పనుల్లో వేగం పెంచాలి | Sakshi
Sakshi News home page

పనుల్లో వేగం పెంచాలి

Published Fri, May 24 2024 7:20 AM

పనుల్

అమరచింత: పాఠశాలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల, ఎస్సీకాలనీలోని ప్రాథమిక పాఠశాలతో పాటు స్కూల్‌ యూనిఫామ్స్‌ కుట్టే కేంద్రం, మండలంలోని చింతరెడ్డిపల్లి, నందిమళ్ల ఎక్స్‌రోడ్‌, కిష్టంపల్లిలోని పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసినా పనులు ఎందుకు ప్రారంభించ లేదని ఎంఈఓను ప్రశ్నించారు. పాఠశాలకు సంబంధించిన నిధులు జెడ్పీ ఉన్నత పాఠశాల ఖాతాలో జమయ్యాయని.. బదిలీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఎంఈఓ బదులిచ్చారు. ఇన్‌చార్జ్‌ డీఈఓ గోవిందరాజులుకు ఫోన్‌ చేసి సమస్యను త్వరగా పరిష్కరించాలని సూచించారు. విద్యార్థుల యూనిఫామ్స్‌ తయారీ ఎంతవరకు వచ్చిందని మెప్మా అధికారులను ప్రశ్నించగా కటింగ్‌ కోసం వస్త్రాన్ని పాలమూర్‌కు పంపామని కో–ఆర్డినేటర్‌ యువరాజ్‌ సమాధానం ఇవ్వగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల పునః ప్రారంభం నిర్మాణ పనులతో పాటు యూనిఫామ్స్‌ పూర్తి చేయాలని.. ఇందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుద్ధీకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ నూరుల్‌ నదీం, ఎంపీడీఓ కృష్ణయ్యను ఆదేశించారు. ఆయన వెంట ఎంఈఓ భాస్కర్‌సింగ్‌, ఎంపీఓ నరసింహులు తదితరులు ఉన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య..

ఆత్మకూర్‌: తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత పెంపొందించేందుకు కృషి చేస్తోందని.. అందులో భాగంగానే అమ్మ ఆదర్శ పాఠశాలలను ప్రవేశపెట్టిందని అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ తెలిపారు. గురువారం పట్టణంలోని ఉర్దూ మీడియం, జూరాల, ఖానాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండలంలోని 18 పాఠశాలలను అమ్మ ఆదర్శ పాఠశాలలుగా ఎంపిక చేశామని, ఆయా పాఠశాలల్లో విద్యుత్‌, తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు ఇతర సౌకర్యాలు సమకూర్చుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌, నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందనుందని.. ఉపాధ్యాయులు గ్రామాల్లో అవగాహన కల్పించాలని కోరారు. ఆయన వెంట ఎంఈఓ భాస్కర్‌సింగ్‌, ఎంపీడీఓ సుజాత, కమిషనర్‌ నాగరాజు, ఎంపీఓ నర్సింగ్‌రావు, జీహెచ్‌ఎంలు ఉన్నారు.

వైభవంగా

శివపార్వతుల కల్యాణం

కొత్తకోట రూరల్‌: మండలంలోని కానాయపల్లి శివారు దత్తకోటిలింగేశ్వరస్వామి ఆలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా గురువారం శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల భక్తులు తరలివచ్చారు. శివపార్వతులకు అర్చకులు తలంబ్రాలు పోయగా.. ఆడపడుచులు అమ్మవారికి వడిబియ్యం పోశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదానం చేశారు.

పనుల్లో వేగం పెంచాలి
1/1

పనుల్లో వేగం పెంచాలి

Advertisement
 
Advertisement
 
Advertisement