కీచకపర్వంపై విజయ్‌ దిగ్భ్రాంతి.. ఉదయ్‌నిధిపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు | Shame On You Stalin Trend Amid Anna University Incident | Sakshi
Sakshi News home page

క్యాంపస్‌లో కీచకపర్వంపై విజయ్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. ఉదయ్‌నిధిపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

Dec 26 2024 10:43 AM | Updated on Dec 26 2024 1:44 PM

Shame On You Stalin Trend Amid Anna University Incident

రాజధాని నడిబొడ్డున.. అదీ ప్రభుత్వ రంగ యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి తీవ్ర చర్చనీయాంశమైంది. ఇద్దరు దుండగులు..

చెన్నై: నగరం నడిబొడ్డున జరిగిన దారుణ ఘటన.. తమిళనాడును ఉలిక్కి పడేలా చేసింది. ప్రముఖ ప్రభుత్వ విద్యాసంస్థ వర్సిటీ క్యాంపస్‌లోనే ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. ఆమెతో ఉన్న స్నేహితుడిపై దాడి చేసి మరీ.. దగ్గర్లోని పొదల్లో లాక్కెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.  ఈ కీచకపర్వంతో విద్యార్థి లోకం భగ్గుమంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టింది. మరోవైపు ఈ ఘటనపై అగ్ర నటుడు, టీవీకే అధినేత విజయ్‌(TVK VIjay) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.   

‘‘చెన్నై అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారనే సమాచారం మాకు అందింది.  అయితే ఈ కేసులో ఉన్నవాళ్లు ఎంతటివాళ్లైనా వదలిపెట్టకూడదు. బాధితురాలికి తక్షణ న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.. 

.. రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి. అఘాయిత్యాలు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతను పెంచాలి. ఉమెన్‌ సేఫ్టీ కోసం మొబైల్‌ యాప్స్‌, స్మార్ట్‌ పోల్స్‌, ఎమర్జెన్సీ బటన్స్‌, సీసీ కెమెరాలు, టెలిఫోన్లను ఏర్పాటు చేయాలి.  పబ్లిక్‌ ప్లేసుల్లో వాళ్ల కోసం కనీస వసతులు ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వ-ప్రవేట్‌ విద్యా సంస్థలను కూడా ఇందులో చేర్చాలి. బాధితులకు అవసరమైన న్యాయ సహాయం ప్రభుత్వమే అందించాలి. మానసికంగా ధైర్యంగా ఉంచేందుకు కౌన్సెలింగ్‌లాంటివి ఇప్పించాలి. వీటన్నింటి కోసం ప్రతీ ఏడాది నిర్భయ ఫండ్‌ నుంచి ఖర్చు చేయాలి. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం వెనకడుగు ఉండకూడదు. నిరంతరం ఈ వ్యవస్థను సమీక్షిస్తూ ఉండాలి’’ అని విజయ్‌ (Vijay) తన ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు.

మరోవైపు.. ప్రభుత్వ విద్యా సంస్థలో జరిగిన ఈ ఘటనపై ప్రతి పక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి . అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, బీజేపీ అధ్యక్షుడు అన్నామలై(Annamalai), డీఎండీకే ప్రధాన కార్యదర్శిప్రేమలత విజయకాంత్‌, పీఎంకే నేతలు రాందాసు, అన్బుమణి రాందాసు వేర్వేరు ప్రకటనలో ఈ ఘటనను ఖండించారు. విద్యా సంస్థలలోనూ విద్యార్దినులకు భద్రత కరువైందన్న ఆందోళనను వ్యక్తంచేశారు. ఈ ఘటన సిగ్గుచేటు అని, నేరగాళ్లకు తప్పా, ఇతరులు ఎవ్వరికి ఈ ప్రభుత్వంలో కనీస భద్రత కరువైందని మండిపడ్డారు.

కాగా ఉన్నత విద్యా మంత్రి కోవి చెలియన్‌ మాట్లాడుతూ, ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయడం శోచనీయమన్నారు. నిందితులు కఠినంగా శిక్షించ బడుతారన్నారు. ఓ విద్యార్థినిపై జరిగిన ఈ దాడిని కూడా రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదన్నారు.

ShameOnYouStalin
కాగా ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు జ్ఞానశేఖరన్‌.. క్యాంపస్‌ దగ్గర్లోనే ఓ బిర్యానీ సెంటర్‌ నడిపిస్తున్నాడు. అయితే అతనికి నేర చరిత్ర ఉండడంతో పాటు అధికార డీఎంకే పార్టీ కార్యకర్త కావడం ఈ వ్యవహారాన్ని సోషల్‌ మీడియాకు ఎక్కించింది. గతంలోనూ  డిప్యూటీ సీఎం ఉదయ్‌నిధి స్టాలిన్‌తోపాటు మరికొందరు డీఎంకే పెద్దలతో  నిందితుడు దిగిన ఫొటో ఒకటి వైరల్‌ అవుతోంది. అంతేకాదు.. డీఎంకే యువ విభాగం ప్రెసిడెంట్‌గానూ పని చేశాడనతను. 

నిందితుడు జ్ఞానశేఖరన్‌ అధికార డీఎంకే కార్యకర్త కావడంతో విషయాన్ని పక్కదోవ పట్టించి నిందితుడ్ని తప్పించే ప్రయత్నం జరుగుతోందని విద్యార్థులు అంటున్నారు.  ఘటన తర్వాత బాధితురాలి దగ్గరకు ఎవరినీ వెళ్లనివ్వలేదని.. యూనివర్సిటీ అధికారులు కేసును పక్కదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని కొందరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు తోడు మరోవైపు.. పెరియాకుప్పం సముద్ర తీరంలో పిక్‌నిక్‌ వెళ్లిన కొందరు యువతులపై తప్పతాగిన ఆగంతకులు అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అయితే తమిళనాడులో మహిళలకు భద్రత కరువైందంటూ.. #ShameOnYouStalin హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది.

నిందితుడు జ్ఞానశేఖరన్‌ కాళ్లకు, చేతులకు దెబ్బలు తగిలి.. బ్యాండేజ్‌తో  ఉన్న ఫొటో ఒకటి వైరల్‌ అవుతోంది. దీంతో డీఎంకే ప్రభుత్వం న్యాయం చేసిందని, గతం పొల్లాచ్చి కేసులో నిందితుడు పారిపోయినప్పుడు అన్నాడీఎంకే ప్రభుత్వం ఉందని.. ఆ సమయంలో బీజేపీ కూడా ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక నిరసలు చేయలేదని కొందరు డీఎంకే అనుకూల పోస్టులు పెడుతున్నారు. అయితే విక్షాలు దీన్ని ప్రభుత్వ జిమ్మిక్కుగా కొట్టి పారేస్తున్నాయి.

 

డీఎంకే స్పందన ఇది

ఈ ఆరోపణలను అధికార డీఎంకే ఖండించింది. ఒక నేతతో ఒకరు ఫొటో తీసుకుంటే సరిపోతుందా?. నేరం ఎవరు చేసినా చట్టం ఊరుకోదు. ఈ కేసులోనూ అంతే. ప్రతిపక్షాలకు డీఎంకేను విమర్శించడానికి ఏం దొరక్కట్లేదు. అందుకే శాంతి భద్రతల వంకతో నిత్యం విమర్శలు చేస్తోంది. మా పాలనలో నిజంగా.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి ఉంటే విమర్శించనివ్వండి. నిజంగా.. నిందితుడు తప్పించుకుని ఉంటే నిందించండి.  అధికార పార్టీ ఎంపీనే అరెస్ట్‌ అయ్యి రెండు నెలలు జైల్లో ఉన్నారు. ఇక్కడే డీఎంకే పాలన ఎలా ఉంటుందో మీకు అర్థమై ఉండాలి. తప్పు ఎవరూ చేసినా మా ప్రభుత్వం.. శిక్ష పడేవరకు ఊరుకోదు అని డీఎంకే నేత శరవణన్‌ మీడియాకు తెలిపారు.

నిఘా నీడలోని క్యాంపస్‌లోనే..

చైన్నె నగరంలోని గిండి సమీపంలోని అన్నావర్సిటీ(Anna university) ఉంది.  ఇక్కడే యూజీ, పీజీ హాస్టళ్లు సైతం ఉన్నాయి. ఈ పరిసరాలు ఎంతో ఆహ్లాదకరంగానూ ఉంటాయి. ప్రభుత్వ రంగ విద్యా సంస్థ కావడంతో ఈ పరిసరాలన్నీ సీసీ కెమెరాల నిఘాతో ఉంటాయి. దీనికి కూతవేటు దూరంలోనే ఐఐటీ మద్రాసు ఉంది. ఈ పరిసరాలన్నీ విద్యా సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఉండడంతో ఎల్లప్పుడూ భద్రత నీడలోనే ఉంటాయి. ఈ పరిస్థితులలో బుధవారం ఉదయం ఓ ఘటన కలకలం రేపింది.

సోమవారం రాత్రి 8గం. టైంలో ఓ యువతి తన స్నేహితుడితో ఉండగా.. దాడి చేసి ఆమెను పొదల్లోకి లాక్కెల్లి అత్యాచారం చేశారు.  19 ఏళ్ల ఆ విద్యార్థిపై ఇద్దరు అగంతకులు ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం బయటకు వచ్చింది. దీంతో విద్యార్థులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. నిందితులను పట్టుకోవాలని నినదిస్తూ ఆందోళనకు దిగారు. అయితే..  

బుధవారం ఉదయాన్నే ఈ సమాచారం మీడియా చెవిన పడింది. దీంతో అన్ని మార్గాలను వర్సిటీ అధికారులు మూసి వేశారు. మీడియానూ లోనికి అనుమతించకుండా జాగ్రత్త పడ్డాయి. ఈ విషయం తెలిసి కొందరు విద్యార్థులు ఆందోళనను ఉధృతం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు వాళ్లను బుజ్జగించారు. బాధితురాలి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వాళ్లు శాంతించారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి దర్యాప్తు వేగాన్ని పెంచారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో 30కు పైగా ఉన్న సీసీ కెమెరాలలోని దృశ్యాలను పరిశీలించారు. విధులలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వద్ద విచారించారు. తమకు లభించిన సమాచారం మేరకు 37 ఏళ్ల జ్ఞానశేఖరన్‌ను అరెస్ట్‌ చేశారు.

ఇదీ చదవండి: దుస్తులు మార్చుకుంటుండగా వీడియోలు తీసి.. 

Advertisement
 
Advertisement
Advertisement