మహిళ మెడలో పుస్తెలతాడు చోరీ | Sakshi
Sakshi News home page

మహిళ మెడలో పుస్తెలతాడు చోరీ

Published Sat, May 25 2024 5:55 PM

-

పహాడీషరీఫ్‌: అవుటర్‌ రింగ్‌ రోడ్డు సర్వీస్‌ రోడ్డులో వాకింగ్‌ చేస్తున్న మహిళ మెడలోని మంగళసూత్రాన్ని దుండగులు తెంచుకొని ఉడాయించిన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ప్రతిఘటించేందుకు యత్నించిన బాధితురాలితో పాటు ఆమె కూతురు తలపై దాడి చేశారు. అయినప్పటికీ బాధితురాలి నిందితుల బైక్‌ తాళంచెవి లాక్కొవడంతో, చేసేది లేక బైక్‌ అక్కడే వదిలేసి మూడున్నర తులాల బంగారు గొలుసుతో పారిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంఖాల్‌ గ్రామానికి చెందిన గడ్డమీది మహేందర్‌ భార్య కల్పన(32) వేసవి సెలవులు కావడంతో ఆమె పిల్లలు లక్ష్మీ ప్రసన్న, హేమ చందర్‌, హేమంత్‌, పక్కింటి పిల్లలు పావనీ, నేహశ్రీ, మనీష్‌ కుమార్‌లతో కలిసి శుక్రవారం ఉదయం 5 గంటలకు ఓఆర్‌ఆర్‌ శంషాబాద్‌ వైపు సర్వీస్‌ రోడ్డులో కిలోమీటర్‌ నడిచి తిరిగి మంఖాల్‌కు వస్తున్నారు. 5.50 గంటల సమయంలో ఇద్దరు యువకులు రోడ్డు పక్కన హెల్మెట్లు ధరించి షైన్‌ బైక్‌తో నిలబడ్డారు. పిల్లలు ముందు నడుస్తుండగా కల్పన వెనుకాల నడుచుకుంటూ పోతుంది. ఈ సమయంలో ఒక్కసారిగా నిందితులు తమ చేతిలోని ఎర్రటి వాటర్‌ బాటిల్‌లో ఉన్న నీటిని కల్పన కళ్లల్లో చల్లారు. ఆమె కల్లు మూసుకోవడంతో మెడలోని మూడున్నర తులాల బంగారు మంగళసూత్రాన్ని తెంచారు. గొలుసును ఒక వైపు లాగి పట్టుకోగా, నిందితులు కర్రతో ఆమె నుదుటిపై బాదారు. ఇది గమనించిన కల్పన కుమార్తె లక్ష్మీ ప్రసన్న పట్టుకునేందుకు యత్నించగా ఆమెను కూడా కర్రతో కొట్టారు. గాయాలైనప్పటికీ కల్పన చాకచక్యంతో బైక్‌ తాళం చెవి గుంజుకొని గట్టిగా కేకలు పెట్టారు. భయపడిపోయిన నిందితులు బైక్‌ను అక్కడే వదిలేసి మంగళసూత్రంతో అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డ ఇద్దరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు డీఐ సుధీర్‌కృష్ణ పర్యవేక్షణలో స్థానికంగా సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

అడ్డుకున్న కుమార్తైపె దాడి చేసిన స్నాచర్లు

కేకలు వేయడంతోబైక్‌ను వదిలేసి పరారు

Advertisement
 
Advertisement
 
Advertisement