పాలిసెట్‌కు ఐదు కేంద్రాలు | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌కు ఐదు కేంద్రాలు

Published Thu, May 23 2024 6:05 AM

పాలిస

సూర్యాపేటటౌన్‌ : ఈ నెల 24న జిల్లా కేంద్రంలో నిర్వహించే పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సీహెచ్‌.నర్సింహారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలో మొత్తం ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వీటిలో 2,362 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయనున్నట్టు తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు 10గంటల వరకు చేరుకోవాలని, 11గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించబోరని పేర్కొన్నారు.

ఎడ్‌సెట్‌కు నాలుగు కేంద్రాలు

నల్లగొండ రూరల్‌: ఎడ్‌ సెట్‌–2024 నిర్వహణకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎడ్‌సెట్‌ చైర్మన్‌ గోపాల్‌రెడ్డి తెలిపారు. కోదాడలో మూడు, నల్లగొండలో ఒక కేంద్రంలో మొత్తం 1,100 మంది అభ్యర్థులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు రాయనున్నట్టు పేర్కొన్నారు.

13 మంది ఓపీఓల సస్పెన్షన్‌

భానుపురి (సూర్యాపేట) : ఎమ్మెల్సీ ఎన్నికలపై కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన శిక్షణకు హాజరుకాని 13 మంది ఓపీఓ(అదర్‌ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌)లను సస్పెండ్‌ చేస్తున్నట్లు కలెక్టర్‌ వెంకటరావు ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై ఆయా శాఖలకు చెందిన జిల్లా అధికారులు వివరణ సమర్పించాలని ఆదేశించారు.

632.80 అడుగులకు మూసీ నీటిమట్టం

కేతేపల్లి: మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం 632.80 అడుగులకు చేరుకుంది. హైదరాబాద్‌ నగరంతో పాటు మూసీ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న అకాల వర్షాలకు మూసీలోకి బుధవారం 732 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. మూసీ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 632.80 అడుగులకు చేరుకుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 5వ తేదీ నాటికి ప్రాజెక్టులో నీటిమట్టం 618 అడుగుల కనిష్ట స్థాయికి పడిపోగా, గత 48 రోజుల్లో దాదాపు 15 అడుగుల మేర నీరు ప్రాజెక్టులోకి చేరింది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో నీటిమట్టం 642 అడుగుల వద్ద ఉంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1.79 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

కాన్పుల సంఖ్య పెంచాలి

నేరేడుచర్ల : ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలని డీఎంహెచ్‌ఓ కోటాచలం ఆదేశించారు. బుధవారం నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 62శాతం ప్రసవాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సీతామహాలక్ష్మి విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో షోకాజ్‌ నోటీసులకు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు. మంగళ, బుధవారం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విధులకు హాజరు కాలేదని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి షోకాజ్‌ నోటీసులకు సిఫార్సు చేసినట్లు తెలిపారు. చింతలపాలెం, పాలకవీడు మండలాల్లో వైద్యాధికారుల నియామకానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. ఆయన వెంట నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు నాగిని, సౌమ్యశ్రీ ఉన్నారు.

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా పోరాటం

సూర్యాపేట : కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు, పట్టభద్రుల సమస్యలు నెరవేర్చేదాకా పోరాటం చేస్తానని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడారు. పట్టభద్రులు తనకు ఓటు వేసి గెలిపించాలన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు, జిల్లా అధ్యక్షుడు భాగ్యారెడ్డి, కర్నాటి కిషన్‌, ఆబిద్‌, నర్సింహ, లక్ష్మణ్‌రావు, పరిపూర్ణచారి, శివ, రమేష్‌, శైలేందర్‌, ఉపేందర్‌ పాల్గొన్నారు.

పాలిసెట్‌కు ఐదు కేంద్రాలు
1/1

పాలిసెట్‌కు ఐదు కేంద్రాలు

Advertisement
 
Advertisement
 
Advertisement