మహిళలకు ఉపాధి | Sakshi
Sakshi News home page

మహిళలకు ఉపాధి

Published Wed, May 22 2024 11:30 PM

మహిళలకు ఉపాధి

● యూనిఫామ్‌ దుస్తులు కుడుతున్న స్వశక్తి సంఘాల సభ్యులు ● 41,680 మంది విద్యార్థులకు డ్రెస్సులు ● 52 సంఘాలలో 557 మందికి పని ● వేసవిలో చేతినిండా ఉపాధి

ముస్తాబాద్‌(సిరిసిల్ల): నిండు వేసవిలో మహిళలకు చేతినిండా పనిదొరుకుతుంది. ఇంట్లోనే యూనిఫామ్స్‌ కుడుతూ ఉపాధి పొందుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌ దుస్తులు కుడుతూ ఎండాకాలంలో ఉపాధి పొందుతున్నారు. జిల్లాలోని 41,680 మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున 83,360 దుస్తులను 52 స్వశక్తి సంఘాలకు చెందిన 557 మంది మహిళలు కుడుతున్నారు.

ఒకటి నుంచి ఇంటర్‌ వరకు..

ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ చదివే విద్యార్థులకు యూనిఫామ్‌ దుస్తులను ప్రభుత్వం అందజేస్తుంది. ప్రభుత్వమే వస్త్రాన్ని సరఫరా చేయగా.. నెల రోజుల క్రితం మహిళా సంఘాల్లోని సభ్యులు విద్యార్థుల కొలతలు తీసుకున్నారు. పొట్టి, పొడుగు లేకుండా సరైన కొలతలతో దుస్తులను అందించేందుకు డీఆర్‌డీఏ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 19,550 మంది బాలురు, 22,130 మంది బాలికలకు యూనిఫామ్స్‌ సిద్ధం చేస్తున్నారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల దుస్తులు అందించనున్నారు.

రోజుకు పది డ్రెస్సులు

ఒక్కో మహిళ రోజుకు పది నుంచి పన్నెండు డ్రెస్సులను కుడుతున్నారు. డ్రెస్సుకు రూ.50 కూలీ ప్రభుత్వం చెల్లిస్తోంది. అంటే ఒక మహిళ రోజుకు రూ.500 వరకు సంపాందించుకునే అవకాశం ఉంది. అయితే బట్టను కొలతల్లో ఒకచోట కత్తిరిస్తుండగా, కాజాలు, గుండీలు మరోచోట పెడుతున్నారు. ఈ లెక్కన స్వశక్తి మహిళలకు డ్రెస్సుకు రూ.40 వరకు వచ్చే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఒక్కో మండలంలో 20 నుంచి 40 మంది వరకు మహిళలు పనిచేస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాల్టీల్లో మెస్మా ఆధ్వర్యంలో స్వశక్తి మహిళలు యూనిఫామ్స్‌ కుడుతున్నారు. బాలురకు ప్యాంట్‌, షర్టు, బాలికలకు పంజాబీ డ్రెస్సులు అందజేయనున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement