న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్గా ప్రజ్ఞాన్ ఓజా నియామకం దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం చీఫ్ సెలక్టర్గా ఉన్న అజిత్ అగార్కర్ స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నాడు. వెస్ట్ జోన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకోలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న సెలక్టర్లలో ఎక్కువ టెస్టు మ్యాచ్లు ఆడిన అనుభవం ఉన్న ప్రజ్ఞాన్ ఓజా చీఫ్ సెలక్టర్గా బాధ్యతలు అందుకోనున్నాడు. వెస్ట్ జోన్ ఖాళీని భర్తీ చేసేందుకు బుధవారంతో గడువు ముగియగా... పార్థివ్ ఈ ప్రక్రియకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.
‘బోర్డు దరఖాస్తు గడువు పొడిగిస్తుందో లేదో తెలియదు. అక్టోబర్ 14 నాటికి పార్థివ్ దరఖాస్తు చేసుకోలేదు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. దీంతో ప్రస్తుతం సెలక్షన్ కమిటీలో సౌత్ జోన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజ్ఞాన్... తన పదవీకాలంలో మిగిలిన సమయానికి చైర్మన్గా కొనసాగనున్నాడు. జూనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ అవుతారని భావించిన రమేశ్ పొవార్... ఇప్పుడు వెస్ట్ జోన్ నుంచి సీనియర్ సెలక్టర్ పదవికి పోటీపడే అవకాశాలున్నాయి. అతడితో పాటు భారత మాజీ వికెట్ కీపర్ సమీర్ దిఘే గతంలో సెలక్టర్ల పదవుల ప్రకటన సమయంలో దరఖాస్తు చేసుకున్నారు.


