స్కూటీని ఢీ కొట్టిన కారు... అక్కాతమ్ముడు మృతి
హయత్‌నగర్: ఆడ బిడ్డను ఇంటికి పిలిపించుకుని సంతోషంతో పండుగ జరుపుకోవాలని తలచిన వారి కుటుంబ ఆశలను విధి వక్రీకరించింది. కారు రూపంలో వచ్చిన మృత్యువు వారి ఇండ్లల్లో విషాదం మిగిల్చింది. పండుగకు అక్కను బైకుపై తీసుకొస్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో బైకుపై ఉన్న అక్క తమ్ముడు అక్కడికక్కడే మృతి చెందగా రెండేళ్ల అక్కకూతురు తీవ్రంగా గాయపడింది.
ఈ విషాద సంఘటన ఆదివారం హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీ సులు, బందువుల కథనం ప్రకారం..పెద్దఅంబర్‌పేట్‌కు చెందిన కందుకూరు జంగయ్య, సువర్ణ దంపతులకు నలుగురు కూతుళ్లలో పెద్ద కూతురు రేఖ(34)ను శంషాబాద్ సుల్తాన్‌పల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పిడుగు కుమార్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వారికి మూడేళ్ళ కూతురు చర్విత ఉంది. కాగా ఇబ్రహీంపట్నానికి చెందిన ఏదుల్ల నర్సింహ్మ కొడుకు నవీన్(25) ఫోటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. కొన్ని రోజులుగా పెద్దఅంబర్‌పేట్‌కు చెందిన అతని పెద్దమ్మ సువర్ణ దగ్గర ఉంటున్నాడు.
సువర్ణ దసరా పండుగకు తన కూతురు రేఖను ఇంటికి పిలిచింది. తల్లిగారింటికి వచ్చే క్రమంలో ఆమె ఎల్‌బినగర్‌లో బస్సు దిగి తన తమ్ముడు (చిన్నమ్మ కొడుకు) నవీన్‌కు ఫోన్ చేసింది. అతను సూ్కటీపై అక్క, ఆమె కూతురును తీసుకుని వస్తుండగా హయత్‌నగర్ బస్టాండ్ వద్దకు రాగానే ముందుగా ఆగి ఉన్న డీసీఎం వాహనం వెనుక స్కూటీని ఆపాడు. వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు స్కూటీని బలంగా ఢీ కొట్టింది.
దీంతో అక్క తమ్ముడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా మూడేళ్ల చిన్నారి చర్విత తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృత దేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి గాయపడిన చిన్నారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


