ఈవీ రయ్‌ రయ్‌.. | Sakshi
Sakshi News home page

ఈవీ రయ్‌ రయ్‌..

Published Sat, May 25 2024 5:55 PM

ఈవీ రయ్‌ రయ్‌..

గ్రేటర్‌లో 1.20 లక్షలకు పైగా ఎలక్ట్రిక్‌ వాహనాలు

గ్రేటర్‌ పరిధిలో ప్రత్యేకంగా సగటు వేతన జీవులు ఎలక్ట్రిక్‌ బైక్‌లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో గత రెండేళ్లుగా ఈ వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం గ్రేటర్‌లో సుమారు లక్షా 20 వేలకు పైగా ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉన్నాయి. వాటిలో లక్షకు పైగా ద్విచక్ర వాహనాలే ఉన్నట్లు అంచనా. ఈ కేటగిరీకి చెందిన వాహనాల అమ్మకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నగరంలో సుమారు ఐదారేళ్ల క్రితమే ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం మొదలైంది. కానీ ఈ మూడేళ్లుగా బ్యాటరీ బండ్ల దూకుడు పెరిగినట్లు రవాణా అధికారులు చెబుతున్నారు.

బ్యాటరీల భరోసా పెరిగింది...

గతంలో కంటే ఇప్పుడు నాణ్యమైన బ్యాటరీలు వినియోగంలోకి వచ్చాయి. దీంతో వాహనదారులకు ఎలక్ట్రిక్‌ వాహనాలపైన భరోసా పెరిగింది. నాలుగేళ్ల క్రితం నాసిరకం బ్యాటరీల కారణంగా తరచుగా ప్రమాదాలు జరగడంతో చాలామంది వెనుకడుగు వేశారు. కానీ కొన్ని ఆటోమొబైల్‌ సంస్థలు నాణ్యమైన బ్యాటరీలతో మార్కెట్‌లోకి వచ్చాయి. ఐదేళ్ల వారెంటీలతో వాహనాలను విక్రయిస్తున్నాయి. ‘మొదట్లో నాణ్యత లేని బ్యాటరీలు త్వరగా వేడెక్కేవి. కానీ రెండేళ్లుగా ఆటోమోటివ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (ఏఐఎస్‌) ధృవీకరించిన ప్రమాణాల మేరకు బ్యాటరీలు వస్తున్నాయి. నాణ్యత బాగా పెరిగింది. బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (బీఎంఎస్‌) బాగుంది.’ అని ఓ ఆటోమొబైల్‌ డీలర్‌ చెప్పారు. దీంతో ధర కాస్త ఎక్కువే అయినా నమ్మకమైన బ్రాండ్‌లకు చెందిన వాహనాలనే వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం కార్లతో పాటు 2 లక్షల బైక్‌లకు జీవితకాల పన్ను నుంచి మినహాయింపునిచ్చింది. హైదరాబాద్‌తో పాటు, తెలంగాణ అంతటా ప్రస్తుతం 1.6 లక్షలకు పైగా ద్విచక్రవాహనాలు రోడ్డెక్కాయి. మరో 90 వేలకు పైగా వాహనాలకు పన్ను మినహాయింపు అవకాశం ఉంది. ఎలక్ట్రిక్‌ కార్లకు కూడా జీవితకాల పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. దశలవారీగా 8 వేలకు పైగా వాహనాలకు ఈ అవకాశం లభించింది.

వెయిట్‌ ప్లీజ్‌...

ఎలక్ట్రిక్‌ బైక్‌లకు ఇటీవల భారీగా డిమాండ్‌ పెరిగిన దృష్ట్యా..కొనుగోలుదారులు కనీసం రెండు, మూడు నెలల ముందే వాహనాలను బుక్‌ చేసుకోవలసి వస్తోంది. కొన్ని బ్రాండ్‌లకు చెందిన వాహనాల కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొని కనీసం 3 నెలల పాటు ఎదురుచూడవలసి వస్తుందని కుషాయిగూడకు చెందిన రాఘవ తెలిపారు. పెట్రోల్‌ వాహనాల కంటే ధర కొద్దిగా ఎక్కువే అయినా ఇంధన భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్‌ బైక్‌ కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement