జగన్‌పై దాడిని ఇంకా పెంచండి | Sakshi
Sakshi News home page

జగన్‌పై దాడిని ఇంకా పెంచండి

Published Fri, Aug 18 2017 1:39 AM

జగన్‌పై దాడిని ఇంకా పెంచండి - Sakshi

టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ఆరోపణల్ని ఇంకా పెద్దఎత్తున తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు మంత్రులు, పార్టీ నేతలకు ఉపదేశించారు. గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ప్రధానంగా నంద్యాల ఉప ఎన్నికపైనే చర్చించినట్లు తెలిసింది. అక్కడ పర్యటించి వచ్చిన మంత్రులు గెలుపు ఖాయమని చెప్పడంతో.. అక్కడి వాస్తవ పరిస్థితులన్నీ తనకు తెలుసునని సీఎం ఒకింత ఆగ్రహంతో అన్నట్లు సమాచారం.

 జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాలలోనే మకాం వేసి విస్తృతంగా ప్రచారం చేస్తుండడం, చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలను పలువురు ప్రస్తావించారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ జగన్‌ చేస్తున్న ఆరోపణల్ని నాయకులు సరిగ్గా తిప్పికొట్టలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.తాను రెండు రోజులు నంద్యాలలో పర్యటించి అన్ని విషయాలు చెబుతానని, అప్పటిదాకా మంత్రులు, ముఖ్యనేతలు ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కొనాలని సూచించారు. 

పార్టీశ్రేణులు మనోస్థైర్యం  కోల్పోకుండా చూడండి
నంద్యాలలో ఓటమి తప్పదని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో పార్టీ శ్రేణులు మనోస్థైర్యం కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. ఓడిపోతామనే భయంతో వైఎస్సార్‌సీపీ శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి ప్రయత్నిస్తోందని, ఎన్నికలు వాయిదా వేయించాలని చూస్తోందనే ప్రచారాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. దళితులపై మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు, బాలకృష్ణ పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్న అంశం, డబ్బు ఇవ్వడం తదితరాలపైనా సమావేశంలో చర్చించారు.

Advertisement
Advertisement