కాంగ్రెస్‌ నాయకుడి కిడ్నాప్‌ కలకలం ! | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నాయకుడి కిడ్నాప్‌ కలకలం !

Published Sat, Apr 20 2024 1:35 AM | Last Updated on Sat, Apr 20 2024 1:35 AM

-

సూర్యాపేట : బ్లాక్‌ కాంగ్రెస్‌ సూర్యాపేట మండల అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య కిడ్నాప్‌ కలకలం రేపుతోంది. గురువారం మధ్యాహ్నం నుంచి ఎల్లయ్య ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని జగ్గయ్యపేటకు చెందిన అపర్ణ అనే మహిళ గురువారం తమ భార్యాభర్తల పంచాయితీ పరిష్కరించాలని చెప్పి సూర్యాపేటకు వచ్చి వడ్డే ఎల్లయ్యను తీసుకొని ఆయన కారులోనే జగ్గయ్యపేటకు బయలుదేరారు. ఎల్లయ్య స్నేహితుడు కోదాడ పట్టణానికి చెందిన మొగిలిచర్ల అంజయ్య అతడితోపాటు ఇంకో వ్యక్తికూడా కలిసి జగ్గయ్యపేటకు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో ఎల్లయ్య స్నేహితులు ఇద్దరు కోదాడలో దిగిపోయారు. జగ్గయ్యపేట బస్టాండ్‌ సమీపంలోకి రాగానే శ్రీనివాస్‌ అనే వ్యక్తికి అపర్ణ ఫోన్‌ చేసి ఎల్లయ్యను తీసుకొచ్చానని, ఇక్కడికి రమ్మని చెప్పింది. బస్టాండ్‌ దగ్గరకు వచ్చిన శ్రీనివాస్‌ ఇంటి వద్దకు వెళ్లి మాట్లాడుకుందామని, అక్కడే పెద్ద మనుషులు కూడా ఉన్నారని చెప్పి కారులో శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లారు. కొద్దిసేపటికి ఎల్లయ్య ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ కావడంతోపాటు అపర్ణ, శ్రీనివాస్‌ ఫోన్లు కూడా స్విచ్‌ ఆఫ్‌ చేసుకున్నారు. దీంతో అనుమానం వచ్చిన వడ్డె ఎల్లయ్య చిన్నమ్మ కొడుకు మారెపల్లి సతీష్‌ శుక్రవారం జగ్గయ్యపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పలు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న వడ్డే ఎల్లయ్య రెండు రోజులుగా కనిపించకపోవడంతో కిడ్నాప్‌ అయినట్లు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement