ఎన్నికల వేళ.. జంపింగ్‌ల మేళా | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ.. జంపింగ్‌ల మేళా

Published Sat, Nov 18 2023 6:36 AM

- - Sakshi

సాక్షి, సిద్దిపేట: శాసన సభ ఎన్నికలకు పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్న కొద్దీ జిల్లాలో జంపింగ్‌ పాలిటిక్స్‌ జోరందుకున్నాయి. సాధారణ కార్యకర్తలు మొదలుకొని నియోజకవర్గ, మండల కీలక నేతల దాకా పార్టీలు మారుతున్నారు. పార్టీలో ఉన్నవారిని కాపాడుకోవడంతో పాటు ఇతర పార్టీల నేతలకు గాలం వేయడం, పార్టీ వీడిన వారిని మళ్లీ సొంతగూటికి ఆహ్వానించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ప్రత్యర్థి వర్గాన్ని మానసికంగా కుంగదీసేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఇతర పార్టీల్లో అసంతృప్తులను తమ వైపు లాక్కునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు.

పదవులు.. బోలెడు ఆఫర్లు

అధికారంలోకి రాగానే స్థానిక పదవుల్లో కొందరికి, రాష్ట్ర స్థాయి పదవులు మరికొందరికి అవకాశం కల్పిస్తామని ఆశచూపుతూ పార్టీలలోకి చేర్చుకుంటున్నారు. మరికొందరికి ఆర్థికంగా భరోసాను సైతం కల్పిస్తున్నారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గాలోని ప్రతి గ్రామాన్ని సందర్శిస్తున్నారు. ప్రతి ఊరిలో చేరికలు ఉండేలా నాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు. అన్ని పార్టీలు ప్రధానంగా మండల స్థాయి, ద్వితీయ శ్రేణి నాయకులపై దృష్టి కేంద్రీకరించారు. ఇతర పార్టీల మండలాధ్యక్షులు, సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, ముఖ్య నాయకులను చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జంపింగ్‌లు ఎక్కువ కావడంతో ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారింది.

బీఆర్‌ఎస్‌లో చేరిన కత్తి కార్తీక

కాంగ్రెస్‌ పార్టీ యువనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో పాల్గొన్న కత్తి కార్తీక దుబ్బాక టికెట్‌ ఆశించారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని ప్రకటించారు. దీంతో కత్తి కార్తీక తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ నేతలు సంప్రదింపులు జరిపి సఫలీకృతం అయ్యారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో కండువా కప్పి బీఆర్‌ఎస్‌లోకి మంత్రి హరీశ్‌రావు ఆహ్వానించారు. చేర్యాల కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఆది శ్రీనివాస్‌ను బీఆర్‌ఎస్‌ కండువా కప్పి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆహ్వానించారు.

కాంగ్రెస్‌లోకి మంజులా రెడ్డి

కొన్ని ఏళ్లుగా హుస్నాబాద్‌లో పలు సేవా కార్యక్రమాలను సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులారెడ్డి నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో సెప్టెంబర్‌ 7న బీజేపీలో కిషన్‌రెడ్డి సమక్షంలో చేరారు. బీజేపీ అభ్యర్థిగా శ్రీరాంచక్రవర్తిని ప్రకటించడంతో ఈ నెల 14న మాజీ ఎంపీ, హుస్నాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. చిగురుమామిడి జెడ్పీటీసీ గీకురు రవీందర్‌ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి పొన్నం ప్రభాకర్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో శుక్రవారం చేరారు.

పార్టీ మారీ.. పోటీలో నిలిచి

సిద్దిపేట నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌ను ఫార్మర్స్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు చక్రధర్‌ గౌడ్‌ ఆశించారు. చివరి నిమిషంలో బీజేపీ టికెట్‌ను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌ రెడ్డికి కేటాయించారు. దీంతో బీజేపీకి రాజీనామా చేసి బీఎస్పీ కండువా కప్పుకున్నారు. వెంటనే ఆ పార్టీ తరఫున సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా చక్రధర్‌ గౌడ్‌ బీఫాం అందుకుని బరిలో నిలిచారు.

జోరుగా రాజకీయ వలసలు

పార్టీలు మారుతున్న నాయకులు

ప్రత్యర్థుల చిత్తుకు ఎత్తుకు పైఎత్తులు

పదవులు ఆశచూపుతున్న పార్టీలు

రసవత్తరంగా రాజకీయాలు

Advertisement
Advertisement