
వైఎస్ జగన్ నిబద్ధతతో కూడిన రాజకీయం చేశారు
వైఎస్సార్‌సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: రాజకీయం పేరుతో సీఎం చంద్రబాబు సాగిస్తున్న వికృత క్రీడను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులపై ఉందని పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులతో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘చంద్రబాబు పాలనలో జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు ఏం చేశామన్నది మాత్రమే రాజకీయ పార్టీ పనితీరుకు ప్రాతిపదిక అవుతుందని బలంగా నమ్మారు. చంద్రబాబు మాత్రం మీడియా ద్వారా ప్రజలను ప్రలోభపెట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరింత ఎక్కువగా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పెట్టుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. ఇటీవల వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించింది. టీడీపీ అనుకూలంగా ఓటు వేసింది. కానీ, టీడీపీ తిరిగి వారి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ద్వారా వైఎస్సార్‌సీపీపై తప్పుడు ప్రచారం చేసింది.
టీడీపీ వాళ్లు చేసిన స్కామ్‌లకు ఆధారాలున్నా వాటిపై కూడా ఫేక్ ప్రచారం చేస్తూ ప్రజలు ఆలోచించే అవకాశం లేకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో పై స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు బందిపోట్ల తరహాలో ఇసుక, కాంట్రాక్టులు, నామినేటెడ్ పనుల్లో దోపిడీ చేస్తున్నారు. అమరావతి పేరుతో అంచనాలు పెంచి దోచేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ప్రకటిస్తూ మొబిలైజేషన్ అడ్వాన్సులు ప్రవేశపెట్టి దాని ద్వారా మొదట్లోనే కమీషన్లు దండుకుంటున్నారు. ప్రాజెక్టులు వచ్చినా, రాకపోయినా అడ్వాన్సుల పేరిట దోచుకుంటున్నారు. ఇవి ప్రజల దృష్టిలో పడకుండా డైవర్షన్ కోసం వైఎస్సార్‌సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. అధికారంలో ఉండగా వైఎస్ జగన్ నిబద్ధతతో కూడిన రాజకీయం చేశారు.

పేదలకు, సంపన్నులకు మధ్య అంతరాలు తగ్గించడం, నిజమైన ప్రజాస్వామ్యంలో మహాత్మా గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించడం కోసం ఏం చేయాలో... అది చేసి చూపించిన నాయకుడు వైఎస్ జగన్. ఐదేళ్లు జగన్ పాలనలో కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా సంక్షేమాన్ని చూశాం. చంద్రబాబు పాలనలో టీడీపీ కార్యకర్తలు, నేతల ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటున్నారు’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.