కాంగ్రెస్‌కు ‘క్రాస్‌’ గుబులు! | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ‘క్రాస్‌’ గుబులు!

Published Sat, May 25 2024 5:15 PM

కాంగ్రెస్‌కు ‘క్రాస్‌’ గుబులు!

తాండూరు: కాంగ్రెస్‌ నేతలకు క్రాస్‌ ఓటింగ్‌ భయం పట్టుకుంది. దశాబ్ద కాలంగా ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీకి ఓట్లు వేయించడం మండల, జిల్లా స్థాయి నాయకులకు సర్వసాధారణంగా మారింది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరి తాము మద్దతు ఇచ్చినందుకే గెలిచిందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఆరు నెలల క్రితం వరకు బీఆర్‌ఎస్‌లో ఉన్న చాలా మంది నాయకులు, ప్రజాప్రతినిధులు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. తాము క్రాస్‌ ఓటింగ్‌ను ప్రోత్సహించడం వల్లే హస్తం పార్టీ విజయం సాధించిందంటూ ప్రచారం చేసుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న నాయకులంతా బీఆర్‌ఎస్‌ నుంచి వలస వచ్చిన వారే. గతంలో బలమైన కేడర్‌తో కనిపించిన పార్టీలు నాయకుల వలస బాట కారణంగా ఓటమిని చవిచూశాయి. కొత్తగా కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో సీనియర్లు, చాలా కాలంగా పార్టీనే నమ్ముకొని ఉన్నవారు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ఇలాంటి వారంతా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వైపు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది.

అందరి దృష్టి చేవెళ్లపైనే..

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నేతల భవితవ్యం చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంది. జిల్లా పరిధిలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వికారాబాద్‌, తాండూరు, పరిగి చేవెళ్ల పరిధిలోకి వస్తాయి. కొడంగల్‌ పాలమూరు పరిధిలోకి వెళుతుంది. జిల్లాలకు చెందిన వారే సీఎంగా, అసెంబ్లీ స్పీకర్‌గా ఉండటంతో అందరి దృష్టి చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి గెలుపుపై పడింది. అయితే ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేశాయి. బీఆర్‌ఎస్‌ పోలింగ్‌కు మూడు రోజుల ముందు నుంచే ప్రచారం నుంచి తప్పుకుంది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్‌కు వర్గపోరు, క్రాస్‌ ఓటింగ్‌ భయం పట్టుకుంది. సొంత పార్టీ నాయకులే బీజేపీకి ఓట్లు వేయించినట్లు సమాచారం. తాండూరు అసెంబ్లీ బాధ్యతలను నాయకులు, కేడర్‌కు అప్పగించకుండా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, అతని సోదరులు, కుటుంబ సభ్యులే చూసుకోవడం కాంగ్రెస్‌ నాయకులకు మింగుడు పడలేదు. ఇది కూడా క్రాస్‌ ఓటింగ్‌కు దోహదం చేసిందనే అనుమానాలు ఉన్నాయి.

బీజేపీకి కలిసొచ్చేనా?

చేవెళ్ల పార్లమెంట్‌ స్థానం ఆవిర్భవించిన నాటి నుంచి బీజేపీకి ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదు. అసెంబ్లీ ఎన్నికలైనా, లోక్‌సభ ఎన్నికలైనా 2 లక్షల నుంచి 3.50 లక్షల ఓట్లకే పరిమితమవుతూ వచ్చింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్‌ స్థానం పరిధిలోని ఏడు శాశనసభ నియోజకవర్గాల్లో 3.30లక్షల ఓట్లు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గట్టిపోటీ ఇవ్వకపోవడంతో ఆ ఓటు బ్యాంక్‌ తమకే అనుకూలంగా పడుతుందని బీజేపీ భావిస్తోంది.

ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీకి ఓట్లు వేయించిన నేతలు

అధికారం ఉన్నచోట వాలిపోతున్న నాయకులు

తమ వల్లే అధికారంలోకి వచ్చిందంటూ ప్రచారం

కాంగ్రెస్‌ నుంచి ఇద్దరి సస్పెండ్‌

తాండూరు టౌన్‌: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు కార్యకర్తలపై కాంగ్రెస్‌ జిల్లా కమిటీ సస్పెండ్‌ చేసింది. తాండూరు పట్టణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వడ్డే శ్రీనివాస్‌ తోపాటు కొర్విచేడ్‌ గ్రామానికి చెందిన యూత్‌ ప్రభంజనం అధ్యక్షుడు శ్రీనివాస్‌ను సస్పెండ్‌ చేస్తూ శుక్రవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు టీ రామ్మోహన్‌ రెడ్డి ఉత్వర్వులు జారీ చేశారు. వీరిద్దరూ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement