టూరిస్టు బస్సుల అక్రమ దందాకు చెక్
ప్రభుత్వానికి రవాణా శాఖ అధికారుల కమిటీ సిఫారసు
మొత్తం పర్మిట్ విధానంలోనూ మార్పులు
ఇంతకాలం జిల్లా పర్మిట్ పొంది ఆపై రూట్ పర్మిట్‌తో ఇష్టారాజ్యంగా టూర్లు.. ప్రభుత్వానికి రూ.వందల కోట్లు ఎగవేత
సాక్షి, హైదరాబాద్: ఒక జిల్లా పర్మిట్ తీసుకోవడం.. ఆ తర్వాత నామమాత్రంగా తాత్కాలిక రూట్ పర్మిట్ ఫీజు కట్టి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు తిప్పడం..ఇది రాష్ట్రం పరిధిలో తిరిగే టూరిస్టు బస్సు నిర్వాహకుల దందా. ఇలా ఏళ్లుగా రూ.వందల కోట్ల పన్ను ఎగ్గొడుతున్నా, అక్రమాలకు అడ్డాగా మార్చినా, స్థానిక రవాణా శాఖ అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరించారు. కానీ ఇటీవల ఈ దందాపై దృష్టి సారించిన ఉన్నతాధికారులు, ఖజానాకు భారీ మొత్తంలో నష్టం జరుగుతోందని గుర్తించారు. తాత్కాలిక పర్మిట్‌ను రద్దు చేయటమే కాకుండా, మొత్తం పర్మిట్ విధానాన్నే మారుస్తూ ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వ అనుమతి రాగానే కొత్త విధానం అమల్లోకి రానుంది.
మూడు శ్లాబుగా పర్మిట్లు
అంతర రాష్ట్ర ట్రావెల్స్ బస్సులు కాకుండా, రాష్ట్రం పరిధిలోనే తిరిగే టూరిస్టు బస్సులు తెలంగాణలో దాదాపు 8,500 వరకు ఉన్నాయి. వీటికి త్రైమాసిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పర్మిట్ మూడు శ్లాబులుగా కొనసాగుతోంది. ఒక జిల్లా పరిధిలో తిరిగేందుకు ప్రతి బస్సు, ప్రతి సీటుకు, మూడు నెలలకు ఒకసారి రూ.1,120, రెండు జిల్లాలకు రూ.1,510, రాష్ట్రవ్యాప్త పర్మిట్‌కు రూ.3,285 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఒక జిల్లా పర్మిట్ ఉన్న బస్సులు ప్రత్యేక సందర్భాల్లో ఇతర జిల్లాల్లో తిరిగేందుకు తాత్కాలిక పర్మిట్లు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విధంగా ఉన్న వెసులుబాటే అక్రమాలకు పాల్పడేందుకు అవకాశం ఇచ్చింది.
తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జిల్లాల పునర్విభజనతో జిల్లాల పరిధి బాగా తగ్గింది. బస్సు 20 కి.మీ. తిరిగితే చాలు పొరుగు జిల్లా పరిధిలోకి వెళ్లే పరిస్థితీ ఉంది. దీంతో ఒక జిల్లా పర్మిట్ తీసుకున్న బస్సులు ముందుకు సాగటం కష్టంగా మారింది. దీన్ని నివారించేందుకు తాత్కాలిక రూట్ పర్మిట్ విధానాన్ని ప్రారంభించారు. జిల్లా పరిధి దాటి వెళ్లేట్టయితే, ఆ నిర్ధారిత రూట్లో వెళ్లి వచ్చేందుకు ఈ తాత్కాలిక పర్మిట్ వీలు కల్పిస్తుంది. ఈ తాత్కాలిక రూట్ పర్మిట్ (టీపీ) ఫీజు రూ.200 నుంచి రూ.500 వరకు నామమాత్రంగానే ఉండటంతో, తక్కువ ఫీజు ఉన్న ఒక జిల్లా పర్మిట్ తీసుకుని, ఆ తర్వాత తాత్కాలిక రూట్ పర్మిట్ పొంది రాష్ట్రం మొత్తం అక్రమంగా తిప్పుతూ పన్నుకు గండి కొట్టడం టూర్ ఆపరేటర్లు అలవాటు చేసుకున్నారు.
సగటున ఏడాదిలో 258 రోజులు.. తాత్కాలిక పర్మిట్లే!
ఫిర్యాదు రూపంలో ఈ అంశం ఓ ఉన్నతాధికారి దృష్టికి రావటంతో ఆయన దీనిపై దృష్టి సారించారు. ఫలితంగా అక్రమాల గుట్టు రట్టు కావటంతో దాన్ని నివారించేందుకు చేయాల్సిన మార్పులపై ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలోని అధికారులు లోతుగా పరిశీలిస్తే విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2021–22లో 26,510గా ఉన్న తాత్కాలిక పర్మిట్ల సంఖ్య 2025–26 నాటికి 84,418కు చేరింది. వీటిలో 87% పర్మిట్లు ఒక జిల్లా పర్మిట్ ఉన్న వాహనాలకే జారీ కావడం గమనార్హం.
ఒక టూరిస్టు బస్సు ఏడాదిలో ఏకంగా 103 సార్లు టీపీలు తీసుకున్నట్లు, గత ఏడాది 2,722 బస్సులు ఏడాదికి 12 కంటే ఎక్కువసార్లు తాత్కాలిక పర్మిట్లు తీసుకున్నాయని, సగటున 258 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తిరిగినట్లు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా తిరి గిన ఈ బస్సుల నుంచి రూ.82.58 కోట్ల పన్ను రావాల్సి ఉండగా, తాత్కాలిక పర్మిట్ ఫీజుల రూపంలో వసూలైంది కేవలం రూ.3.51 కోట్లేనని స్పష్టమైంది.
ఇక ఒకే పన్ను..!
ఈ లొసుగులను నివారించాలంటే రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకమైన కాంట్రాక్ట్ క్యారేజీ పర్మిట్, ఏకరూప పన్ను విధానాన్ని అమలు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. మూడు శ్లాబులకు బదులు ఇక ప్రతి సీటుకు త్రైమాసికానికి రూ.1,510 చొప్పున పన్ను చెల్లించేలా ఖరారు చేయాలని సూచించింది. ఈ మార్పుతో ఒక జిల్లా పర్మిట్దారులు రూ.390 అదనంగా చెల్లిస్తే రాష్ట్రవ్యాప్తంగా తిరిగే అవకాశం కలుగుతుంది. మరోవైపు ప్రస్తుతం రూ.3,285 చెల్లిస్తున్న రాష్ట్రవ్యాప్త పర్మిట్దారులకు పన్ను భారం తగ్గుతుంది.
ఖజానాకు మరింత ఆదాయం!
కొత్త విధానంతో ఏటా రూ.27.11 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని, పన్నుల వసూళ్లలో పారదర్శకత పెరిగితే ఆదాయం రూ.184.18 కోట్లకు చేరుతుందని రవాణా శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 8,394 కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సుల్లో.. రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల నుంచే 79.4% పన్ను ఆదాయం (రూ. 92.79 కోట్లు) వస్తోంది. ఈ ప్రాంతాలన్నీ ఒకే నగర పరిధిలోకి వస్తాయి కాబట్టి జిల్లా పర్మిట్ల నిబంధన అర్థరహితంగా మారింది. ఇప్పటికే పర్మిట్ ఫీజు చెల్లించినవారు ఆ గడువు పూర్తయ్యే వరకు పాత విధానం లోనే తిరగాల్సి ఉంటుంది.


