బీసీ–ఏలోకి ముదిరాజ్‌లు! | CM Revanth Reddy Comments On Mudiraj community | Sakshi
Sakshi News home page

బీసీ–ఏలోకి ముదిరాజ్‌లు!

Oct 23 2026 3:37 AM | Updated on Oct 23 2026 3:37 AM

CM Revanth Reddy Comments On Mudiraj community

పండుగ సాయన్న ముదిరాజ్‌ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో వాకిటి శ్రీహరి, వీహెచ్, అనిల్‌కుమార్‌యాదవ్, దానం, పొన్నం ప్రభాకర్, బండా ప్రకాశ్, బీర్ల ఐలయ్య తదితరులు

ఈ అంశంపై మంత్రివర్గ ఉపసంఘంతో అధ్యయనం చేయిస్తాం

పండుగ సాయన్న జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా

చట్టపరమైన చిక్కులు ఎదురుకాకుండా న్యాయ నిపుణులను సంప్రదిస్తాం 

వచ్చే కేబినెట్‌లో చర్చించి న్యాయం జరిగేలా సరైన నిర్ణయం తీసుకుంటాం

40 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం చూపామని వెల్లడి   

గంగపుత్రులకు అన్యాయం జరుగుతుందన్న అపోహలను నివృత్తి చేయాలని మంత్రి పొన్నంకు సూచన 

ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో దొడ్డి కొమురయ్య, పండుగ సాయన్న విగ్రహాలనూ ఏర్పాటు చేస్తామని హామీ

పండుగ సాయన్నపై రూపొందించిన పాటల ఆల్బమ్‌ ఆవిష్కరణ  

సాక్షి, హైదరాబాద్‌: ముదిరాజ్‌ సామాజిక వర్గాన్ని బీసీ–ఏ గ్రూపులో చేర్చే అంశంపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గురువారం రవీంద్ర భారతిలో జరిగిన పండుగ సాయన్న ముదిరాజ్‌ జయంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన.. ముదిరాజ్‌లు సహా వివిధ కులాల వర్గీకరణ అంశంపై ప్రభుత్వం పక్కా ప్రక్రియను అనుసరిస్తుందన్నారు. బీసీ–డీ నుంచి మరో గ్రూపులోకి మార్చే అంశంపై గతంలో సరైన లెక్కలు లేకపోవడం వల్ల న్యాయస్థానాలు తిరస్కరించాయని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన ప్రాతిపదికగా భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ముదిరాజ్‌లను గ్రూపు–ఏలోకి మార్చడంపై సమగ్రంగా అధ్యయనం చేస్తామన్నారు. న్యాయ నిపుణులు, అధికారులతో     సంప్రదింపులు జరిపిన తర్వాత మంత్రివర్గంలో చర్చించి ముదిరాజ్‌లకు న్యాయం జరిగేలా సరైన నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ముది రాజ్‌లను బీసీ–ఏ గ్రూపులో చేర్చడం ద్వారా గంగపుత్రులకు అన్యాయం జరుగుతుందన్న అనుమానాలు, అపోహలు ఉన్నాయని.. ఆ వర్గాలతో చర్చించి వారి సందేహాలను నివృత్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సూచించారు. 

జనగణనలో కులగణన చేసి చూపించాం 
స్వతంత్ర భారతదేశంలో ఎవరూ చేయని విధంగా జనగణనలో కులగణన చేసి చూపించామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. వందేళ్ల క్రితం బ్రిటిష్‌ ప్రభుత్వం కులగణన చేసిందని గుర్తుచేస్తూ 2024 ఫిబ్రవరి 4న కమిషన్‌ ఏర్పాటు చేసి సరిగ్గా ఏడాదికి (2025 ఫిబ్రవరి 4 నాటికి) కులగణన లెక్కలు పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. ఆ కులగణన లెక్కలే బలహీన వర్గాలకు ధైర్యాన్ని, హక్కులను డిమాండ్‌ చేసే అవకాశాన్ని కల్పించాయని పేర్కొన్నారు. ఎక్కడైనా చిన్నపాటి పొరపాట్లు ఉంటే ఆ లెక్కలను సవరించుకోవడం మన బాధ్యతని చెప్పారు. 40 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యను ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే పరిష్కరించిందని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఇలాంటి జటిలమైన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని వివరించారు. 

సంక్షేమ పథకాలు రెట్టింపు 
గత పాలకులు దివంగత ఎన్టీఆర్, వైఎస్సార్‌ నుంచి కేసీఆర్‌ వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలేవీ రద్దు చేయలేదని.. వాటిని మరింత మెరుగ్గా రెట్టింపు చేసి అమలు చేయడంతోపాటు కొత్త పథకాలను ప్రవేశపెట్టామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. వైఎస్సార్‌ వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తే.. ఇప్పుడు 200 యూనిట్లలోపు వాడే 55 లక్షల కుటుంబాలకు ఉచితంగా గృహ విద్యుత్‌ ఇస్తున్నామని తెలిపారు. రూ. 2 లక్షలు ఉన్న రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామని.. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి వంటి ఏ పథకాన్నీ నిలిపివేయలేదని సీఎం స్పష్టం చేశారు. మంచిపని ఎవరు చేసినా వాటిని మరింత మెరుగ్గా చేసి అమలు చేశామే తప్ప ఏ ఒక్కటీ ఆపలేదని తేల్చిచెప్పారు. 

కనుమరుగైన పోరాటయోధుల చరిత్ర వెలికితీస్తాం 
చరిత్రలో కనుమరుగైన పోరాటయోధుల చరిత్రను బయటకు తీస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కొందరు బహుజన యోధుల చరిత్రను కనుమరుగు చేశారని.. జాతి కోసం జీవితాంతం తపించి సర్వం త్యాగం చేసిన వారికి చరిత్రలో స్థానం లేకపోతే ఈ నేల ఉన్నా లేకపోయినా ఒకటేనని వ్యాఖ్యానించారు. సర్వాయి పాపన్న గౌడ్, దొడ్డి కొమురయ్య, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, జ్యోతిరావు ఫూలే, చాకలి ఐలమ్మ వంటి ఎంతో మంది.. బహుజనుల కోసం పోరాటం చేశారని గుర్తుచేశారు. సర్వాయి పాపన్నగౌడ్, జ్యోతిరావు ఫూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేసినట్లుగానే ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో దొడ్డి కొమురయ్య, పండుగ సాయన్న విగ్రహాలను కూడా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ డాక్టర్‌ బండ ప్రకాశ్, ఎంపీలు అనిల్‌ కుమార్‌ యాదవ్, ఈటల రాజేందర్, సలహాదారు వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండుగ సాయన్నపై రూపొందించిన పాటల ఆల్బమ్‌ను సీఎం ఆవిష్కరించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement