ఇంకెన్నాళ్లు..! | Sakshi
Sakshi News home page

ఇంకెన్నాళ్లు..!

Published Sat, May 25 2024 5:15 PM

ఇంకెన్నాళ్లు..!

వికారాబాద్‌: కొత్త రేషన్‌ కార్డుల కోసం పేదలు ఏళ్ల తరబడి ఎదురు చూస్తూనే ఉన్నారు. కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చే విషయంలోనూ తాత్సారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదట్లో రేషన్‌కార్డులు జారీ చేశారు. ఏడాది క్రితం దారఖాస్తు చేసుకున్న వారిలో సగం మందికి కార్డులు ఇచ్చారు. కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఆహార భద్రత పథకంలో భాగంగా లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఆ సమయంలో కుటుంబ సభ్యుల పేర్లను కార్డులో నమోదు చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు సంఖ్య పెరిగినా చేరికలు కాలేదు. సాంకేతిక సమస్యల వల్ల కొంత మంది పేర్లను తొలగించారు. చనిపోయిన వారి పేర్లను రేషన్‌ కార్డుల నుంచి వెంటనే తొలగిస్తున్న ప్రభుత్వం జన్మించిన వారి పేర్లు, కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చిన వారి పేర్లను మాత్రం నమోదు చేయడం లేదు. ఇలాంటి అర్జీలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ మరో పది రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులు, పేర్ల చేరికపై నిర్ణయం తీసుకోవాలని పేదలు కోరుతున్నారు.

పెండింగ్‌లో వేల దరఖాస్తులు

ఎనిమిదేళ్ల క్రితం ఆహార భద్రత కార్డులు మంజూరు చేసిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపరిచింది. లబ్ధిదారులకు రేషన్‌ కార్డులు మంజూరు చేయకుండా ఏడాదికి సరిపడా కూపన్లు ఇచ్చింది. ఆ తర్వాత కూపన్లు కూడా ఇవ్వడం లేదు. దీంతో నెట్‌ సెంటర్లలో కూపన్లు తెచ్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 35వేల మంది కార్డుల్లో పేర్లు చేర్చాలని దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో మరో 39 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రేషన్‌ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులే ఎక్కువ.

2,41,622 ఆహార భద్రతా కార్డులు

జిల్లాలోని 20 మండలాల్లో 588 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. 2,41,622 ఆహార భద్రత కార్డులు మంజూరు చేశారు. ఇందులో 2,08,162 ఎఫ్‌ఎస్సీ కార్డులు, 26,730 అంత్యోదయా కార్డులు, 39 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా 4,673 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తున్నారు.

కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూపులు

కొత్త పేర్ల నమోదుకు

మోక్షమెప్పుడో?

ప్రజాపాలనలో వేల అర్జీలు

జిల్లాలో 588 చౌక ధరల దుకాణాలు

ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు 2,41,622

Advertisement
 
Advertisement
 
Advertisement