సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు ఇకపై ఆన్‌లైన్‌లోనే | Applications for Telangana CM Relief Fund to be accepted | Sakshi
Sakshi News home page

సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు ఇకపై ఆన్‌లైన్‌లోనే

Jul 3 2024 7:13 AM | Updated on Jul 3 2024 7:13 AM

Applications for Telangana CM Relief Fund to be accepted

ఈ నెల 15వ తేదీ నుంచి అమలు

వెబ్‌సైట్‌ ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

https//cmrf.telangana.gov.in/లో అందుబాటులో దరఖాస్తు

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) దరఖాస్తులను ఇక నుంచి ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో వ్యవహరించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఆధ్వర్యంలో రూపొందించిన  వెబ్‌సైట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం సచివాలయంలో ప్రారంభించారు. 

గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు. సీఎంఆర్‌ఎఫ్‌ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలకు  ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫారసు లేఖ  జత చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్‌ లో సంబంధిత దరఖాస్తుదారుల బ్యాంక్‌  ఖాతా నంబర్‌ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్‌లోడ్‌ చేసిన తర్వాత సీఎంఆర్‌ఎఫ్‌కు సంబంధించిన ఒక కోడ్‌ ఇస్తారు. ఆ కోడ్‌ ఆధారంగా ఒరిజినల్‌ మెడికల్‌ బిల్లులను  సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది.

 సంబంధిత ఆస్పత్రులకు ఆన్‌లైన్‌లోనే పంపించి నిర్ధారించుకున్న తర్వాత అన్ని వివరాలు సరిగ్గా ఉంటే దరఖాస్తును ఆమోదించి చెక్‌ను సిద్ధం చేస్తారు. చెక్‌పై తప్పనిసరిగా దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతా నంబర్‌ ముద్రిస్తారు. (దీనివల్ల చెక్‌ పక్కదారి పట్టే అవకాశం ఉండదు) ఆ తర్వాత ప్రజాప్రతినిధులు  చెక్‌లను స్వయంగా దరఖాస్తుదారులకు అందజేస్తారు. ఈ నెల 15వ తేదీ తర్వాత సీఎంఆర్‌ఎఫ్‌ ధరఖాస్తులను  ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు.   https//cmrf.telangana.gov.in/  సైట్‌లో దరఖాస్తు అందుబాటులో ఉంటుంది.  

Advertisement
 
Advertisement
Advertisement