Sakshi News home page

సెక్టార్‌ అధికారులు బాధ్యతగా పని చేయాలి

Published Wed, Apr 17 2024 5:45 AM

మాట్లాడుతున్న జేసీ మయూర్‌ అశోక్‌ - Sakshi

మహారాణిపేట: ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి సెక్టార్‌ అధికారులు అంకిత భావంతో చురుగ్గా పని చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ కె. మయూర్‌ అశోక్‌ సూచించారు. ఎన్నికల సన్నద్ధతపై మంగళవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో సెక్టోరియల్‌ అధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి మరింత అప్రమత్తంగా పని చేయాలకావున రానున్న నెల రోజులు చాలా కీలకమని అన్నారు. ఈ దిశగా సెక్టార్‌ అధికారులు మరింత ఉత్సాహంగా, బాధ్యతతో పనిచేయాలన్నారు. సెక్టార్‌ పరిధిలోని పోలింగ్‌ స్టేషన్ల వివరాలతో పాటు ఓటర్లకు చెందిన సమగ్ర సమాచారం పూర్తిగా తెలిసి ఉండాలని పేర్కొన్నారు. ఇందుకోసం కేటాయించిన వాహనాల్లో పోలింగ్‌ స్టేషన్లు సందర్శించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బీఎల్‌వోలు, రూట్‌ అధికారులు, సూపర్‌వైజర్లతో తరచూ సమీక్షలు చేయాలని ఆదేశించారు.

సౌకర్యాలపై శ్రద్ధ

పోలింగ్‌ బూత్‌లలో అవసరమైన ర్యాంపులు, విద్యుత్‌, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను ముందుగా పరిశీలించుకొని, వాటిని సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్‌ ముందురోజు అవసరమైన టెంట్లు వేయించుకోవాలని తెలిపారు. అన్ని పోలింగ్‌ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఉండేలా చూసుకోవడంతో పాటు అవసరమైన సాకెట్లను ముందుగా పరిశీలించు కోవాలని ఆదేశించారు. వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ వద్ద వీల్‌ చైర్లు ఏర్పాటు చేస్తున్నామని, వారు నేరుగా వెళ్లి ఓటు వేసే వెసులు బాటు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి స్థాయిలో జరిగేలా చర్యలు చేపట్టాలని జేసీ ఆదేశించారు. కార్యక్రమంలో సెక్టోరియల్‌ అధికారులు పాల్గొన్నారు.

పోలింగ్‌ స్టేషన్లలో వసతులపై దృష్టి

దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

జాయింట్‌ కల్టెర్‌ మయూర్‌ అశోక్‌

Advertisement
Advertisement