‘పొదుపు పెట్టుబడి’ పక్కదారి | Sakshi
Sakshi News home page

‘పొదుపు పెట్టుబడి’ పక్కదారి

Published Sat, May 25 2024 12:15 PM

‘పొదుపు పెట్టుబడి’ పక్కదారి

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్ద పీట వేసింది. పొదుపు మహిళల సారథ్యంలో జగనన్న మహిళా మార్ట్‌ (సూపర్‌ మార్కెట్‌)లకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రతి పొదుపు మహిళ నుంచి పెట్టుబడి నిధి కోసం సమీకరించిన నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు ఏడాదిన్నరగా మార్ట్‌ ఊసే లేకపోవడంతో పొదుపు మహిళలు అనుమానిస్తున్నారు. ఏపీఎం ఆ నిధులు స్వాహా చేసినట్లు సంఘ బంధాల సభ్యులు ఆరోపిస్తున్నారు.

డబ్బులు నేను స్వాహా చేయలేదు

పొదుపు సంఘాలు చెల్లించిన పెట్టునిధి డబ్బులు తాను స్వాహా చేలేదని ఏపీఎం సుజన తెలిపారు. మండలంలో మొత్తం 770 పొదుపు సంఘాలు ఉన్నాయని, ఒక్కొక్క సంఘం రూ.3,100 పెట్టుబడి నిధిగా చెల్లించాలన్నారు. మొత్తం రూ.23,87,000 వసూలు కావాల్సి ఉండగా, కేవలం రూ.4,15,000 మాత్రమే వచ్చాయన్నారు. ఈ మొత్తం కూడా సంఘం నుంచి సంఘ బంధం, సంఘ బంధం నుంచి సంఘమిత్రకు బదిలీ అయిందన్నారు. జగనన్న మహిళా మార్ట్‌ పేరుతో రూ.23 లక్షలు స్వాహా అయిందని ఆరోపణల్లో నిజం లేదన్నారు.

విచారణ జరిపి చర్యలు

తీసుకుంటాం

చేజర్ల మండలంలో జగనన్న మహిళా మార్ట్‌ నిమిత్తం వసూలు చేసిన నిధులు స్వాహా అయినట్లు నాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. గతంలో ఇలాంటి ఘటనలు నా దృష్టికి వచ్చినప్పుడు విచారించి స్వాహా చేసిన వారిపై కేసులు నమో దు చేయించాం. ప్రస్తుతం అందరూ ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నాం.. ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే చేజర్లలో మార్ట్‌ పేరుతో వసూలు చేసిన నిధులపై విచారణ జరిపిస్తాను. అవినీతికి పాల్పడినట్లు నిరూపితమైతే కఠిన చర్యలు తీసుకొంటాం. – సాంబశివారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ

మహిళా మార్ట్‌ నిమిత్తం ఒక్కొక్కరు రూ.300 వంతున పెట్టుబడి నిధి చెల్లింపు

8,052 మంది మహిళలు చెల్లించిన రూ.24 లక్షల స్వాహా?

18 నెలలుగా మార్ట్‌ ఊసే లేని వైనం

చేజర్ల: జగనన్న మహిళా మార్ట్‌ ఏర్పాటు నిమిత్తం ఏడాదిన్నర క్రితం పొదుపు మహిళల వద్ద సేకరించిన పెట్టుబడి నిధి దాదాపు రూ.24 లక్షలు డీఆర్‌డీఏ అధికారులు పక్కదారి పట్టించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నరగా మార్ట్‌ ఊసే లేకపోవడం, దీనికి సంబంధించి పొదుపు సంఘాల సమన్వయకర్తగా పనిచేస్తున్న ఏపీఎం సుజన (అడిషనల్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌) పొంతన లేని సమాధానాలు చెబుతుండడంపై పొదుపు మహిళలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పొదుపు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు పొదుపు రుణాలతో పాటు వ్యక్తిగతంగా బ్యాంక్‌ రుణాలు మంజూరు చేయించి సొంతగా వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు, పాడి పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ప్రతి మండలం కేంద్రంలో జగనన్న మహిళా మార్ట్‌లు ఏర్పాటు చేసి తద్వారా వారి ఆదాయాన్ని మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా చేజర్ల మండలంలో జగనన్న మహిళా మార్ట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కోట్లాది రూపాయల బ్యాంక్‌ లింకేజీ రుణాలతో పాటు ప్రభుత్వం అందించే సున్నా వడ్డీ రుణాలు, ఇతర పొదుపు సంఘాల రుణాలతో ఏర్పాటు చేసే చిన్న చిన్న షాపులు, దుకాణాలు ఏర్పాటు ప్రక్రియ ఏపీఎం సుజన పర్యవేక్షిస్తోంది.

ఒక్కొక్కరు రూ.300 పెట్టుబడినిధి చెల్లింపు

చేజర్ల మండలం 26 గ్రామ పంచాయతీల్లో 26 సంఘ బంధాలు, 777 పొదుపు గ్రూపులు ఉన్నాయి. 8,052 మంది పొదుపు సభ్యులు ఉన్నారు. చేజర్లలో ఏడాదిన్నర క్రితం జగనన్న మహిళా మార్ట్‌ నిమిత్తం ప్రతి పొదుపు మహిళ నుంచి రూ.300 పెట్టుబడి నిధి కింద ఏపీఎం సుజన వసూలు చేసినట్లు పొదుపు మహిళలు చెబుతున్నారు. దాదాపు రూ.24 లక్షలకుపైగా సొమ్ము వసూలు చేసినా.. ఇంత వరకు మార్ట్‌ ఊసే లేకపోగా, ఏపీఎం లెక్కలు చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పలువురు పొదుపు మహిళలు చెబుతున్నారు. ఈ నిధులు పక్కదారి పట్టాయని అనుమానాలను వ్యక్త పరిచారు.

Advertisement
 
Advertisement
 
Advertisement