2,476 మరణాలు

Bike Accidents in Anantapur - Sakshi

హెల్మెట్‌ వినియోగంపై ద్విచక్ర వాహనదారుల అశ్రద్ధ

ప్రమాదాల్లో అత్యధికం ద్విచక్ర వాహనదారులే మృత్యువాత

మూడు రోజుల క్రితం నగరంలో కృష్ణథియేటర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బుక్కరాయసముద్రం మండల కేంద్రానికి చెందిన అమ్మిశెట్టి సత్యనారాయణ(35) మృతి చెందారు. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తే అక్కడ కూడా చనిపోతారా? అనే ప్రశ్నలు ఉత్పన్నం కాకమానదు. ద్విచక్ర వాహన వేగం అక్కడ 10 కిలోమీటర్లకు మించి వెళ్లే పరిస్థితి లేదు. అంతగా రద్దీ ఉంటుంది. అయినప్పటికీ అదుపుతప్పి కింద పడడంతో సత్యనారాయణ తలకు తీవ్రగాయాలై అక్కడకిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.  

తాజాగా గురువారం కూడేరు మండలం గొటుకూరు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఇన్నోవా కారు ఢీ కొనడంతో శ్రీనివాసులు అనే వ్యక్తి మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.  మృతునికి ఐదు మంది కుమార్తెలున్నట్లు తెలిసింది. బతుకుతెరువు కోసం వేరుశనగ వ్యాపారానికి వెళ్లి మృత్యువాత పడ్డారు.  ఈ ఘటనలన్నింటినీ పరిశీలిస్తే ద్విచక్ర వాహనదారులే ఎక్కువ మంది మృతి చెందుతున్నారు. అందులోనూ హెల్మెట్‌ ధరించకపోవడం వలన మృతి చెందారు.  

అనంతపురం సెంట్రల్‌: రోడ్డు ప్రమాదాలు అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి దిక్కుతోచని స్థితిలోకి పడిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నా వాహనదారులు అవగాహన కొరవడం కారణంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాల రూపంలో మృత్యువాత పడుతున్నారు. ఇందులో ద్విచక్ర వాహన దారులే మృతి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కువ శాతం పేద, మద్య తరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తులు అకాలంగా మృత్యువాత పడుతుండటంలో ఆయా కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. 

ప్రాణాలు పోతున్నా శిరోభారమా?
రోడ్డు ప్రమాదాలు నివారించడానికి పోలీసులు పంచ సూత్రాలను పాటించాలని వాహనదారులకు సూచిస్తున్నారు. హెల్మెట్, సీటుబెల్టు వినియోగం,  అతివేగం, పరిమితికి మించి, తాగి వాహనాలు నడపకూడదని పోలీసులు పదేపదే సూచిస్తున్నారు. అయినప్పటికీ వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. పోలీసులు చూస్తే ఎక్కడ జరిమానాలు విధిస్తారోననే భయంతో వారి ముందు వాడుతున్నారు తప్పా నిరంతరం వినియోగించడం లేదు. ఫలితంగా ప్రమాదవశాత్తు జరిగే ప్రమాదాల్లో ప్రాణాలను ఎవరూ కాపాడలేకపోతున్నారు.  

రోడ్డు ప్రమాదాల ప్రత్యేక దృష్టి
రోడ్డు ప్రమాదాలు నివారించడంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎక్కువశాతం హెల్మెట్స్, సీట్‌ బెల్టుపై దృష్టి పెట్టి కేసులు నమోదు చేయాలని సిబ్బందికి ఆదేశించాం. వాహనదారులు కూడా రోడ్డు ప్రమాదాలు నివారించడానికి సహకరించాలి. పంచసూత్రాలు పాటించాలి. తరుచూ రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేయడంతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌లు రద్దు చేస్తాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top