ప్రతీ గింజ కొంటాం.. అధైర్యపడొద్దు | Sakshi
Sakshi News home page

ప్రతీ గింజ కొంటాం.. అధైర్యపడొద్దు

Published Sun, May 26 2024 7:30 AM

ప్రతీ గింజ కొంటాం.. అధైర్యపడొద్దు

శాయంపేట: ఇటీవల కురిసిన వర్షాలతో ధాన్యం తడిచి తేమ శాతం పెరిగిందని, రైతు పండించిన ప్రతీ గింజను కొంటామని, రైతులు అధైర్య పడొద్దని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. మండలంలోని ప్రగతి సింగారం, వసంతాపూర్‌ గ్రామాల్లో ఓడీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించి అక్కడున్న రైతులతో మాట్లాడారు. 15 రోజులుగా ధాన్యాన్ని కేంద్రానికి తీసుకురాగా.. వర్షాలతో తడిచిపోయిందని తేమ పేరుతో కొనుగోలు చేయడం లేదని రైతు పెంట రజనీకాంత్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కాంటాలు పెట్టిన ధాన్యానికి టార్ఫాలిన్లు అందజేస్తున్నారని కాంటాలు కాని ధాన్యానికి టార్పాలిన్‌ కవర్లు ఇవ్వడంలేదని రైతులు కలెక్టర్‌ ఎదుట వాపోయారు. స్పందించిన కలెక్టర్‌ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయిన సెంటర్లలోని టార్పాలిన్‌ కవర్లను ఇక్కడి రైతులకు అందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో ప్రభుత్వ స్థలం ఉందని, గోదాం కట్టిస్తే చుట్టు పక్కల రైతులకు అనుకూలంగా ఉంటుందని రైతులు విన్నవించారు. స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్‌ గోడౌన్‌ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.

పెండింగ్‌లో 15శాతం కొనుగోళ్లు

హనుమకొండ జిల్లా వ్యాప్తంగా 160 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 70వేల మెట్రిక్‌ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేశామని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. పరకాల డివిజన్‌లోనే ఇంకా.. 15 శాతం ధాన్యం కొనుగోళ్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జూన్‌ మొదటి వారం వరకు ధాన్యాన్ని కొంటామన్నారు. అనంతరం పత్తిపాకలోని మహిళా స్వశక్తి గ్రూపు మహిళా సభ్యులు కుడుతున్న స్కూల్‌ యూనిఫామ్‌లను కలెక్టర్‌ పరిశీలించారు. ఆమె వెంట డీసీఓ నాగేశ్వర్‌రావు, సివిల్‌ సప్లై డీటీ సత్యనారాయణ, నోడల్‌ ఆఫీసర్‌ విజయభాస్కర్‌రెడ్డి, డీఆర్డీఏ ఏపీడీ సుధీర్‌కుమార్‌, ఏఓ గంగాజమున, తహసీల్దార్‌ సుభాషిని, ఎంపీడీఓ ఫణిచంద్ర, ఏపీఎం శ్రీధర్‌రెడ్డి, ఏఈఓ రజా పాల్గొన్నారు.

జిల్లాలో 70వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

Advertisement
 
Advertisement
 
Advertisement