విద్యతోనే దేశాభివృద్ధి | Sakshi
Sakshi News home page

విద్యతోనే దేశాభివృద్ధి

Published Thu, Nov 9 2023 1:40 AM

- - Sakshi

ఎంజీయూ(నల్లగొండరూరల్‌): విద్యతోనే అన్ని రంగాల్లో దేశాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. బుధవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఎంజీయూ 3వ స్నాతకోత్సవానికి గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు దేశ, విదేశాల్లో రాణిస్తున్నారని కితాబునిచ్చారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ మరింత పురోభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సంస్కృతి, సంప్రదాయాలకు నల్లగొండ జిల్లా పేరుగాంచిందని కొనియాడుతూ జిల్లా చరిత్రను ఉద్ఘాటించారు. విద్యార్థులకు లక్ష్యం ఉండాలని.. ఆ లక్ష్య సాధనకు ప్రత్యేక ప్రణాళిక ఉండాలన్నారు. సమయం దొరికినప్పుడు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇంట్లో ఉంటే పుస్తకాలు చదవాలన్నారు. ఫలితంగా ఎంతో విజ్ఞానం పెరుగుతుందన్నారు. తాను ఖాళీ సమయంలో, ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు గంట సేపు పుస్తకం చదివి శక్తి, ఉల్లాసం పెంచుకుంటానని పేర్కొన్నారు.

విద్యార్థుల్లో వెల్లివిరిసిన ఆనందం

కరోనా అనంతరం నిర్వహించిన మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి డాక్టరేట్లును, గోల్డ్‌ మెడల్స్‌ను అందుకున్నారు. గవర్నర్‌ చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టాలు, బంగారు పతకాలు అందుకోవడంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిసింది. గవర్నర్‌ పాల్గొన్న ఈ స్నాతకోత్సవంలో డాక్టరేట్లు, గోల్డ్‌ మెడల్స్‌ అందుకున్న వారి జీవితంలో ఈ సందర్భం ఒక మధురమైన ఘట్టంగా నిలిచింది. ఈ సందర్భంగా గోల్డ్‌ మెడల్స్‌ పొందిన పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా చదువుతూ రెగ్యులర్‌గా తరగతులకు హాజరు కావడం వల్లే చదివిన ఉత్తమ ప్రతిభ చాటామని కొందరు విద్యార్థులు చెప్పుకొచ్చారు. పీహెచ్‌డీ చేయాలనే ముందస్తు ప్రణాళికతోనే లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగుతున్నామని మరికొందరు తమ అభిప్రాయాలు వెలి బుచ్చారు. పట్టాలు అందుకున్న అభ్యర్థులంతా కొందరు హైదరాబాద్‌లో ఐఐసీటీలో పీహెచ్‌డీ చేస్తుండగా మరికొందరు ప్రైవేట్‌ రంగంలో స్థిరపడగా కొంత మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్నారు.

గవర్నర్‌కు ఘనస్వాగతం

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు యూనివర్సిటీలో ఘన స్వాగతం లభించింది. ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అధ్యాపకులతో పరిచయం చేసుకుని వారితో కొద్దిసేపు మాట్లాడారు. పాలక మండలి సభ్యులతో సమావేశమయ్యారు. అనంతరం స్నాతకోత్సవ సభా స్థలానికి చేరుకున్నారు. యూనివర్సిటీ వీసీ గోపాల్‌రెడ్డి ఈ సందర్భంగా ఎంజీయూ అభివృద్ధితోపాటు విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను వివరించారు. విద్యార్థుల భవిష్యత్‌ కోసం కృషి చేస్తున్నట్లు గవర్నర్‌కు తెలిపారు.

ఫ విద్యార్థులకు లక్ష్యం ఉండాలి

ఫ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

ఫ ఘనంగా ఎంజీ యూనివర్సిటీమూడో స్నాతకోత్సవం

ఫ విద్యార్థులకు డాక్టరేట్లు, గోల్డ్‌మెడల్స్‌ అందజేసిన గవర్నర్‌

ఫ కుటుంబ సభ్యులతో కలిసి తరలివచ్చిన పట్టభద్రులు

1/3

బయోటెక్నాలజీలో చేసిన పరిశోధనకు పెండ్యాల సరితకు డాక్టరేట్‌ అందజేస్తున్న గవర్నర్‌
2/3

బయోటెక్నాలజీలో చేసిన పరిశోధనకు పెండ్యాల సరితకు డాక్టరేట్‌ అందజేస్తున్న గవర్నర్‌

3/3

Advertisement
Advertisement