అంతరిక్షంలో.. హైదరాబాద్‌ | Hyderabad Products In ISRO Experiments, Also Used In NVS-02 Launch | Sakshi
Sakshi News home page

అంతరిక్షంలో.. హైదరాబాద్‌

Jan 30 2025 8:09 AM | Updated on Jan 30 2025 9:53 AM

Hyderabad Products In ISRO Experiments

ఇస్రో ప్రయోగాల్లో హైదరాబాద్‌ ఉత్పత్తులు 

నిన్నటి ఎన్‌వీఎస్‌–02 ప్రయోగంలోనూ భాగస్వామ్యం 

శాటిలైట్‌ బ్యాటరీ రక్షక కవచాలను తయారు చేస్తున్న ‘నాగసాయి’ 

చంద్రయాన్‌–4, గగన్‌యాన్‌ ప్రాజెక్టులకు సైతం సన్నద్ధం 

ఇస్రో ఆధ్వర్యంలోని 55 ప్రాజెక్టులకు శాటిలైట్‌ ఉత్పత్తుల తయారీ

సాక్షి, హైదరాబాద్‌:  భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆధ్వర్యంలో శ్రీహరి కోటలోని సతీష్‌ దావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి విజయవంతంగా ప్రయోగించిన ప్రతిష్టాత్మక 100వ ప్రాజెక్ట్‌ ఎన్‌వీఎస్‌–02. బుధవారం ఉదయం ప్రయోగించిన ఈ రాకెట్‌ విజయవంతంగా అంతరిక్షంలోని దూసుకెళ్లింది. ఎన్‌వీఎస్‌ సిరీస్‌లో ఈ ప్రయోగం రెండోది కాగా మరో మూడింటిని సిద్ధం చేస్తున్నారు. ఇస్రో చేపట్టిన ఈ ప్రాజెక్టులో నగరంలోని నాగసాయి ప్రెసిషియన్‌ ఇంజినీర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో తయారు చేసిన ఉత్పత్తులను వినియోగించడం విశేషం. 

ఈ శాటిలైట్‌లో వినియోగించే అతి సున్నితమైన లిథియం అయాన్‌ గ్లాజు బ్యాటరీలను సురక్షితంగా అమర్చే ‘స్లీవ్స్‌’ను నాగసాయి ప్రెసిషియన్‌ సంస్థ తయారు చేసిందని సంస్థ వ్యవస్థాపకులు బీఎన్‌.రెడ్డి(బొమ్మారెడ్డి నాగభూషణరెడ్డి) తెలిపారు. అయితే ఇస్రో చేపట్టిన ప్రాజెక్టుల్లో నాగసాయి ప్రెసిíÙయన్‌ భాగస్వామ్యం అందించిన ప్రాజెక్టుల్లో ఈ ఎన్‌వీఎస్‌–02 ప్రయోగం 55వది కావడం విశేషం.  

∙శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఎన్‌వీఎస్‌ శాటిలైట్‌లో సోలార్‌ ఆధారంగా బ్యాటరీలు చార్జ్‌ అవుతాయి. ఈ విద్యుత్‌ శక్తితో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థ పనిచేస్తుంది. ఈ కమ్యూనికేషన్‌ వ్యవస్థ ఆధారంగానే అంతరిక్షంలోని విషయాలు మనకు చేరుతాయి. ఈ ప్రాజెక్టులో ఉపయోగించే లిథియం అయాన్‌ బ్యాటరీలు చాలా సున్నితమైనవి, సంక్లిష్టమైనవి. వేగంగా దూసుకెళ్లే రాకెట్‌ వైబ్రేషన్లను సైతం సమన్వయపరుస్తూ బ్యాటరీలను సురక్షితంగా, స్థిరంగా అమర్చడం క్లిష్టమైన వ్యవహారం. వీటిని అమర్చే స్లీవ్స్‌ బాడీ(రక్షణ కవచాలు)ని నగరంలో తయారు చేస్తున్నారు. 

దీనికి వినియోగించే ముడిపదార్థాలను ఇస్రో నియమాలకు అనుగుణంగా నాగసాయి కొనుగోలు చేసి తయారు చేసి ఇస్రోకు పంపిస్తుంది. వీటిని బెంగళూరు వేదికగా ధూళిసైతం చేరని ప్రత్యేక పరిశోధనా కేంద్రం(బ్యాటరీ డివిజన్‌)లో బిగించి అక్కడి నుంచి శ్రీహరి కోటకు పంపిస్తారు. ప్రయోగానికి ముందు శాటిలైట్‌లోని అన్ని భాగాలను రెండుసార్లు తనిఖీ చేస్తే ఈ స్లీవ్స్‌ను మాత్రం మూడుసార్లు (ఎన్‌డీపీ మైక్రో టెస్టింగ్‌) తనిఖీ చేస్తారు.  

55 ఇస్రో ప్రాజెక్టుల్లో ప్రాతినిధ్యం  
1998లో మొదటి భారతీయ సాంకేతికతతో ప్రయోగించిన ఇన్‌శాట్‌ 2 ఈ ప్రాజెక్టులో భాగంగా ఇస్రోతో మా సంస్థ ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పటి వరకు 55 ఇస్రో ప్రాజెక్టుల్లో మా ప్రాతినిధ్యం ఉంది. ఈ ప్రయోగం కోసం స్లీవ్స్‌ బాడీని 3 నెలల్లో తయారు చేశాం. ఎన్‌వీఎస్‌ సిరీస్‌లో ఎన్‌వీఎస్‌–01, ప్రస్తుత ఎన్‌వీఎస్‌–02లో నాగసాయి భాగస్వామ్యముంది. ఎన్‌వీఎస్‌–03 కోసం కూడా ఉత్పత్తులను సిద్ధం చేశాం. మరో వారం రోజుల్లో వాటిని ఇస్రోకు పంపించనున్నాం. దీనిని ఏప్రిల్‌–మే నెలలో ప్రయోగించే అవకాశముంది. ఈ సిరీస్‌లో 04, 05 ప్రయోగాలు కూడా ఉన్నాయి. వాటికి ఇంకా అనుమతి అందలేదు. వీటితో పాటు ప్రతిష్టాత్మక చంద్రయాన్‌–3 రోవర్, ల్యాండర్, ప్రొపల్షన్‌ మాడ్యుల్స్‌ బ్యాటరీలను అమర్చే అల్యూమినియం స్టాండ్స్, నాసిల్స్, స్లీవ్స్‌ను సమకూర్చాం. 

చంద్రయాన్‌ 4కు అవసరమైన ఉత్పత్తులను సైతం సిద్ధం చేస్తున్నాం. భారతీయ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ గగన్‌యాన్‌లో సైతం కీలక పాత్ర పోషిస్తున్నాం. జీఎస్‌ఎల్వీ, డీఆర్‌డీఎల్‌కు కూడా సేవలందించాం. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌), భారత్‌ ఎల్రక్టానిక్స్‌ లిమిటెడ్‌(బీఈఎల్‌)తో కలిసి పని చేయడంతో పాటు ఏరో స్పేస్, యుద్ధ విమానాల విడిభాగాల తయారీలో కృషి చేస్తున్నాం. టూల్స్‌ డిజైనింగ్‌ ఇంజినీరింగ్, ఏరో డైనమిక్స్‌లో నాకున్న అనుభవం ఈ 55 ప్రాజెక్టుల్లో పనిచేయడానికి అవకాశం లభించింది.    – బీ.ఎన్‌.రెడ్డి 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement