రెండో రోజూ ఈడీ విచారణకు ముత్తయ్య | Sakshi
Sakshi News home page

రెండో రోజూ ఈడీ విచారణకు ముత్తయ్య

Published Wed, Nov 22 2023 12:38 AM

 సత్యమూర్తి భవన్‌ 
 - Sakshi

సాక్షి, చైన్నె : ఇసుక అక్రమ తవ్వకాల కేసు విచారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ ప్రధాన ఇంజనీరింగ్‌ అధికారి ముత్తయ్యను మంగళవారం కూడా ఈడీ అధికారులు శాస్త్రి భవన్‌లో ప్రశ్నించారు. వివరాలు.. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో వైగై, తామర భరణి, కావేరి తదితర నదీ తీరాలలోని ఇసుక క్వారీలను తమ గుప్పెట్లో ఉంచుకుని రాజ్యమేలుతున్న ఇసుకాసురుల భరతం పట్టేందుకు సెప్టెంబరులో ఈడీ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. తాజా విచారణ మేరకు 10 జిల్లాల కలెక్టర్లను విచారించేందుకు ఈడీ సిద్ధమైంది. ఇక ఉత్తర చైన్నె పరిధిలోని ఉత్తరాది కేంద్రంగా నిర్వహిస్తున్న పలు బంగారు ఆభరణాల షోరూమ్‌లు, టోకు వర్తకులను టార్గెట్‌ చేసి రెండో రోజు కూడా ఈడీ సోదాల్లో నిమగ్నమైంది. అలాగే తిరుచ్చిలోని పలు జ్యువెలరీ షోరూంలలో విస్తృతంగా తనిఖీలు సాగాయి. ఇందులో అనేక రికార్డులు, విదేశాల నుంచి ఆభరణాల దిగుమతులు తదితర రశీదులు బయట పడినట్లు సమాచారం.

కోస్ట్‌ గార్డ్‌ తూర్పు ప్రాంత కమాండర్‌గా డోనీ మైఖేల్‌

కొరుక్కుపేట: చైన్నెలోని కోస్ట్‌ గార్డు ఎయిర్‌ స్టేషన్‌లో జరిగిన ఉత్సవ కవాతులో కోస్ట్‌ గార్డు రీజియన్‌ (తూర్పు) కమాండర్‌గా ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ డోనీ మైఖేల్‌ భాధ్యతలు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆనంద్‌ ప్రకాష్‌ బడోలా నుంచి బాధ్యతలు స్వీకరించారు. రెండున్నర సంవత్సరాలు పాటు విజయవంతంగా తన విధులను పూర్తి చేసుకున్న బడోలా కోస్ట్‌ గార్డు హెడ్‌క్వార్టర్స్‌ –న్యూఢిల్లీకి బదిలీ అయ్యారు. చైన్నెలోని లయోలా కాలేజీ నుంచి గ్రాడ్యూయేట్‌ పూర్తి చేసిన డోనీ మైఖేల్‌ 1990 జూలై 6న ఇండియన్‌ కోస్ట్‌ గార్డులో చేరారు. పలు ఉన్నతస్థాయి పదవులు పొందిన ఆయన కోస్ట్‌ గార్డు గ్యాలెంటరీ మెడల్‌ను కూడా గెలుచుకున్నారు.

రాజ్యాంగ నిపుణులతో

గవర్నర్‌ చర్చలు

సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి ఆమోదించిన 10 ముసాయిదాలపై చట్ట నిపుణులతో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి చర్చించినట్లు తెలిసింది. రాజ్‌ భవన్‌ వర్గాలు ఇందుకు సంబంధించిన కసరత్తు చేపట్టినట్టు సమాచారం. గవర్నర్‌ వెనక్కి పంపించిన చైన్నె వర్సిటీ, తమిళనాడు డాక్టర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ, తమిళనాడు ఎంజీఆర్‌ వర్సిటీ, వ్యవసాయ వర్సిటీ, వెటనరీ వర్సిటీ, అన్నై థెరీసా వర్సిటీ, మత్స్య వర్సిటీ, అన్నావర్సిటీ చట్ట సవరణల ముసాయిదాలు, కొత్తగా సిద్ధ వైద్య కళాశాల ఏర్పాటు ముసాయిదాలను ఎలాంటి సవరణలు లేకుండా మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ ముసాయిదాలన్నీ మళ్లీ రాజ్‌ భవన్‌కు చేరాయి. దీంతో చట్ట నిపుణులతో చర్చించినానంతరం, కేంద్ర హోం శాఖ వర్గాలతో భేటీ అయ్యి ఈ ముసాయిదాలపై గవర్నర్‌ ఓ నిర్ణయానికి నిర్ణయానికి రానున్నట్లు తెలిసింది.

టీఎన్‌సీసీలో

అసమ్మతి స్వరం

సాక్షి, చైన్నె: తమిళనాడు కాంగ్రెస్‌లో జిల్లాల అధ్యక్షులు తిరుగుబాటు ధోరణితో నినాదాలు చేయడం వివాదానికి దారి తీసింది. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి నేతృత్వంలో లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం అవుతూ జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నిర్వాహకుల సమావేశం పార్టీ ప్రధాన కార్యాలయం చైన్నె సత్యమూర్తి భవన్‌లో జరుగుతోంది. అయితే రెండో రోజైన మంగళవారం పలువురు జిల్లాల కార్యదర్శులు సీట్ల వ్యవహారంలో తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీసింది. ప్రతిసారీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా గెలిచిన వారికే మళ్లీ మళ్లీ అవకాశం కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. గెలిచిన వాళ్లే మళ్లీ మళ్లీ ఎన్నికలలో పోటీ చేయాలా? వారి గెలుపు కోసం తాము శ్రమించాలా? అని పలువురు జిల్లాల కార్యదర్శులు నిలదీశారు. గెలిచిన వారి ద్వారా పార్టీకి ఒరిగిందేమిటి? వారు చేసిన సేవ ఏమిటి? అని ప్రశ్నించడం చర్చకు దారి తీసింది. ఈసారి లోక్‌ సభ ఎన్నికలలో జిల్లాల అధ్యక్షులకు అవకాశం కల్పించాలని, తమ పేర్లను అధిష్టానానికి పంపించాలని మరికొందరు జిల్లాల నేతలు ఒత్తిడి తెచ్చేలా నినాదాలు చేయడం గమనార్హం.

Advertisement

తప్పక చదవండి

Advertisement