అప్పన్న నిజరూప దర్శనం నేడు | Sakshi
Sakshi News home page

అప్పన్న నిజరూప దర్శనం నేడు

Published Fri, May 10 2024 6:00 PM

అప్పన

● ఉదయం 4 గంటల నుంచి సర్వదర్శనాలు ● రాత్రి 7 గంటల వరకే దర్శనాల క్యూల్లోకి అనుమతి ● రాత్రి 8.30 గంటలకు స్వామికి సహస్ర ఘటాభిషేకం ● అనంతరం తొలివిడత చందనం సమర్పణ
చందనోత్సవ ఏర్పాట్ల పరిశీలన

విద్యుత్‌ వెలుగుల్లో సింహగిరి

సింహాచలం: సింహగిరిపై కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి వేళయింది. ఏడాది పొడవునా చందనపూతతో దర్శనమిచ్చే స్వామిని నిజరూపంలో దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలిరానున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం స్వామివారిపై ఉన్న చందనా న్ని ఒలిచి నిజరూప భరితుడిని చేస్తారు. దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త కుటుంబసభ్యులకు తొలిదర్శనం కల్పించిన తదుపరి ఉదయం 4 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. రాత్రి 8.30 గంటల నుంచి స్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. సింహగిరిపై గంగధార నుంచి తీసుకువచ్చిన కలశాల్లోని నీటి తో స్వామికి అభిషేకం చేస్తారు. విశేష పూజల అనంతరం స్వామికి తొలి విడతగా మూడు మణుగుల చందనాన్ని సమర్పిస్తారు.

ప్రత్యేక ఏర్పాట్లు : చందనోత్సవానికి ఈ సారి లక్ష మంది భక్తులు వస్తారని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. సర్వదర్శనంతో పాటు 300, 1000, 1500 రూపాయల దర్శనం టిక్కెట్ల క్యూలు ఏర్పాటు చేశారు. వారికి కేటాయించిన స్లాట్ల ప్రకారం దర్శనాలకు అనుమతిస్తారు. రాత్రి 7గంటలలోపు మాత్రమే సింహగిరిపై దర్శనాల క్యూల్లోకి భక్తులను అనుమతిస్తారు. అనంతరం క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేసి అప్పటి వరకు క్యూల్లో ఉన్న భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6గంటల వరకు మాత్రమే సింహగిరిపైకి బస్సుల్లో భక్తులను అనుమతిస్తారు. ఒకేసారి 29వేల 300మంది భక్తులు వేచి ఉండేలా సింహగిరిపై 46వేల రన్నింగ్‌ఫీట్‌ మేర దర్శనాల క్యూలను ఏర్పాటు చేశారు. భక్తులకు నీడ కోసం ప్రస్తుతం 56వేల ఎస్‌ఎఫ్‌టీ మేర ఉన్న పర్మినెంట్‌ షెడ్లు ఉండగా.. చందనోత్సవం సందర్భంగా అదనంగా మరో 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీఐ షీట్లతో షెడ్లు వేశారు.

పటిష్టంగా బందోబస్తు

జీవీఎంసీ సహకారంతో మంచినీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ చేపట్టనున్నారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో క్యూల్లో శీతల పానీయాలు, పండ్లు, ఆహారపదార్థాలు అందించనున్నారు. కొండదిగువ ఆరు చోట్ల హోల్డింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి బస్సుల్లో సింహగిరికి భక్తులను చేరుస్తారు. కలెక్టర్‌ మల్లికార్జున, దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో జీవీఎంసీ, ఫైర్‌, ఆర్టీసీ, మెడికల్‌ అండ్‌ హెల్త్‌, పోలీస్‌, ఫైర్‌, రెవెన్యూ తదితర శాఖల సమన్వయంతో చందనోత్సవం ఏర్పాట్లు చేశారు. నగర పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌ ఆధ్వర్యంలో 2,590మంది సివిల్‌ పోలీస్‌, నాలుగు ప్లాటూన్‌ ఏఆర్‌, స్పెషల్‌ రోప్‌పార్టీలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్నిశాఖల అధికారులతో జాయింట్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. గురువారం ఉదయానికే పోలీసులు సింహాచలం చేరుకోగా వారికి అధికారులు డ్యూటీలు కేటాయించారు.

చందనంలో సుగంధ ద్రవ్యాల మేళవింపు

అప్పన్న స్వామికి శుక్రవారం రాత్రి సమర్పించే మూడు మణుగుల పచ్చిచందనంలో దేవస్థానం అర్చకులు గురువారం పలు రకాల సుగంధ ద్రవ్యాలను కలిపారు.

సింహాచలం: సింహగిరిపై చందనోత్సవ ఏర్పాట్లను గురువారం సాయంత్రం కలెక్టర్‌ ఎ.మల్లికార్జున పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌, జేసీ కె.మయూర్‌ అశోక్‌, జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌వర్మ, దేవస్థానం ఈవో ఎస్‌.శ్రీనివాసమూర్తితో కలిసి పరిశీలించారు. చందనోత్సవ నిర్వహణలో ఏయే శాఖల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై పరిశీలన జరిపారు. తొలుత కొండదిగువ తొలిపావంచా వద్ద ఏర్పాట్లు పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. అనంతరం మినీ బస్సులో ప్రయాణించి కొండపైకి వెళ్లి, సింహగిరిపై దర్శన క్యూలు, బారికేడ్లు, షామియానాలు, తాగునీరు, మజ్జిగ వితరణ కేంద్రాలను పరిశీలించారు. బస్టాప్‌ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న క్యూలైన్ల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై జీవీఎంసీ, పోలీసు, దేవస్థానం అధికారులకు దిశానిర్దేశం చేశారు. టిక్కెట్లు జాగ్రత్తగా స్కాన్‌ చేయాలని, రూ.300, 1000, 1500 క్యూలైన్లలో వచ్చే భక్తులకు సూచనలు అందించాలని చెప్పారు. అనువంశిక ధర్మకర్త దర్శనాలు, టీటీడీ దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు సమర్పించే సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై దేవదాయశాఖ అధికారులకు సూచనలు చేశారు. పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం ద్వారా ఎప్పటికప్పుడు అనౌన్స్‌ చేయించాలని సూచించారు. ఆలయంలోకి భక్తులు చేరుకునే మార్గాలను పరిశీలించారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చూడాలని సీపీ పోలీసులను ఆదేశించారు.

అప్పన్న నిజరూప దర్శనం నేడు
1/4

అప్పన్న నిజరూప దర్శనం నేడు

అప్పన్న నిజరూప దర్శనం నేడు
2/4

అప్పన్న నిజరూప దర్శనం నేడు

అప్పన్న నిజరూప దర్శనం నేడు
3/4

అప్పన్న నిజరూప దర్శనం నేడు

అప్పన్న నిజరూప దర్శనం నేడు
4/4

అప్పన్న నిజరూప దర్శనం నేడు

Advertisement
 
Advertisement
 
Advertisement