చెట్లపై రగడ | Sakshi
Sakshi News home page

చెట్లపై రగడ

Published Sat, May 25 2024 5:40 PM

చెట్లపై రగడ

మున్సిపల్‌ వర్సెస్‌ ‘పవర్‌’

ఇష్టారాజ్యంగా చెట్ల నరికివేతపై బల్దియా సీరియస్‌

పట్టణంలో 400పైగా నరికివేశారంటూ ఆగ్రహం

రూ.24 లక్షల జరిమానా చెల్లించాలంటూ నోటీసు

నిరంతర విద్యుత్‌ సరఫరా కోసమే అంటున్న ట్రాన్స్‌కో

రెండు శాఖల మధ్య లోపించిన సమన్వయం

సాక్షి, సిద్దిపేట: మున్సిపాలిటీ, విద్యుత్‌ శాఖల మధ్య కోల్డ్‌వార్‌ నెలకొంది. ప్రభుత్వ విభాగాలు విద్యుత్‌ బకాయిలు చెల్లించకపోతే కరెంట్‌ కట్‌ చేసి విద్యుత్‌ శాఖ ఝలక్‌ ఇచ్చేది. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. విద్యుత్‌ శాఖకు జరిమానా విధించి మున్సిపల్‌ శాఖ షాక్‌ ఇచ్చింది. ఈ నెల 19, 22వ తేదీల్లో సిద్దిపేట పట్టణంలో పలు ప్రాంతాల్లో చెట్లను విద్యుత్‌ శాఖ నరికివేయడంతో మున్సిపల్‌ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడితే కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ అంతరాయం ఏర్పడుతుందని కొమ్మలు, చెట్లను తొలగించారు. మున్సిపల్‌ అధికారులు జరిమానా విధించడంతో ఆడకత్తెరలో పోకచెక్కలా విద్యుత్‌ శాఖ అధికారుల పరిస్థితి మారింది.

ఒక్క మొక్కకు రెండు చొప్పున..

పట్టణం హరిత సిద్దిపేట పెరుగాంచింది. సుమారు పట్టణంలో 40వేల చెట్లను పెంచుతున్నారు. రోడ్లకు ఇరువైపులా ఎనిమిదేళ్ల క్రితం మొక్కలు నాటారు. అవి ఇప్పుడు పెద్దగా పెరిగాయి. విద్యుత్‌ వైర్ల కింద ఏపుగా పెరిగి విద్యుత్‌ తీగలకు తగులుతున్నాయి. దీంతో గాలి దుమారం వస్తే విద్యుత్‌ అంతరాయం ఏర్పడుతుంది. ప్రతి యేడాది ఎండాకాలంలో చెట్ల కొమ్మలను తొలగించేవారు. అందులో భాగంగా చెట్ల కొమ్మలను తొలగించారు. సిద్దిపేట పట్టణంలో సుమారు 400 చెట్లను నరికివేడంతో వాటి స్థలంలో ఒక్క చెట్టుకు రెండు చొప్పున 800 మొక్కలు నాటాలి. లేనట్లయితే రూ.24లక్షల జరిమానా చెల్లించాలని విద్యుత్‌ శాఖకు సిద్దిపేట మున్సిపాలిటీ నోటీసులు జారీ చేసింది.

శాఖల మధ్య సమన్వయ లోపం

మున్సిపల్‌, విద్యుత్‌ శాఖల మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణమైందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలకు నిరంతరాయం విద్యుత్‌ సరఫరా అందించేందుకు విద్యుత్‌ వైర్లకు కొమ్మలు తాకకుండా కొట్టివేయడం తప్పనిసరి. విద్యుత్‌ అధికారులు మున్సిపల్‌ అధికారులకు సమాచారం ఇచ్చి రెండు శాఖలు సమన్వయంతో ముందుకెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ సమన్వయం కుదరకపోవడంతో విద్యుత్‌ శాఖ అధికారులే నేరుగా రంగంలోకి దిగి కొమ్మలను తొలగించారు. అలాగే విద్యుత్‌ వైర్ల కింద మొక్కలు నాటేసమయంలో మున్సిపల్‌ శాఖ పలు జాగ్రత్తలు పాటిస్తే కొమ్మల తొలగింపు సైతం ఉండే అవకాశం ఉండదు. పెద్దగా పెరిగే మొక్కలు కాకుండా చిన్నగా పెరిగే మొక్కలు నాటితే విద్యుత్‌ వైర్లకు తగిలే అవకాశం ఉండదు. ఇప్పటికై నా రెండు శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement