సర్వీస్‌ రికార్డు.. ఇక డిజిటలైజేషన్‌ | Telangana Govt Plans Digital Records for All Employees | Sakshi
Sakshi News home page

సర్వీస్‌ రికార్డు.. ఇక డిజిటలైజేషన్‌

Oct 18 2026 5:45 AM | Updated on Oct 18 2026 5:45 AM

Telangana Govt Plans Digital Records for All Employees

పోస్టులో చేరిక మొదలు... పదవీ విరమణ వరకు వివరాలు ఆన్‌లైన్‌లో 

బదిలీలు, పదోన్నతులు, సెలవులు, ఇతరాలన్నీ కంప్యూటరీకరణ 

అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ–హెచ్‌ఆర్‌ఎంఎస్‌ అమలుకు ఉత్తర్వులు 

మాన్యువల్‌ పద్ధతిలోని సేవా వ్యవహారాల్లో జాప్యానికి చెక్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ రికార్డును డిజిటలైజేషన్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్వీసు రికార్డుల నమోదులో జాప్యానికి చెక్‌ పెట్టేందుకు ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేసేందుకు ఉపక్రమించింది. ఉద్యోగిగా చేరిక మొదలు, సెలవులు, ఇంక్రిమెంట్లు, బదిలీలు, పదోన్నతులు, విధి నిర్వహణలో పొరపాట్లు, చట్టపరమైన చర్యలు, కేసులు, పదవీ విరమణ ఇలా అన్నింటినీ డిజిటల్‌ విధానంలోకి తీసుకురానుంది. తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం(టీఐఎఫ్‌ఎంఐఎస్‌)లో భాగమైన ఎల్రక్టానిక్‌ మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ (ఈ–హెచ్‌ఆర్‌ఎంఎస్‌)ను అన్ని ప్రభుత్వ శాఖల్లో అమలు చేయనుంది.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు శనివారం జీవో 141 జారీ చేశారు. ప్రస్తుతం ఉద్యోగుల సర్వీస్‌ రికార్డులన్నీ మాన్యువల్‌ పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వివిధ సేవా సంబంధిత వ్యవహారాల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. ఏళ్లకుఏళ్లుగా సమాచారాన్ని అందులో ఎంట్రీ చేయడం లేదు. పదోన్నతులు, బదిలీల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెండింగ్‌ వ్యవహారాలపై సమగ్ర పర్యవేక్షణ కూడా కొరవడుతోంది. ఈ సమస్యలకు పరిష్కారంగా అన్ని శాఖలకు ఒకే విధమైన సమీకృత డిజిటల్‌ వ్యవస్థను అందుబాటులోకి తెస్తోంది. 

ప్రతి ఉద్యోగికి డిజిటల్‌ సర్వీస్‌ రిజిస్టర్‌ 
ఈ–హెచ్‌ఆర్‌ఎంఎస్‌ ద్వారా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ధ్రువీకరించిన డిజిటల్‌ సర్వీస్‌ రిజిస్టర్‌ నిర్వహిస్తారు. ఆయా అంశాలకు సంబంధించిన మాడ్యూళ్లు అందుబాటులోకి వచి్చన మేరకు దరఖాస్తుల నమోదు, పరిశీలన, ఆమోదం, పరిష్కారం.. అన్నీ ఆన్‌లైన్‌ విధానంలోనే సాగుతాయి. దీంతో ఏ ఉద్యోగికి సంబంధించిన వ్యవహారం ఏ దశలో ఉందో తెలుసుకోవడంతోపాటు, పెండింగ్‌ కేసులను గుర్తించి వాటి పరిష్కారాన్ని పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. అలాగే, పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. 

అధికారులదే డేటా బాధ్యత 
సచివాలయ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు, డివిజినల్, కింది స్థాయి ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఈ విధానాన్ని అమలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఉద్యోగుల వివరాలను పూర్తిగా, ప్రామాణికంగా నమోదు చేసే బాధ్యత సంబంధిత పరిపాలనా శాఖలు, శాఖాధిపతులు, డ్రాయింగ్‌ అండ్‌ డిస్బర్సింగ్‌ అధికారుల(డీడీఓ)పై ఉంటుంది. అమలును వేగవంతం చేయడంతోపాటు, తమ పరిధిలోని కార్యాలయాల్లో ఈ విధానాన్ని పర్యవేక్షించాలని శాఖాధిపతులను ఆదేశించింది. 

జిల్లాల వారీగా ట్రెజరీ, పే అండ్‌ అకౌంట్స్‌ కార్యాలయాల నోడల్‌ అధికారులను నియమించారు. జిల్లాస్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ఐఎఫ్‌ఎంఐఎస్‌ సహాయ కేంద్రం 7042420033 నంబర్‌కు తెలియజేయొచ్చు. ఈ ప్రక్రియ అమలును ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పటా్నయక్‌ పర్యవేక్షిస్తారు. డిజిటల్‌ విధానం అమలు చేస్తున్నప్పటికీ ఇప్పటికే ఉన్న సర్వీస్‌ నిబంధనలు, అధికారుల పరిధులు, అప్పగించిన అధికారాల్లో ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement