పాపయ్యపల్లెను సందర్శించిన డీపీవో | Sakshi
Sakshi News home page

పాపయ్యపల్లెను సందర్శించిన డీపీవో

Published Tue, Nov 14 2023 12:28 AM

ముస్తాక్‌(ఫైల్‌) - Sakshi

తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని పాపయ్యపల్లె గ్రామపంచాయతీని సోమవారం జిల్లా పంచాయతీ అధికారి ఎ.రవీందర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా పంచాయతీ రికార్డులను పరిశీలించి పంచాయతీ కార్యదర్శిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి వాణి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

ఇల్లంతకుంటలో సోషల్‌మీడియా వార్‌

తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఎన్నికల ఓటింగ్‌ సమీపిస్తున్న వేళ ఇల్లంతకుంట మండలంలో వేడి రాజుకుంటోంది. రాజకీయ పార్టీల ప్రధాన అనుచరులు సోషల్‌ మీడియా వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు ఒకరిపై ఒకరు ఘాటైన వ్యాఖ్యలు చేసుకుంటుంటే.. తామేం తక్కువ కాదు అన్నట్లు బీజేపీ నాయకులు విమర్శలకు దిగుతున్నారు. తమ నాయకుడే గొప్ప అంటే కాదు తమ లీడరే గొప్ప అంటూ పోస్టులపై పోస్టులు పెడుతున్నారు. వీరి విమర్శల పోస్టులు వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్లకు తలనొప్పిగా మారింది.

దాచిన బంగారం

రేషన్‌పాలు !

సిరిసిల్లక్రైం: దాచిన బంగారం రేషన్‌బియ్యంలో కలిసిపోయింది. పనికి వెళ్లేటప్పుడు దొంగలు దోచుకెళ్తున్నారని భయపడి ఓ వివాహిత బియ్యం సంచిలో బంగారు గొలుసును దాయగా.. ఆ బియ్యాన్ని కాస్త భర్త అమ్మివేయడంతో ఆమె లబోదిబోమంటోంది. సిరిసిల్ల మున్సిపాలిటీ విలీన గ్రామం చంద్రంపేటకు చెందిన బాలవ్వ పొలం పనులకు వెళ్తున్నానని తన మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసును ఇంటిలోని ఓ రేషన్‌బియ్యం సంచిలో దాచింది. ఈ విషయం తెలియని ఆమె భర్త ఆ రేషన్‌బియ్యాన్ని ముష్టిపల్లిలోని ఓ రైస్‌మిల్లులో విక్రయించాడు. సాయంత్రం పొలం నుంచి ఇంటికొచ్చిన బాలవ్వకు బియ్యం బస్తా కనిపించకపోవడంతో భర్తను అడిగింది. బియ్యాన్ని రైస్‌మిల్లులో అమ్మినట్లు తెలపడంతో అసలు విషయాన్ని భర్తకు తెలిపి.. హుటాహుటిన రైస్‌మిల్లుకు వెళ్లి.. వారిని అడిగారు. బియ్యాన్ని లెవీలో కలిపేశామని, సంచుల్లో నింపేటప్పుడు దొరికితే ఇస్తామని వారు చెప్పారు. చేసేదేమి లేక ఇంటిముఖం పట్టారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు చంద్రంపేటలో చర్చగా మారింది.

నలుగురి బైండోవర్‌

జమ్మికుంట(హుజూరాబాద్‌): పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులను సోమవారం తహసీల్దార్‌ రజని ఎదుట బైండోవర్‌ చేసినట్లు సీఐ రమేశ్‌ తెలిపారు. వీరిపై గతంలో కేసులు నమోదయ్యాయని, ఎన్నికల నియమావళిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

పేకాట స్థావరంపై దాడి

మెట్‌పల్లి: రెడ్డి కాలనీలోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై సోమవారం పోలీసులు దాడి చేశారు. పక్కా సమాచారంతో దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు. వారి నుంచి రూ.6.50లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

విద్యుదాఘాతంతో

యువకుడి దుర్మరణం

కోరుట్లరూరల్‌: చిన్నమెట్‌పల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో మహమ్మద్‌ ముస్తాక్‌(30) అనే వ్యక్తి మృతిచెందాడు. సోమవారం తను కౌలుకు చేసే పొలంలో కింద పడి ఉన్న విద్యుత్‌ తీగను చుడుతుండగా.. షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

Advertisement
Advertisement