Sakshi News home page

నిధుల దుర్వినియోగంపై విచారణ

Published Fri, Nov 17 2023 12:58 AM

పంచారామాల పోస్టర్‌లు ఆవిష్కరిస్తున్న దృశ్యం - Sakshi

నరసాపురం రూరల్‌: డ్వాక్రా శ్రీనిధి నిధుల దుర్వినియోగంపై గురువారం పేరుపాలెం సౌత్‌ పంచాయతీలో అధికారులు విచారణ నిర్వహించారు. గ్రామానికి చెందిన వీఏఓ సభ్యుల నుంచి శ్రీ నిధి రుణాలకు సంబంధించి వాయిదా సొమ్ములు వసూలు చేసి బ్యాంకుకు చెల్లించకుండా దుర్వినియోగం చేశాడు. 2022లో ఇది జరగగా.. సుమారు రూ.14 లక్షలు రికవరీ జరగనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా వీఓఏపై మొగల్తూరు పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అప్పటి సీసీ ఏసురత్నంను సస్పెండ్‌ చేశారు. తాను ఏ తప్పు చేయలేదని సీసీ ఉన్నతాధికారులకు చెప్పడంతో గురువారం మళ్లీ విచారణ చేశారు. విచారణలో వీఓఏ అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించారు. ఏపీఎం, సీసీల నిర్లక్ష్యం కారణంగా నిధులు కాజేసినట్లు అధికారులు గుర్తించారు. సభ్యులు చెల్లించిన సొమ్ముకు రసీదులు ఇవ్వకుండా వీఓఏ అవినీతికి పాల్పడ్డాడని, రికవరీలో అధికారులు విఫలమయ్యారని విచారణలో గుర్తించారు.

పంచారామాలకు ప్రత్యేక బస్సులు

తణుకు అర్బన్‌: కార్తీక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్ధం పంచారామాలకు ప్రత్యేక బస్సు లు నడుపుతున్నట్లు తణుకు ఆర్టీసీ డిపో మేనేజరు సప్పా గిరిధరకుమార్‌ పేర్కొన్నారు. తణుకు డిపోలో గురువారం పంచారామాలకు సంబంధించిన గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గిరిధరకుమార్‌ మాట్లాడుతూ ఈనెల 19, 26, డిసెంబరు 3, 10 తేదీల్లో తణుకు డిపో నుంచి పంచారామాలకు ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయని చెప్పారు. ఈ బస్సులకు రిజర్వేషన్‌ సదుపాయం ఉందని పల్లె వెలుగు రూ. 700లు, అల్ట్రా పల్లెవెలుగు రూ. 800లు, ఎక్స్‌ప్రెస్‌ రూ. 900లు, అల్ట్రా డీలక్స్‌ రూ. 1000లు, సూపర్‌ లగ్జరీ రూ. 1100లుగా టికెట్‌ ధరలు నిర్ధారించినట్లు వివరించారు. వివరాలకు 98482 84384, రిజర్వేషన్‌ కోసం 94404 19144 నంబరులో సంప్రదించాలని కోరారు.

విహారి కార్గో టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ ప్రారంభం..

తణుకు మున్సిపల్‌ కార్యాలయ సమీపంలో విహారి కార్గో అండ్‌ టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ను డిపో మేనేజరు సప్పా గిరిధర కుమార్‌ గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ రమణమూర్తి, సీనియర్‌ అసిస్టెంట్‌ శేఖర్‌ పాల్గొన్నారు.

ఖననం చేసిన మృతదేహానికి పోస్టుమార్టం

పోలవరం రూరల్‌: పోలవరం పంచాయతీ పరిధిలోని కమ్మరగూడానికి చెందిన కొయ్యే విజయలక్ష్మి (27) మృతదేహాన్ని వెలికి తీసి అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. విజయలక్ష్మి ఈ నెల 12న అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. 13న ఆమెను ఖననం చేశారు. ఆమె మృతిపై తండ్రి బొంతు వెంకటరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్‌ఎస్‌ పవన్‌కుమార్‌ తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోలవరం తహసీల్దార్‌ బి.సుమతి, సీఐ కె.విజయబాబుల ఆధ్వర్యంలో గురువారం ఖననం చేసిన మృతదేహాన్ని వెలికి తీసి పోలవరం సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పి.రేణుక ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్సై పవన్‌కుమార్‌ తెలిపారు. మృతికి సంబంధించిన ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి, ఆమె పిల్లలను, సమీపంలో ఉన్నవారిని విచారించారు.

Advertisement
Advertisement