Sakshi News home page

ఇల్లే నందనవనం..

Published Wed, Nov 15 2023 12:30 AM

- - Sakshi

● ఇళ్లలో మొక్కల పెంపకంపై పెరుగుతున్న ఆసక్తి ● పూలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయల సాగు ● ప్రకాశం మిద్దెతోటల పెంపకం గ్రూప్‌ ఏర్పాటు ● మొక్కల పెంపకంపై అవగాహన

సాక్షిప్రతినిధి, ఒంగోలు: ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చేసుకుంటూ అనారోగ్యానికి దూరంగా ఉంటున్నారు. పల్లెల్లో, పట్టణాల్లో చాలా ఇళ్లలో పెరటి సాగు కనిపిస్తుంది. కూరగాయల సాగు ఏర్పాటు చేసుకుని స్వయంగా కూరగాయలు పండించుకుంటున్నారు. ఈ ఒక్క ఆలోచన వారి కుటుంబానికి సరిపడా పౌష్టికాహారం అందిస్తోంది. ఇంటి పైనే కూరగాయలు, పూలు, పండ్లు పండిస్తూ వాటినే వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, మహారాష్ట్ర, తూర్పుగోదావరి జిల్లాలోని కడియం నర్సరీల నుంచి రకరకాల పూలు..పండ్ల మొక్కలను తెచ్చుకుంటున్నారు. అలాగే రకరకాల కాయగూరలకు సంబంధించిన విత్తనాలను వివిధ పట్టణాల నుంచి తెచ్చుకుంటున్నారు. ఇంటి పంటలపై ఆసక్తి ఉన్న హైదరాబాద్‌కు చెందిన తుమ్మేటి రఘోత్తమరెడ్డి నగరంలోని చాలా మందికి ఉచితంగా విత్తనాలను అందజేస్తున్నారు. అంతేకాకుండా మొక్కల పెంపకంపై పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

ఇంటిపంటలో పెంచుతున్న మొక్కలు ఇవి..

నగరంలో చాలా మంది ఇళ్లలో ఎక్కువగా పూలు, ఆకు కూరలు, కూరగాయలు, రకరకాల పండ్ల మొక్కలను పెంచుతున్నారు. వివిధ రకాల క్రోటన్స్‌, మందారం, బంతి, మల్లి, సన్నజాజి, గులాబి, తులసి, పత్తి మందారం, సంపంగిలతో పాటు బొప్పాయి, జామ, అరటి, మామిడి, సపోట, దానిమ్మ, ఆపిల్‌ను పండిస్తున్నారు. అలాగే బెండ, అరటి, దొండ, బీర, కాకరకాయ, సొరకాయ, పొట్లకాయ, టమోట, పచ్చిమిర్చి, గోరు చిక్కుడు, పందిరి చిక్కుడు, మునక్కాయలు తదితర కాయగూరలతో పాటు తోటకూర, మెంతికూరలను సైతం సాగుచేస్తున్నారు.

ప్రతి రోజూ గంట నుంచి

రెండు గంటల శ్రమ..

ఇంట్లో మొక్కలు పెంచడం కోసం ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం లేవగానే మొక్కలకు నీళ్లు పడతారు. మొక్కలకు ఏవైనా చీడ, పీడలు ఆశిస్తే వాటిని తొలగించి అవసరమైన చోట సహజసిద్ధ వనరులతో తయారు చేసిన మందులను స్ప్రే చేస్తారు. చాలా మంది సొంతంగా జీవామృతాన్ని, వేపనూనె, పిట్టు, పిడకలను తయారు చేసుకుంటున్నారు. మరికొందరు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నారు. అలాగే నగరంలోని గోశాల నుంచి ఆవు ఎరువు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గేదె ఎరువులను సేకరిస్తున్నారు. రెండు, మూడు నెలలకొకసారి మొక్కలన్నింటినీ అవసరమైన మందులు జల్లుతారు. ఈ ప్రక్రియ ఒకరోజు పడుతుంది. ఇలా చెట్లను సంరక్షిస్తూ తన ఇంటి పరిసరాలను ఆహ్లాదంగా ఉంచుతూ.. ఇంట్లోకి ఆరోగ్యకరమైన పండ్లను, కూరగాయలను పండించుకుంటున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement