రామోజీరావు మరీ బరి తెగించి ఇలాంటి కల్పితాలు..!

KSR Comment On Eenadu Article Of AP Roads - Sakshi

ఈనాడు మీడియా  ఎంత నీచంగా వార్తలు ఇస్తోందో  గమనిస్తే అసహ్యం కలుగుతుంది. తనకు పత్రిక, టివీ చానల్ ఉన్నాయి కదా అని ఇష్టారాజ్యంగా కథనాలు ఇస్తూ పరువు తీసుకుంటోంది. పైగా రాష్ట్రం పరువు ఏదో పోయిందంటూ చెత్త వ్యాఖ్యానం చేస్తోంది.ఉదాహరణకు నవంబర్ ఆరో తేదీన ఈనాడు పత్రిక ఏపీ పత్రిక బానర్ ఐటమ్ చూడండి. తెలంగాణలో డబుల్ లైన్ రోడ్లు ఉంటే ఏపీలో సింగిల్ లైన్ రోడ్లు ఉన్నాయని కేసీఆర్‌ అన్నారట. అంతే .. ఈనాడు మీడియా  ఏపీలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విజృంభించింది.  

నాలుగేళ్లుగా ఏపీలో రోడ్లే వేయలేదని పచ్చి అబద్దాలు రాసేసింది. ఆ వార్త చదివితే ఏపీలో అసలు రోడ్లే లేవేమోనన్న అనుమానం వస్తుంది. ఇదంతా ముఖ్యమంత్రి  జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఈనాడు రామోజీరావు మరీ బరి తెగించి ఇలాంటి కల్పిత గాధలు ఇస్తున్నారు. ఏవో కొన్ని పోటోలు వేసి తెలంగాణలో రోడ్లు అన్నీ బాగున్నాయని, ఏపీలో బాగోలేదని ఏపీపై తన అక్కసు వెళ్లగక్కింది. పోనీ నిజంగానే తెలంగాణలో కేసీఆర్‌ అంత బాగా రోడ్లు వేశారని అనుకుంటే ఆ కథనాన్ని, ఆ ఫోటోలను తెలంగాణ ఈనాడు ఎడిషన్‌లో కూడా వేయాలి కదా! కేసీఆర్‌ బ్రహ్మండం అని రాయాలి కదా! కాని అలా చేయలేదు. కేవలం ఏపీలో మాత్రమే ఆ వార్తను ఇచ్చి అక్కడ పాఠకులను మోసం చేసే యత్నం చేశారు.

నిజానికి తెలంగాణలో సైతం అనేక సింగిల్ రోడ్లు ఉన్నాయి. కొన్ని రోడ్లు గోతులమయంగా కూడా ఉన్నాయి.  ఈనాడుకు సమాధానంగా సాక్షి పత్రిక తెలంగాణలో అద్వాన్నంగా పలురోడ్ల పోటోలను ప్రచురించింది. రోడ్లు అనేవి  నిరంతర ప్రక్రియ. రోడ్లు వేయడం, అవి పాడవుతుండడం, మళ్లీ బాగు చేస్తుండడం జరుగుతూనే ఉంటుంది. ఏ ప్రభుత్వం ఉన్నా అది జరిగేది. నేను ఈ మధ్య ఏపీలోని అనేక జిల్లాలలో పర్యటించి వచ్చాను. అత్యధిక శాతం రోడ్లు బాగానే ఉన్నాయి. ఎక్కడన్నా ఒకటి,రెండు రోడ్లు బాగోకపోతే బాగోకపోవచ్చు. అది ఏ రాష్ట్రంలో అయినా జరుగుతుంది. కాని కేసీఆర్‌ ఏదో అన్నారని వీరు ఇంత కథనం ఇచ్చారు.ఇదే వార్తను తెలంగాణలో ఇవ్వకపోవడం అంటే కేసీఆర్‌ను మోసం చేయడమే కదా! ఆ స్టోరీ ఇస్తే అది కాంగ్రెస్‌కు నష్టం చేస్తుందని భావించడమే కదా! పైకి కేసీఆర్‌కు సపోర్టు చేస్తున్నట్లు నటిస్తూ, మరో వైపు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఈనాడు మీడియా వ్యవహరిస్తున్న సంగతిని ఎవరూ గుర్తించలేరని అనుకుంటే పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగుతూ, ఎవరూ చూడడం లేదులే అనుకున్నట్లే వీరు చేస్తున్నారని చెప్పాలి.  మరి ఏపీలో వృద్దులకు పెన్షన్ ఇస్తున్న తీరును ప్రస్తావించి జగన్ ప్రభుత్వాన్ని కేసీఆర్‌ మెచ్చుకున్నారు. 

మరి దాని గురించి ఒక్క ముక్క రాయలేదే! ఏపీలో అనేక పాలన సంస్కరణలు జరిగాయి. అవి తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని తెలంగాణలో రాయలేదే!రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, గ్రామ,వార్డు సచివాలయాలు వంటివి అనేకం ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో ఎందుకు లేవని ఈనాడు ఎప్పుడైనా రాసిందా?మరో విషయం చెప్పాలి. కేసీఆర్‌ గత తొమ్మిదిన్నరేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏపీలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పాలన కాలంలో  సరిహద్దు ప్రాంతాలలో డబల్ లైన్ రోడ్లు ఎందుకు వేయలేదు?దాని గురించి ఎందుకు ప్రస్తావించలేదు.

కాని జగన్ టైమ్‌లోనే జరిగిపోతోందన్న భయం కల్పించడానికి ఈనాడు కుట్రలు పన్నుతోంది. ఇదే కాదు. ఒక బీసీ హాస్టల్ కు టాయిలెట్ లు రెండే ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించిన వార్తను కూడా వైసిపి ప్రభుత్వానికి అంటగడుతూ ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన వైనం కూడా వారి కుత్సిత బుద్ది బయటపడుతుంది. ఆ వార్తను  పద్దతిగా ఇవ్వవచ్చు. ప్రభుత్వం దృష్టికి తేవచ్చు. కాని అదేదో ఈ ప్రభుత్వ టైమ్ లోనే జరిగినట్లు. చంద్రబాబు టైమ్ లో అన్ని సదుపాయాలు ఉన్నట్లు, ఇప్పుడు లేకుండా పోయినట్లు కలరింగ్ ఇవ్వాలని తెలుగుదేశం మీడియా చేస్తున్న ప్రయత్నాలు నీచాతినీచంగా ఉన్నాయని చెప్పాలి. జర్నలిజం విలువలను పూర్తిగా వదలివేసి నగ్నంగా సంచరిస్తున్న  వీరు ఇంతకన్నా మెరుగ్గా ప్రవర్తిస్తారని ఎలా అనుకుంటాం!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top