PC: Instagram
టీమిండియా మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన పునరాగమనం విషయంలో అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి మాటిచ్చాడని.. అయితే, ఆ తర్వాత తాను ఎన్నిసార్లు అడిగినా కనీసం స్పందించలేదని ఆరోపించాడు. కానీ తనలాగే జట్టుకు దూరమైన ఆటగాళ్లు మాత్రం తొందరగానే తిరిగి టీమిండియాలోకి వచ్చారని.. తనకు మాత్రం ఎదురుచూపులే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
2017లో చివరి మ్యాచ్
కాగా 2003లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అమిత్ మిశ్రా.. 2017లో తన చివరి మ్యాచ్ ఆడేశాడు. తన కెరీర్‌లో 36 వన్డేలు, 22 టెస్టులు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ లెగ్ స్పిన్నర్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 64, 76, 16 వికెట్లు పడగొట్టాడు.
అయితే, 2017లో గాయపడ్డ అమిత్ మిశ్రా ఆ తర్వాత మళ్లీ భారత జట్టులోకి తిరిగిరాలేకపోయాడు. ఈ విషయాల గురించి.. మరో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ మిశ్రా గుర్తు చేసుకున్నాడు. ‘‘బెంగళూరు మ్యాచ్‌లో నా కాలికి గాయమైంది.
అనిల్ భాయ్.. నా పరిస్థితి ఏంటి?
నాడు జట్టును వీడి వెళ్తున్న సమయంలో అప్పటి హెడ్‌కోచ్ అనిల్ కుంబ్లే దగ్గరకు వెళ్లి.. ‘అనిల్ భాయ్.. నా పరిస్థితి ఏంటి?’ అని అడిగాను. అందుకు అతడు.. ‘నువ్వేమీ బాధపడకు. ఫిట్‌నెస్ సాధించిన వెంటనే ఆటోమేటిక్‌గా జట్టులోకి తిరిగి వస్తావు’ అని చెప్పాడు.
జట్టులోకి తీసుకుంటానని కోహ్లి మాటిచ్చాడు
ఆ తర్వాత విరాట్ కోహ్లి కెప్టెన్‌గా వచ్చాడు. అప్పుడు నేను కోహ్లికి ఫోన్ చేశాను. ‘సోదరా.. జట్టులోకి రావాలంటే నేనేం చేయాలి?’ అని అడిగాను. అందుకు.. ‘నువ్వు అస్సలు బాధపడొద్దు. పూర్తి ఫిట్‌నెస్ సాధించు. అన్ని రకాలుగా కోలుకో. అప్పుడు నువ్వు కచ్చితంగా జట్టులో ఉంటావు’ అని మాటిచ్చాడు.
ఎన్నిసార్లు అడిగినా నో రిప్టై
నేను ఫిట్‌గా మారిన తర్వాత కోహ్లి దగ్గరకు వెళ్లి మళ్లీ అడిగాను. ‘సోదరా.. నా పరిస్థితి ఏమిటి?’.. అని అడగ్గా.. ‘ఇంకో వారం, పది రోజుల్లో నీకు అప్‌డేట్ ఇస్తాను’ అని చెప్పాడు. ఆ తర్వాత వారం.. రెండు వారాలు.. మూడు వారాలు.. గడిచిపోయాయి. కానీ కోహ్లి నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు.
అప్పుడు అతడికి కాల్ చేస్తే.. ఒక్కసారి కూడా ఎత్తలేదు. మెసేజ్ చేసినా బదులు ఇవ్వనే లేదు. అయినా సరే నేను ఆశ కోల్పోకుండా.. మళ్లీ కాల్ చేశాను. కానీ నో రిప్లై. ఎవరైనా మనల్ని వద్దనుకున్నపుడు ఇలాగే చేస్తారు కదా అని సరిపెట్టుకున్నాను.
నాకంటే తీవ్రంగా గాయపడ్డ ఆటగాళ్లు కూడా చాలా కాలం తర్వాత కోలుకున్నా తిరిగి జట్టులోకి వెళ్లారు. కానీ నా విషయంలో మాత్రం ఎందుకో అలా జరగలేదు. ఇందుకు గల కారణం ఏమిటో నాకు ఇప్పటికీ తెలియలేదు. నా ప్రశ్నలకు సమాధానం దొరకనే లేదు’’ అని అమిత్ మిశ్రా ఉద్వేగానికి లోనయ్యాడు.


