కాయ్‌.. రాజా.. కాయ్‌ | Sakshi
Sakshi News home page

కాయ్‌.. రాజా.. కాయ్‌

Published Fri, May 17 2024 3:20 AM

కాయ్‌.. రాజా.. కాయ్‌

కోవూరు: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఏ పార్టీకి సిద్ధిస్తుందనే అంశంపై బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. పోలింగ్‌ శాతం పెరగడం.. విజయంపై ఇరు పార్టీ లు ధీమా వ్యక్తం చేస్తుండటంతో పందెంరాయుళ్లు రంగంలోకి దిగారు. పల్లెల్లోనే కాకుండా పట్టణాల్లోనూ బెట్టింగ్‌లు తారస్థాయిలో నడుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏయే జిల్లాల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఓట్లు పోలయ్యాయనే అంశంపై ఇప్పటికే పలువురు ఆరాతీశారు. ఈ తరుణంలో ఎవరి అంచనాలతో వారు పందేలను కాస్తున్నారు. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులకంటే మరోసారి సీఎం ఎవరవుతారనే అంశంపైనే బెట్టింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి.

పందేల్లో కొత్త పోకడ

కొన్ని చోట్ల రూ.లక్షలు.. అక్కడక్కడా రూ.కోట్లల్లో పందేలు కాస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఏకంగా భూములనే పణంగా పెడుతున్నారు. ఫలితాలు వెలువడ్డాక తేడాలు రాకుండా అగ్రిమెంట్లను ముందస్తుగానే చేసుకుంటున్నారు. కోవూరు నియోజకవర్గంలో రూ.ఐదు లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఇక్కడి ఓ గ్రామంలో వైఎస్సార్సీపీ.. కూటమి నేతలు తమ పంట పొలాలను పెట్టి పందెం కాశారు. ఈ మేరకు సాక్ష్యుల సమక్షంలో స్టాంప్‌ పేపర్లపై ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. కావలి, నెల్లూరు రూరల్‌, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరిలోనూ ఇదే తంతు నడుస్తోంది. మరోవైపు ఎన్నికలకు ముందు వరకు పందేల్లో ముందున్న కూటమి శ్రేణులు.. పోలింగ్‌ తర్వాత వెనక్కి తగ్గారు. ఇదే సమయంలో గెలుపుపై ధీమాతో ఉన్న వైఎస్సార్సీపీ అభిమానులు మాత్రం దూకుడుగా ఉన్నారు.

ఎన్నికల్లో విజయంపై జోరుగా పందేలు

లక్షల నుంచి కోట్లల్లో బెట్టింగ్‌లు

కొన్ని చోట్ల భూములను సైతం..

తేడా రాకుండా ముందుగానే అగ్రిమెంట్లు

Advertisement
 
Advertisement
 
Advertisement