ఉద్యమాల స్టేషన్‌ | Sakshi
Sakshi News home page

ఉద్యమాల స్టేషన్‌

Published Tue, Nov 21 2023 1:46 AM

- - Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్‌/స్టేషన్‌ఘన్‌పూర్‌: ‘బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం.. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ప్రాంతంలో మంచి ఉద్యమకారులున్నారు.. తెలంగాణ ప్రజల కోసం, హక్కుల కోసం ఉద్యమించాం.. ఇక్కడి ప్రజలు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. రాష్ట్రంలో పదేళ్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉంది.. పదేళ్ల క్రితం స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎలా ఉండే.. ప్రస్తుతం ఎలా ఉంది.. ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి’ అని గులాబీ దళపతి, సీఎం చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కడియం శ్రీహరి గెలిస్తే.. రాష్ట్రంలో మన ప్రభుత్వం వస్తది.. ఆసరా పెన్షన్‌ నెలకు రూ.5 వేలు చేసుకుందామన్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం చాగల్లు శివారు శివారెడ్డిపల్లిలో బీఆర్‌ఎస్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌ అభ్యర్థి కడియం శ్రీహరి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. గతంలో నీళ్ల కోసం చాలా కష్టాలు పడా ల్సి వచ్చేదని, మిషన్‌భగీరథతో ఆ కష్టాలు తీరాయ ని, కేసీఆర్‌ కంటే ముందు నా కన్నా దొడ్డుగా, పొడు గ్గా ఉన్న వారు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంలుగా పనిచేశారని, కనీసం నీళ్ల కష్టాలు తీర్చని కాంగ్రెస్‌ నేతలు సిగ్గులేకుండా ఓటడుగుతున్నారని ధ్వజమెత్తారు.

ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య

58 బోర్లు వేశారు..

ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ఒకప్పుడు మామూలు కరువు లేదని, మాణిక్యపురానికి చెందిన ప్రముఖ ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య వ్యవసాయానికి నీళ్ల కోసం 58 బోర్లు వేశారని కేసీఆర్‌ గుర్తు చేశారు. కథలు చెప్పగా వచ్చిన డబ్బంతా బోర్ల కోసమే వెచ్చించారని, నియోజకవర్గంలో ఎక్కడ చూసినా తెలంగాణ ప్రభుత్వం రాకముందు కరువు తీవ్రంగా ఉండేదన్నారు. ప్రస్తుతం సాగునీటి కష్టాలు లేవని, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తాటికొండ రాజయ్య పదేపదే సాగునీటి కోసం నా దృష్టికి తీసుకువచ్చేవారని, దేవాదుల ప్రాజెక్టుతో ప్రస్తుతం నియోజకవర్గం ఏడు రిజర్వాయర్లతో కళకళలాడుతోందని కేసీఆర్‌ పేర్కొన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం తమ రాష్ట్రంలో 5 గంటల కరెంటు ఇస్తున్నామని 24 గంటలు ఇస్తున్న రాష్ట్రానికి వచ్చి చెబుతున్నారని, ఆయన మాటలు విని దేనితో నవ్వాలో తెలుస్తలేదని ఎద్దేవా చేశారు.

కడియం శ్రీహరి చాలా అభివృద్ధి చేశారు

‘కడియం శ్రీహరి గురించి మీకు తెలుసు, గతంలో మంత్రిగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు’ అని కేసీఆర్‌ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాజయ్యను చిన్నచూపు చూడమని, ఆయన మంచి హోదాలో ఉంటారన్నారు. ఎవరూ బాధపడాల్సిన పనిలేదని, అందరూ కడియం శ్రీహరి గెలుపు కోసం పనిచేయాలన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం కడియం శ్రీహరి కోరిన పనులన్నీ చేస్తానని, ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ, వంద పడకల ఆస్పత్రితోపాటు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ను అభివృద్ధి చేసే బాధ్యత తనదని, అయితే మీరంతా కారు గుర్తుకు ఓటు వేసి కడియం శ్రీహరిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్‌ కోరారు. సభలో ఎంపీ పసునూరి దయాకర్‌, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మధుసూదనాచారి, జెడ్పీ చైర్మన్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరోగ్యం, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు సీహెచ్‌ నరేందర్‌రెడ్డి, బెలిదె వెంకన్న, మాదాసు వెంకటేశ్‌, చేపూరి వినోద్‌, డాక్టర్‌ బొల్లెపల్లి కృష్ణ, ఎడవెల్లి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ఏమిచ్చినా ‘స్టేషన్‌’ ప్రజల రుణం తీరదు : కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి

‘నా ముప్పై ఏళ్ల రాజకీ య జీవితం స్టేషన్‌ఘన్‌పూర్‌తో ముడిపడి ఉంది. 1994లో మొదటిసారి వచ్చినప్పుడు ప్రజ లు ఆశీర్వదించి గెలిపించారు. రాజకీయ భిక్ష పెట్టిన నియోజకవర్గ ప్రజల రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను.’ అని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. మరోసారి ప్రజలు ఆశీర్వదించి అవకాశమిస్తే అభివృద్ధి చేస్తానన్నారు. దళితులు, పేదలు ఉన్న నియోజకవర్గమని, పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని, మహిళలకు కుటీర పరిశ్రమలు కల్పించాలని, లెదర్‌పార్కును వినియోగంలోకి తీసుకురావాలని, ఘన్‌పూర్‌ను మున్సిపాలిటీ చేయాలని, వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని సభా వేదిక ద్వారా సీఎంను కోరారు.

ఇక్కడి నుంచి చాలామంది

ఉద్యమం చేసిండ్రు

కరువుతో చుక్క సత్తయ్య

అరిగోస పడ్డడు

ఇప్పుడు దేవాదులతో జల కళ

నియోజకవర్గం కోసం

కడియం శ్రీహరి ఎంతో చేశారు

బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ కోసం

చావో రేవో అంటేనే

రాష్ట్రం ఏర్పడింది..

కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం

ఇంకా అభివృద్ధి చెందాలె..

స్టేషన్‌ఘన్‌పూర్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌

సీఎం సభ సైడ్‌లైట్స్‌

మధ్యాహ్నం 2.32 గంటలకు: మీదికొండ క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్‌లో సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌ ల్యాండింగ్‌

2.34 గంటలకు : సీఎం కేసీఆర్‌కు కడియం శ్రీహరితోపాటు ఆయన ముగ్గురు కుమార్తెలు స్వాగతం పలికారు.

2.41 గంటలకు: సభావేదికపైకి చేరుకున్న సీఎం కేసీఆర్‌.. అభ్యర్థి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య ఒకరి భుజంపై ఒకరు చేయివేసుకుని ప్రజలకు అభివాదం చేశారు.

2.50 గంటలకు: సీఎం ప్రసంగం ప్రారంభం.. 3.20 : ప్రసంగం ముగింపు..

3.25 : హెలికాప్టర్‌లో పయనం

సభకు కేసీఆర్‌ రాకముందు కళాకారులు తమ ధూంధాం ఆటపాటలతో ఆకట్టుకున్నారు. గిరిజన మహిళలు సంప్రదాయ వేషధారణతో అలరించారు.

1/3

2/3

కడియం శ్రీహరిని గెలిపించాలంటూ అభ్యర్థిస్తున్న సీఎం కేసీఆర్‌
3/3

కడియం శ్రీహరిని గెలిపించాలంటూ అభ్యర్థిస్తున్న సీఎం కేసీఆర్‌

Advertisement
Advertisement