వైఎస్సార్సీపీ క్లీన్‌ స్వీప్‌ ఖాయం | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ క్లీన్‌ స్వీప్‌ ఖాయం

Published Tue, May 14 2024 11:05 AM

వైఎస్సార్సీపీ క్లీన్‌ స్వీప్‌ ఖాయం

పార్టీపై జిల్లా ప్రజల ఆదరణ మరువలేనిది

జిల్లాలో రౌడీయిజాన్ని అణగదొక్కుతాం

పార్టీ నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి

విజయసాయిరెడ్డి

నెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరు లోక్‌సభ, దాని పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం తథ్యమని పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రామ్మూర్తినగర్‌లోని తన కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ సిటీ అభ్యర్థి ఖలీల్‌ అహ్మద్‌, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు తదితరులతో కలిసి విలేకరులతో సోమవారం ఆయన మాట్లాడారు. అధిక పోలింగ్‌ శాతం నమోదవ్వడం ప్రభుత్వానికి వ్యతిరేకమంటూ కొందరు మాట్లాడుతున్నారని, అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని చెప్పారు. రాష్ట్రంలోని 87 శాతానికిపైగా కుటుంబాలు సంక్షేమ పథకాలను అందుకున్నాయని, వీరందరూ తమ పార్టీకే ఓటేశారని తెలిపారు. డబ్బుతోనే రాజకీయాలు చేసేందుకు టీడీపీ నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి యత్నించారని ఆరోపించారు. లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాల్లో డబ్బులను ఆయన భారీగా పంచారని విమర్శించారు. జిల్లాలోని అన్ని సీట్లను తామే గెలవబోతున్నామని.. జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణపై ఖలీల్‌ అహ్మద్‌ గెలవబోతున్నారని చెప్పారు. కోవూరు, నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో ఓటర్లకు టీడీపీ భారీగా డబ్బులను పంచిందని, అయితే తమ పార్టీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారని స్పష్టం చేశారు. జిల్లాలో పార్టీ విజయానికి అందరూ కలిసి పనిచేశారని కొనియాడారు.

ఓటింగ్‌ శాతం పెరగడం సంతోషం

జిల్లాలో ఓటింగ్‌ భారీగా నమోదు కావడం సంతోషంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలను కొనసాగించాలనే ఉద్దేశంతో తమ పార్టీని ప్రజలు గెలిపిస్తున్నారని తెలిపారు. జిల్లాలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డి, రూప్‌కుమార్‌యాదవ్‌ రౌడీయిజాన్ని సహించబోమని స్పష్టం చేశారు. మాజీ మంత్రి నారాయణ ఆటలు ఇక సాగవని హెచ్చరించారు. అనంతరం చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. విజయసాయిరెడ్డి వచ్చాక జిల్లాలో పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement