
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో అతను 13 మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీల సాయంతో 329 పరుగులు చేశాడు. హిట్‌మ్యాన్ ఈ సీజన్‌లో ఓ మోస్తరుగా రాణిస్తున్నా విమర్శకులు అతన్ని టార్గెట్ చేస్తున్నారు.
రోహిత్ ప్రదర్శనలు ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు పెద్దగా ఉపయోగపడలేదని అంటున్నారు. హిట్‌మ్యాన్ చాలా నిర్లక్ష్యంగా, అనాసక్తిగా ఆడుతూ వికెట్ పారేసుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు. తాజాగా హిట్‌మ్యాన్ వ్యతిరేకులతో భారత మాజీ బౌలర్ అతుల్ వాసన్ కూడా గళం కలిపాడు.
ఈ సీజన్‌లో రోహిత్ ప్రదర్శనలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్రీడా జీవితంలో అన్ని సాధించాక రోహిత్ చాలా అనాసక్తిగా కనిపిస్తున్నాడంటూ కామెంట్ చేశాడు. రోహిత్‌లో ప్రేరణ కొరవడిందని అన్నాడు. ప్రేరణ కోసం అతను లక్ష్యాలను సెట్ చేసుకోవాలని సూచించాడు.
వాసన్ వ్యాఖ్యలు ఘాటుగా ఉన్నప్పటికీ అతని అభిప్రాయంతో ఏకీభవించాల్సిందే. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కోల్పోయినప్పటి నుంచి రోహిత్‌లో ఏదో తెలినీ తేడా కనిపిస్తుంది. మునుపటిలా అతను జట్టు కోసం ఆడటం లేదు. చాలా నిర్లక్ష్యంగా షాట్లు ఆడుతూ వికెట్ పారేసుకుంటున్నాడు.
ఈ సీజన్‌లోనూ అదే జరిగుతుంది. ఒకటి, రెండు మ్యాచ్‌లు మినహా రోహిత్ శ్రద్దగా ఆడింది లేదు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతూ జట్టు జయాపజయాల పట్ల పట్టీపట్టనట్లున్నాడు. టీమ్‌లో అతని ఇన్వాల్మెంట్ ఎక్కడా కనిపించడం లేదు. ఎవరి కోసమో అడుతున్నా అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు.
కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో అతని బాండింగ్ మొదటి నుంచే మిస్ అయినట్లు కనిపిస్తుంది. రోహిత్ అభిమానులు పైకి ఏమీ చెప్పలేకపోతున్నా అసలు విషయం వారికి బాగా తెలుసు. తమ ఆరాధ్య ఆటగాడు వంద శాతం కమిట్‌మెంట్‌తో ఆడటం లేదని లోలోపల వారూ మదనపడుతున్నారు.
సూర్యకుమార్ యాదవ్ మెరుపులు, రికెల్టన్ ప్రతిభ, బౌలర్ల కష్టంతో ముంబై ఇండియన్స్ అనూహ్య రీతిలో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించినప్పటికీ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆ జట్టు నెగ్గుకొస్తుందన్న ఆశలు లేవు. అదే రోహిత్ వంద శాతం కమిట్‌మెంట్‌తో ఆడితే ఫలితం అనుకూలంగా రావచ్చు.