారు. డాక్టర్ సుందరాచారి రోగులకు చేస్తున్న వైద్యసేవల గురించి, వార్డును అభివృద్ధి చేసిన పనితీరును  ప్రత్యక్షంగా చూసిన జర్మనీ వైద్యులు సంతోషం వ్యక్తం చేసి, నెలరోజుల వ్యవధిలోనే ఆర్థిక సహాయాన్ని పంపించడంపై పలువురు వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక సహాయాన్ని అందజేసిన జర్మనీ వైద్యులకు, ఏఎంజీ డెరైక్టర్ డాక్టర్ అరుణ్‌కుమార్ మహంతికి  కృతజ్ఙతలు తెలిపారు. స్ట్రోక్ యూనిట్‌ను త్వరలోనే ప్రారంభించి గ్రామీణ పేదరోగులకు మెరుగైన వైద్యసేవలను సత్వరమే అందేలా చేస్తామని డాక్టర్ సుందరాచారి వెల్లడించారు.

Advertisement
Advertisement