దయలేని పుత్రులు | Sakshi
Sakshi News home page

దయలేని పుత్రులు

Published Wed, May 27 2015 3:04 AM

దయలేని పుత్రులు

ఐదేళ్లుగా తల్లిని పట్టించుకోని తనయులు
వృద్ధాశ్రమాల్లో కాలం వెల్లదీసిన మాతృమూర్తి
అమ్మ ఆఖరి చూపునకూ రాని కొడుకులు
పరమాత్మ ఆధ్వర్యంలో అంత్యక్రియలు

 
 నవమాసాలు మోసి .. రక్తం పంచి జన్మనిచ్చిన తల్లిని వృద్ధాప్యంలో కాలదన్నారు.. ఆమె వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతోందనే విషయం తెలిసినా  పట్టించుకోలేదు. చివరకు ఆమె కన్నుమూసినా కన్నతల్లిని కడసారైనా చూద్దామనుకోలేదు. కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ పుత్రుల తీరును చూసిన వారు తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి అన్న ప్రజాకవి యోగి వేమన మాటల్ని గుర్తు చేసుకున్నారు.
 
 కడప అర్బన్ :   ఆమె పేరు పోలు సుబ్బమ్మ(85). కడప నగరానికి చెందిన ఈమెకు ఐదుగురు సంతానం. ఒక కొడుకు చనిపోగా ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. వీరిలోఒకరిపేరు జగదీశ్వరరెడ్డి. ఇతను కడపలో న్యాయవాదిగా ఉన్నారు. మరో కొడుకు పేరు పోలు రామసుబ్బారెడ్డి. తెలుగుగంగలో సూపరింటెండెంట్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. మరో కుమారుడు బలరామిరెడ్డి. ఇతను ఆర్టీసీలో మెకానిక్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు.

ఆమె కుమార్తె పేరు ఉమాదేవి. ఇంతమంది ఉండికూడా ఆమెను పట్టించుకోలేదు.  ఐదేళ్లుగా ఆమె వృద్ధాశ్రమాల్లోనే కాలం వెల్లదీస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో  ఆరు నెలల క్రితం ఆమె కడప నగ రంలోని చిన్నచౌకు వార్డు కార్యాలయం సమీపంలో దీనస్థితిలో పడిపోయి ఉండగా మానవహక్కుల వేదిక కన్వీనర్ జయశ్రీ స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత గుడ్‌హార్ట్ ఫౌండేషన్ నిర్వాహకులు ఆమెను చేరదీశారు. ఈ విషయాలన్నీ ఆమె బిడ్డలకు తెలిసినా వారు స్పందించలేదు.

ఈ నేపథ్యంలో వారం రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడిన సుబ్బమ్మ ఈనెల 25న తుదిశ్వాస విడిచింది. ఆశ్రమ నిర్వాహకులు ఆమె మృతి చెందిన విషయాన్ని ఆమె కొడుకులకు తెలిపారు. అంత్యక్రియలకైనా కొడుకులొస్తారేమోనని ఎదురు చూశారు. అయినప్పటికీ వారిలో చలనంలేదు. దీంతో పరమాత్మ సేవాసంస్థ ఛైర్మన్, ఏఎస్‌ఐ మలిశెట్టి వెంకటరమణ తమ సంస్థ సభ్యులతో కలిసి దహన సంస్కారాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. చివరి క్షణంలో వచ్చిన ఆమె కుమారుడు బలరామిరెడ్డి తల్లి మృతదేహాన్ని కొంతదూరమైనా మోస్తారేమోనని భావించిన వారికి చేదు అనుభవమే ఎదురైంది.

నాకంటే పెద్దోళ్లు ఉన్నారు.. వాళ్లకు పట్టంది.. నేనెలా భుజం పడతానంటూ ఆయన తిరస్కరించడం గమనార్హం. పరమాత్మ వెంకటరమణ, గుడ్‌హార్ట్ ఫౌండేషన్ నిర్వాహకులు హరినాథ్ ప్రసాద్‌లు  పోలు సుబ్బమ్మ మృతదేహానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోపరమాత్మ సేవాసంస్థ సభ్యులు రామరాజు, వంకదారి రాము, బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అయ్యవారయ్య, శివరాం, కార్తీకేయ, సెల్వం పాల్గొన్నారు.

Advertisement
Advertisement