కారు బోల్తా.. ఒకరు మృతి | Sakshi
Sakshi News home page

కారు బోల్తా.. ఒకరు మృతి

Published Sat, May 25 2024 5:25 PM

కారు బోల్తా.. ఒకరు మృతి

చిన్నశంకరంపేట(మెదక్‌): కారు అదుపు బోల్తా పడి ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన చిన్నశంకరంపేట మండలం టీ.మాందాపూర్‌ తండా–మెదక్‌ మండలం కాజీపల్లి గ్రామాల మధ్యలో చోటు చేసుకుంది. మెదక్‌ పట్టణ నవాబ్‌పేటకు చెందిన మేకల మహేశ్‌(32), అదే ప్రాంతానికి విజయ్‌కుమార్‌, పెరక రాజు, రాజు మెదక్‌ – చేగుంట ప్రధాన రహదారిపై వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి రోడ్డుపై పల్టీలు కొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రగాయాలతో మహేశ్‌ అక్కడికక్కడే మృతి చెందగా, మరో మగ్గురికి గాయాలు అయ్యాయి. అదే సమయంలో అటు వైపు వస్తున్న జెడ్పీ చైర్మన్‌ హేమలతగౌడ్‌ విషయం గమనించి కారులో ఇరుక్కుపోయిన వారిని తన సిబ్బందితో పాటు భర్త శేఖర్‌గౌడ్‌ సాయంతో బయటకు తీశారు. వెంటనే మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చిన్నశంకరంపేట పోలీస్‌లు వివరాలు నమోదు చేసుకున్నారు.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు

దుబ్బాకరూరల్‌: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని ఆరేపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై గంగరాజు కథనం మేరకు.. మండలంలోని గంభీర్‌ పూర్‌ గ్రామానికి చెందిన పర్స కనకయ్య (56) కూలి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. పని నిమిత్తం టీవీఎస్‌ ఎక్సెల్‌పై దుబ్బాకకు వచ్చి, తిరిగి వెళ్తున్నాడు. ఆరేపల్లి గ్రామ కమాన్‌ వద్ద నిజాంపేట మండలం కల్వకుంట్ల గ్రామానికి చెందిన సాయి కిరణ్‌ రెడ్డి కారులో అతివేగంగా వచ్చి కనకయ్య ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కనకయ్యకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. కారు డ్రైవర్‌ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఓఆర్‌ఆర్‌పై మహిళను ఢీకొట్టిన కారు

పటాన్‌చెరు టౌన్‌: ఓఆర్‌ఆర్‌ పై మహిళను కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన బీడీఎల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. బీడీఎల్‌ సీఐ రవీందర్‌ రెడ్డి కథనం ప్రకారం.. పటాన్‌చెరు మండలం పాటీ గ్రామ శివారులో నారాయణ కాలేజ్‌ సమీపంలో గుడిసెలు వేసుకొని ఉంటున్న మంగమ్మ ఓఆర్‌ఆర్‌ పై కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. శుక్రవారం ఉదయం డివైడర్‌ మధ్యలో పెరిగిన గడ్డిని తొలగిస్తుండగా, హైదరాబాద్‌ గచ్చిబౌలి వైపు నుంచి పటాన్‌చెరు వైపు వస్తున్న కారు మంగమ్మను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం హైటెక్‌ సిటీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి తరలించారు. గాయపడిన మంగమ్మ భర్త బోజియా ఫిర్యాదు మేరకు బీడీఎల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్టీసీ బస్‌, బైక్‌ ఢీ..

హుస్నాబాద్‌: ఆర్టీసీ బస్‌, బైక్‌ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం హుస్నాబాద్‌ పట్టణ శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కోహెడ మండలం రాంచంద్రాపూర్‌కు చెందిన దావ రాములు (42) హుస్నాబాద్‌ నియోజకవర్గం నవాబుపేటకు బైక్‌పై వెళ్తున్నాడు. మార్గమధ్యలో హుస్నాబాద్‌ పట్టణ శివారులోకి రాగానే కరీంనగర్‌ నుంచి హుస్నాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్‌ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాములుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement