ఫుల్‌ సపోర్ట్‌ ఇస్తాం ప్లాంట్‌ పెట్టండి | Telangana CM Revanth Reddy invites Hyundai to set up car plant | Sakshi
Sakshi News home page

ఫుల్‌ సపోర్ట్‌ ఇస్తాం ప్లాంట్‌ పెట్టండి

Oct 17 2026 4:13 AM | Updated on Oct 17 2026 4:13 AM

Telangana CM Revanth Reddy invites Hyundai to set up car plant

హెచ్‌ఎంఐఈ ఎండీ చాంగ్యాన్‌ చోకు జ్ఞాపికను అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో సీఎం సలహాదారు కె.రామకృష్ణారావు

హ్యుందాయ్‌ కార్ల కంపెనీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానం

తయారీ రంగానికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తాం 

కార్ల తయారీకి అనువైన ప్రదేశంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం 

హ్యుందాయ్‌ ప్రతినిధి బృందానికి సీఎం హామీ 

త్వరలో ఆర్‌ అండ్‌ డీ కేంద్రానికి భూమిపూజ చేస్తామన్న కంపెనీ 

పెండింగ్‌ అనుమతులు వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో హ్యుందాయ్‌ కార్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ సంస్థ యాజమాన్యాన్ని కోరారు. తెలంగాణను కార్ల తయారీకి అనువైన ప్రదేశంగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. శుక్రవారం హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఇంజినీరింగ్‌ (హెచ్‌ఎంఐఈ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ చాంగ్యాన్‌ చో నేతృత్వంలోని ప్రతినిధులు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో సీఎంతో సమావేశమయ్యారు. 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న హ్యుందాయ్‌ ఇంజినీరింగ్‌ ఇంటిగ్రేటెడ్‌ గ్లోబల్‌ ఆర్‌అండ్‌డీ కేంద్రానికి రాబోయే కొద్ది నెలల్లోనే భూమిపూజ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..రాష్ట్రంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. హ్యుందాయ్‌ కంపెనీకి సంబంధించిన 
పెండింగ్‌ అనుమతులను వెంటనే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.  

భౌగోళికంగా దేశం మధ్యలో తెలంగాణ 
తెలంగాణ భౌగోళికంగా దేశం మధ్యలో ఉందని, హైదరాబాద్‌ అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కలిగిన నగరమని ముఖ్యమంత్రి వివరించారు. దేశంలోని ఆరు ప్రధాన మెట్రోపాలిటన్‌ నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ సురక్షితమైన, జీవించడానికి అనుకూలమైన కాస్మోపాలిటన్‌ నగరంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. కార్ల తయారీ పరిశ్రమకు అవసరమైన రవాణా, మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రహదారులు, రైలు మార్గాలు, విమానాశ్రయాలతోపాటు భవిష్యత్తులో ఓడ రేవులకు హైస్పీడ్‌ కనెక్టివిటీ కల్పించే ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. ప్రత్యేక మొబిలిటీ క్లస్టర్ల అభివృద్ధితో వాహన తయారీ రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. పెరి–అర్బన్‌ రీజియన్‌ (ప్యూర్‌) వంటి ప్రణాళికల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.  

గ్లోబల్‌ సమ్మిట్‌–2026కు రండి 
ప్రపంచ స్థాయి సౌకర్యాలతో భారీ శాటిలైట్‌ నగరంగా భారత్‌ ఫ్యూచర్‌ సిటీని అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సీఎం వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలియజేస్తూ, రాబోయే ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026కు హాజరు కావాలని ఆహా్వనించారు. హ్యుందాయ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చాంగ్యాన్‌ చో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను అంతర్జాతీయ సాంకేతిక, అధునాతన ఇంజినీరింగ్‌ కేంద్రంగా మరింత బలోపేతం చేయాలన్న హ్యుందాయ్‌ లక్ష్యం తెలంగాణ రైజింగ్‌–2047 విజన్‌కు అనుగుణంగా ఉందని అన్నారు. తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో తమ సంస్థ భాగస్వామిగా కొనసాగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు కె.రామకృష్ణారావు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

2024లో హ్యుందాయ్‌తో చర్చలు 
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో 2024 ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం హ్యుందాయ్‌ ప్రతినిధులతో చర్చలు జరిపింది. అనంతరం 2025 జూన్‌లో హ్యుందాయ్‌ ఆర్‌అండ్‌డీ కేంద్రం ప్రతిపాదనకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది.  

రూ.8,528 కోట్ల పెట్టుబడి 
జహీరాబాద్‌లోని నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మానుఫ్యాక్చరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌)లో రూ.8,528 కోట్ల పెట్టుబడితో హ్యుందాయ్‌ గ్లోబల్‌ ఆర్‌ అండ్‌ డీ కేంద్రం ఏర్పాటు కానుంది. 678 ఎకరాల్లో విడతల వారీగా అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 4,276 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఈ సంస్థకు హైదరాబాద్‌తో రెండు దశాబ్దాల అనుబంధం ఉంది. హైటెక్‌ సిటీలోని కేంద్రం అధునాతన వాహన ఇంజినీరింగ్‌కు మద్దతునిస్తూ కీలక ఆర్‌ అండ్‌ డీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

ఈ సామర్థ్యాలను మరింత విస్తరించేలా జహీరాబాద్‌లో గ్లోబల్‌ ఆర్‌ అండ్‌ డీ, మెగా టెస్టింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం ద్వారా వాహనాల రూపకల్పన, పరీక్షలు, పనితీరు, ధ్రువీకరణ, నాణ్యతా ప్రమాణాల పరిశీలనతో పాటు ఇంజినీరింగ్‌ ప్రక్రియలను మరింత మెరుగుపరిచేందుకు అవకాశం కలగనుంది. హ్యుందాయ్‌ అధునాతన సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement