వలస ఓటర్లే నిర్ణేతలు! | Sakshi
Sakshi News home page

వలస ఓటర్లే నిర్ణేతలు!

Published Sun, Nov 26 2023 2:06 AM

- - Sakshi

మ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను 8 నియోజకవర్గాల్లో వలస ఓటర్లే అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నల్లగొండ, నకిరేకల్‌, మునుగోడు, దేవరకొండ, నాగార్జునసాగర్‌, సూర్యాపేట, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో వలస ఓటర్లు ఉన్నారు. ఇక మిగతా నియోజకవర్గాల్లోనూ వలస ఓటర్ల సంఖ్య అధికంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి పార్టీలు వారిపై ప్రత్యేక దృష్టి సారించాయి. వారిని ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఆకట్టుకునేందుకు తాయిలాల ఆశ

వలస ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు తాయిలాలను ఆశగా చూపుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు వలస ఓటర్లు ఎక్కడెక్కడున్నారో తెలుసుకొని మరీ, వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. నియోజకవర్గానికి చెందిన ఓటర్లు కొందరు ఉద్యోగ రీత్యా, మరికొందరు పిల్లల చదువుల కోసం, ఇంకొందరు ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోసం, పేద కుటుంబాలకు చెందిన అనేక మంది కూలి పనులకోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి నివసిస్తున్నారు. వారి ఓట్లు మాత్రం స్థానికంగానే ఉన్నాయి. దీంతో వారిని పోలింగ్‌ రోజున రప్పించే ఏర్పాట్లలో పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. వలస వెళ్లిన ఓటర్ల బంధువుల ఇళ్లకు వెళ్లి వారి ఫోన్‌ నంబర్లు, అడ్రస్‌లు తీసుకుని వారితో మాట్లాడుతున్నారు. చుట్టు పక్కల ఇంటి వారి నుంచి కూడా వలస ఓటర్ల సమాచారం తీసుకుని మాట్లాడుతున్నారు. పట్టణాల్లోని వార్డు ఇన్‌చార్జీలు, మండల, గ్రామ ఇన్‌చార్జీలు, పార్టీల నేతలు వలస ఓటర్లతో సంప్రదింపులు జరుపడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌ పరిసరాల్లో ఉంటున్న వారికి కారు వంటి వాహన సదుపాయం కల్పిస్తామని, ముంబై, చైన్నె, సూరత్‌, భీవండి, ఇతర రాష్ట్రాలు, దూర ప్రాంతాల్లో ఉంటున్న వారికి రానుపోనూ రవాణా ఖర్చులు, కానుకలు ఇవ్వడంతోపాటు ఓటుకు ఇంత ఇస్తామంటూ వల వేస్తున్నారు.

ప్రత్యేక సమావేశాలపై దృష్టి

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య ప్రధాన పోటీ ఉండటం, కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ కూడా పట్టుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో గెలుపోటముల్లో వలస ఓటర్లు కీలకంగా మారే అవకాశం ఉంది. అందుకే అన్ని పార్టీల అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. హైదరాబాద్‌ పరిసరాల్లో పెద్దఅంబర్‌పేట్‌, హయత్‌నగర్‌, కుంట్లూరు, బీఎన్‌రెడ్డి నగర్‌, వనస్థలిపురం ఎల్బీనగర్‌, ఉప్పల్‌, బోడుప్పల్‌, నారపల్లి, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌ తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాజకీయ పార్టీలు వారిని ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నాయి. వారితో ప్రత్యేక సమావేశాలకు తెరతీశాయి. ఇటీవల మునుగోడు నియోజకవర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి హైదరాబాద్‌ వనస్థలిపురంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. మిగతా పార్టీల అభ్యర్థులు కూడా వలస ఓటర్లతో సమావేశాల నిర్వహణపై దృష్టి సారించారు.

ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాల వారీగా

మొత్తం ఓటర్లు, వలస ఓటర్లు (అంచనా)

నియోజకవర్గం మొత్తం ఓటర్లు వలస ఓటర్లు

నల్లగొండ 2,44,560 9,500

నకిరేకల్‌ 2,50,547 15,000

మునుగోడు 2,52,648 25,000

దేవరకొండ 2,51,622 20,000

నాగార్జునసాగర్‌ 2,33,412 12,000

మిర్యాలగూడ 2,31,391 2,000

సూర్యాపేట 2,41,799 14,000

తుంగతుర్తి 2,55,017 25,000

హుజూర్‌నగర్‌ 2,42,711 6,000

కోదాడ 2,41,554 6,400

ఆలేరు 2,33,266 30,000

భువనగిరి 2,16,941 6,000

ఎనిమిది నియోజకవర్గాల్లో వారి ప్రభావం

ఫ ఉమ్మడి జిల్లాలో 1.70 లక్షల మందికి పైగా వలస ఓటర్లు

ఫ స్వస్థలాల్లో ఓటేసేందుకు రప్పిస్తున్న నాయకులు

ఫ కొన్నిచోట్ల రవాణా సదుపాయం కల్పించేలా ఏర్పాట్లు

ఫ మరికొన్ని చోట్ల రాను పోను ఖర్చులు, ఓటుకు ఇంత ఇస్తామంటూ బేరసారాలు

ఫ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో

ఉంటున్న వారితో ప్రత్యేక సమావేశాలు

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్‌కు 89,115 ఓట్లు లభించగా, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎన్‌.పద్మావతిరెడ్డికి 88,359 ఓట్లు వచ్చాయి. కేవలం 756 ఓట్ల తేడాతో ఆమె ఓడిపోయారు. తుంగతుర్తిలోనూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాదరి కిషోర్‌ కుమార్‌కు 90857 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి అద్దంకి దయాకర్‌కు 89,010 ఓట్లు లభించాయి. తేడా 1847 ఓట్లు మాత్రమే. అభ్యర్థుల గెలుపోటములకు మధ్య తేడా ఒక్క ఓటు చాలు. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. అందుకే ప్రతి ఓటు పొందేలా పార్టీలు ప్రణాళికతో పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా వలస ఓటర్లపైనా ప్రత్యేక దృష్టి సారించాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. – సాక్షి ప్రతినిధి, నల్లగొండ

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement