ఇదో రకం దోపిడీ! | Sakshi
Sakshi News home page

ఇదో రకం దోపిడీ!

Published Tue, May 21 2024 10:55 AM

ఇదో రకం దోపిడీ!

ఖాళీ సంచులకూ కాసులే..
● అడ్వాన్సుల పేరుతో గన్నీ బ్యాగుకు రూ.పది చొప్పున వసూలు ● వంద బస్తాలు తీసుకెళితే రూ.వెయ్యి ● ధాన్యం నింపుకొచ్చినా అడ్వాన్సు తిరిగివ్వని నిర్వాహకులు ● కొనుగోలు కేంద్రాల్లో ఇష్టారాజ్యం

మా దృష్టికి రాలేదు..

గన్నీ బ్యాగుల కోసం రైతుల వద్ద అడ్వాన్సులు తీసుకుంటున్నట్లు మా దృష్టికి రాలేదు. మేము తరచూ కొనుగోలు కేంద్రాలను విజిట్‌ చేస్తున్నాం. సోమవారం కూడా అందోల్‌ ప్రాంతంలో కేంద్రాలను సందర్శించాం. అడ్వాన్సులు తీసుకుంటున్నట్లు రైతులు ఎక్కడా మాకు ఫిర్యాదు చేయడం లేదు. గన్నీ బ్యాగుల కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.

– శ్రీధర్‌, జిల్లా సహకార శాఖ

ఇన్‌చార్జి అధికారి,

సంగారెడ్డి

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలను అడుగడుగునా దోపిడీ చేస్తున్నారు. ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు రైతుల వద్ద ట్రిప్పునకు రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేలు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా గన్నీ బ్యాగుల అడ్వాన్సుల పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్కో గన్నీ బ్యాగుకు రూ.10 చొప్పున తీసుకున్న అడ్వాన్సును రైతులకు తిరిగి చెల్లించడం లేదు. ఇదేమని అడిగితే నాణ్యత, తేమ శాతం సాకుగా చూపి ధాన్యం దించుకునేందుకు కొర్రీ పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. అసలే అకాల వర్షాలు.. మరోవైపు నత్తనడకన సాగుతున్న తూకాలు.. ఇలా అనేక ఇబ్బందులు పడుతున్న రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

ఉచితంగా ఇవ్వాలి..

నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు గన్నీబ్యాగులు ఉచితంగా ఇవ్వాలి. ఈ బ్యాగుల్లో ధాన్యాన్ని నింపుకుని కేంద్రాలకు తీసుకువస్తారు. కానీ అడ్వాన్సు పేరుతో తీసుకున్న డబ్బును అందిన కాడికి దండుకుంటున్నారు. రెండు ఎకరాలున్న చిన్న, సన్నకారు రైతు 40 క్వింటాళ్ల ధాన్యాన్ని తెచ్చేందుకు 100 బస్తాలు అవసరం ఉంటుంది. ఈ వంద బస్తాలు ఇవ్వాలంటే రూ.వెయ్యి అడ్వాన్సు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. అడ్వాన్సులు అడిగితే ధాన్యం దించుకోవడంలో కిరికిరి, నాణ్యత పేరుతో ఇబ్బందులు పెడతారనే భయంతో రైతులు ఇచ్చిన అడ్వాన్సు అడగడం లేదు. దీంతో నిర్వాహకులు ఈ మొత్తాన్ని జేబులో వేసుకుంటున్నారు. ఈ వ్యవహారాన్ని విలేకరులకు చెప్పేందుకు కూడా రైతులు నిరాకరిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐకేపీ మహిళలు నిర్వహిస్తున్న కేంద్రాల్లో ఈ పరిస్థితి లేదు. ప్రధానంగా రాజకీయ నేతల కనుసన్నల్లో నడుస్తున్న కేంద్రాల్లో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది.

చాలా కేంద్రాల్లో ఇదే తంతు..

● సంగారెడ్డి జిల్లాలో మొత్తం 211 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరుగుతోంది. ఇప్పటి వరకు 14,524 మంది రైతుల వద్ద 74,894 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఈ సీజనులో ధాన్యం సేకరణకు మొత్తం 49.05 లక్షల గన్నీ బ్యాగులు అవసరమని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు. అవసరం మేరకు గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

● మెదక్‌ జిల్లాలో 410 కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరుగుతోంది. మొత్తం 47,254 మంది రైతుల వద్ద 2.05 లక్షల మెట్రిక్‌ టన్నుల ధ్యానాన్ని సేకరించారు. ఇప్పటి వరకు 54.80 లక్షల గన్నీ బ్యాగులను వినియోగించారు. మరో 38.64 లక్షల గన్నీ బ్యాగులు కేంద్రాల్లో అందుబాటులో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

● సిద్దిపేట జిల్లాలో 403 కేంద్రాల్లో ధాన్యం కొంటున్నారు. ఇప్పటి వరకు 48,294 మంది రైతుల వద్ద 2.08 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు సుమారు 52 లక్షల గన్నీ బ్యాగులను వినియోగించగా, మరో ఎనిమిది లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement