కాంగ్రెస్‌లో ‘డిండి’ చీలిక! | CM Revanth to review the Irrigation Department again today | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో ‘డిండి’ చీలిక!

Oct 23 2026 5:07 AM | Updated on Oct 23 2026 5:07 AM

CM Revanth to review the Irrigation Department again today

ఏదుల నుంచి డిండికి నీటి తరలింపుపై అధికార పార్టీలో చిచ్చు 

నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్వరం పెంచిన పాలమూరు మంత్రులు, ఎమ్మెల్యేలు

మహబూబ్‌నగర్‌ మంత్రి, ఎమ్మెల్యేలతో మంత్రి ఉత్తమ్‌ భేటీలో వాడీవేడి చర్చ

తమకు నీళ్లు ఇవ్వకుండానే డిండికి ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించిన పాలమూరు నేతలు

పాలమూరుకు 90 టీఎంసీలు ఇచ్చాకే డిండికి నీళ్లు తీసుకెళ్తామని ఉత్తమ్‌ భరోసా

ముందు పాలమూరు–రంగారెడ్డి పూర్తి చేయాలని జిల్లా నేతల పట్టు

నేడు నీటిపారుదల శాఖపై మళ్లీ సమీక్షించనున్న సీఎం రేవంత్‌

డిండిపై పాలమూరు నేతలతో మరోసారి చర్చించే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: డిండి ఎత్తిపోతల పథకం అధికార కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చురేపుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఏదుల రిజర్వాయర్‌ నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి 30 టీఎంసీల నీటిని తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజాప్రతినిధులు స్వరం పెంచారు. మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి , కసిరెడ్డి నారాయణరెడ్డి, తూడి మేఘారెడ్డి, గావినోళ్ల మధుసూదన్‌రెడ్డి, జనంపల్లి అనిరుధ్‌రెడ్డి గురువారం మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఆయన నివాసంలో సమావేశమై తమ అభ్యంతరాలు, ఆందోళనలను తెలియజేశారు. 

సీఎం రేవంత్, మంత్రులు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించి హామీలిచ్చి మూడు నెలలు గడిచినా అంగుళం కూడా పనులు ముందుకు కదలలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు 90 టీఎంసీల నీటిని ఇవ్వక ముందే ఏదుల రిజర్వాయర్‌ నుంచి డిండి ప్రాజెక్టుకు 30 టీఎంసీలను ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోయాల్సి ఉండగా, డిండికి మాత్రం గ్రావిటీతోనే నీళ్లు వెళతాయని, కృష్ణాలో వరద లేని పరిస్థితుల్లో తమ జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రత్యామ్నాయంగా 50 కి.మీ.ల దూరంలోని జూరాల ప్రాజెక్టు నుంచి రోజుకు ఒక టీఎంసీ నీటిని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు తరలించే ప్రతిపాదనలను పరిశీలించాలని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలు సూచించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కింద కేవలం రిజర్వాయర్లు కట్టి వాటిని నింపితే ఏం ప్రయోజనం ఉండదని, కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి తక్షణమే పరిపాలనాపర అనుమతులు జారీ చేసి పనులు ప్రారంభించాలని పాలమూరు జిల్లా నేతలు డిమాండ్‌ చేశారు. 

నేడు సీఎం మళ్లీ సమీక్ష 
సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 5న మంత్రి ఉత్తమ్‌తో కలిసి ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ఉమ్మడి మహబూ బ్‌నగర్‌ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశమై ఏదుల నుంచి డిండికి నీటి తరలింపుపై చర్చించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని అప్పట్లోనే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజాప్రతినిధులందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. కృష్ణా, గోదావరి పరీవా హకంలోని ప్రాజెక్టుల నీటి అవసరాలు, మూలం (సోర్స్‌)పై అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని ఆ సమావేశంలో నీటిపారుదల శాఖకు సీఎం రేవంత్‌ ఆదేశించారు. నివేదిక వచ్చాక మళ్లీ సమావేశం నిర్వహించాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. 

సీఎం రేవంత్‌ శుక్రవారం మంత్రి ఉత్తమ్‌తో సమావేశమై కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులతోపాటు తుమ్మిడిహెట్టి బరాజ్‌ నిర్మాణంపై సమీక్షించనున్నారు. ఇదే సమావేశంలో పాలమూరు–రంగారెడ్డి, డిండి, అచ్చంపేట ప్రాజెక్టులపై సైతం సీఎం సమీక్షించనున్నట్టు తెలిసింది. దీనికి సన్నాహకంగా మంత్రి ఉత్తమ్‌ గురువారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమై వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు.

రోజుకి 1.5 టీఎంసీలు చొప్పున 60 రోజుల్లో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మొత్తం 90 టీఎంసీలను తరలించడంతో పాటు రోజుకు 0.5 టీఎంసీల చొప్పున ఏదుల నుంచి డిండికి 30 టీఎంసీల నీటిని తరలించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు ఎలాంటి నష్టం జరగదని మంత్రి ఉత్తమ్‌ గట్టిగా వాదిస్తున్నారు. ముందు తమ జిల్లాకు నీళ్లు ఇచ్చాకే డిండి ప్రాజెక్టు పనులు చేపట్టాలని మహబూ బ్‌నగర్‌ జిల్లా ప్రజాప్రతినిధులు తేల్చిచెప్పినట్టు తెలిసింది. డిండి ప్రాజెక్టు విషయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉత్తమ్, ఇతర ప్రజాప్రతినిధులు ఓ వర్గంగా, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజాప్రతినిధులు మరోవర్గంగా చీలిపోయినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాకే నిర్ణయం 
డిండి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2015 జూన్‌ 11న రూ.6,190 కోట్ల అంచనాలతో పరిపాలనా³ర అనుమతులు జారీ చేసినా, నీటిని ఎక్కడి నుంచి తరలించాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదుల రిజర్వాయర్‌ నుంచే డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని తరలించాలని కేబినెట్‌లో తీర్మానించారు. ఈ మేరకు పరిపాలనాపర అనుమతులు జారీ చేస్తూ 2025 జనవరి 22న నీటిపారుదల శాఖ జీవో 10 జారీ చేసింది. 

పాలమూరుకి తీవ్ర నష్టమే
సీఎం రేవంత్‌ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించి హామీలిచ్చి మూడు నెలలు గడిచిపోయాయి. ఇప్పటి వరకు కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల పనులకు పరిపాలనాపర అనుమతులు ఇవ్వలేదు. ఏదుల రిజర్వాయర్‌ నుంచి డిండికి గ్రావిటీతో నీటిని తరలిస్తే కరువు సంవత్సరాల్లో వరద లేక పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు, పాలమూరు జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతుంది.  – అనిరుధ్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement